ఓల్గా నుంచి గంగకు…విస్తృత ప్రాతిపదికమీద రచనల్ని మౌలికంగా రెండు విధాలుగా విభజించి చూడవచ్చు. మొదటి రకం కల్పితాలు. రెండవ రకం వాస్తవాలు. ఈ రెండు కలగలసిన రచనలే ఎక్కువ. చారిత్రక రచనల విషయానికి వస్తే ఖచ్చితత్వం పాటించాల్సిన రచనలు
దురదృష్టవశాత్తూ కల్పితాలుగా, కల్లబొల్లి కథనాలుగా పాలక పక్ష బాకాలుగా లభిస్తున్న సందర్భాలే ఎక్కువ. అయితే అలాంటి దౌర్బాగ్యం నుండి విముక్తి కలిగించి మానవ సమాజ పరిణామ క్రమాన్ని ఖచ్చితంగా మన ముందుకు తెచ్చిన పుస్తకం ‘ఓల్గా నుంచి గంగకు’.
రాతి యుగానికి పూర్వం నుంచి మానవుని జీవితం ఎలా సాగుతూ వస్తోందో.. దొరికిన చారిత్రక సాక్ష్యాధారాలను ఆలంబనగా చేసుకుని సాధారణ పాఠకులకు అర్థమయ్యే రీతిలో ఆసక్తి కలిగించే విధంగా మానవ చరిత్రను చెప్పే మహత్తర ప్రక్రియ ఇది.
రాహుల్‌ సాంకృత్యాయన్‌!!! అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయిత. బహుభాషా పండితుడు. గొప్ప చరిత్ర కారుడు. స్వాతంత్య్ర సమరయోధుడిగా సుదీర్ఘకాలం కారాగారంలో గడిపిన త్యాగశీలి. ఆయన స్వయంగా అనేక ప్రదేశాలు తిరిగి పరిశోధించి మానవ సమాజ క్రమాన్ని ఒక అద్భుత చరిత్రగా మలచి మన ముందుకు తెచ్చిన పుస్తకం… ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న ”ఓల్గా నుంచి గంగకు”. ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు.
మనిషి ఎప్పుడూ నిలకడగా లేడు. సమాజం కూడా అందుకు అనుగుణంగా మారుతూనే వచ్చింది. ఆ క్రమంలోనే నాయకత్వం మార్పు జరిగింది. లింగ వివక్ష తెరమీదకు వచ్చింది. గుంపుకు నాయకత్వం వహించిన ఆదిమ మహిళ నుండి నేటి ఆధునిక మహిళవరకు సమాజంలో వచ్చిన మార్పులు ఏమిటి?? మాతృస్వామ్య వ్యవస్థ పితృస్వామ్య భావజాలానికి జారిపోయిన క్రమం ఎలాంటిది? ఈ ప్రశ్నలకు సమాధానమే ”ఓల్గా నుంచి గంగకు”.
క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల కాలం నుంచి క్రీస్తు శకం 1942 వరకు జరిగిన కాలంలో ఇండో యూరోపియన్‌ జాతి మానవ వికాసాన్ని ఆసక్తికరమైన 20 కథలుగా మలిచారు రాహుల్‌. ఓల్గా తీరపు మంచు ఎడారి నేపధ్యంగా సాగే తొలి కథ ‘నిశి’తో మొదలుపెట్టి పాట్నాలోని గంగా తీరంలో సాగే ”సుమేరుడి” కథ వరకు సాగే ‘ఓల్గా నుంచి గంగ వరకు’లో అన్ని కథలు ఊపిరి బిగపట్టి చదివించేవే.
తొలి కథలో ఆర్యుల సంస్కృతి కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు రాహుల్‌. స్త్రీ కుటుంబ పెద్దగా ఉండడం, ఆమె సారధ్యంలో కుటుంబం యావత్తూ వేటకు వెళ్ళడం, ఆమె తనకు నచ్చిన పురుషుడితో (సోదరుడు, కుమారుడు లేక చుట్టూ ఉన్నవారు) కూడి సంతానాన్ని వృద్ధి చేయడంతో మొదలు పెట్టి, కుటుంబంలో వచ్చిన చీలికలు, సమూహాలు, వాటి మధ్యన ఆధిపత్యపు పోరు, జీవికను వెతుక్కుంటూ సమూ హాలు చేసే మజిలీలు, నెమ్మది నెమ్మదిగా సంస్కృతిలో మార్పులు వచ్చి పురుషుడు కుటుంబ పెద్ద అవ్వడం, వివాహ వ్యవస్థ, స్త్రీ స్థానం తగ్గుతూ పోవడం… ఇవన్నీ మొదటి ఆరు కథల్లో చిత్రించ బడ్డాయి.
ఆర్యులకి, అనార్యులకి మధ్య యుద్ధం జరిగిన క్రమం… ఆ క్రమంలోనే రాజుని తమ చెప్పుచేతల్లో పెట్టుకునే పురోహిత వర్గం బలపడడం, వేదాలు అందుకు చేసిన దోహదం తరువాతి కథల్లో విశదంగా చెప్పబడుతుంది. సమాజంలో అసమానతలకి మతం ఎలా కారణమయ్యిందో చాలా బలంగా చెప్తారు రాహుల్‌. రాజు-పురోహితుడు-మతం ఈ మూడూ కలిసి సమాజాన్ని ప్రభావితం చేసిన తీరు ఉదాహరణలతో చూపిస్తారు రచయిత.
బౌద్ధ స్థాపన, విస్తరణ, దేశం మీద జరిగిన దండయాత్రలు, అలాగే ఇస్లాం స్థాపన, విస్తరణ, కంపెనీ పాలనలో భారతదేశం, అప్పటి క్రైస్తవ ప్రభావం… ఇవన్నీ కళ్ళకి కట్టినట్లు వర్ణింపబడతాయి.
ఆ తర్వాతి కథల్లో ఈస్టిండియా కంపెనీల కాలంలో జమీందారీలను ఏర్పరచడం, అందువల్ల రైతులకు ఎదురైన ఇబ్బందులు, సామంత రాజుల బలహీనతల్ని ఆంగ్లేయులు సొమ్ము చేసుకోవడం, సిపాయిల తిరుగుబాటు, గాంథీజీ మొదలుపెట్టిన ఉద్యమం, ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించే వర్గం అభిప్రాయాలు… ఇంతవరకు కథలను తీసుకువచ్చి, చివరకు సామ్యవాదం మాత్రమే సమ సమాజాన్ని తీసుకు రాగలదన్న అభిప్రాయంతో ఈ పుస్తకాన్ని ముగించారు రాహుల్‌ సాంకృత్యాయన్‌.
ఒక్కొక్క కథ ఒక్కొక్క యుగం నాటి ఆచార వ్యవహారాలను, అలవాట్లను చిత్రిస్తుంది. సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని కథ నడిపించడం కష్టం కాకపోవచ్చు. కానీ వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పటి జీవనశైలి, మనుషుల భావాలు, భావోద్వేగాలు, అలవాట్లు చిత్రించడం చాలా కష్టమైన పని. కానీ రచయిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ ఆ పని చాలా గొప్పగా చేశారు. అందుకుగాను ఆయన చేసిన పరిశోధన అంతా ఇంతా కాదు. బౌద్ధ భిక్షువుల జీవనశైలిని అక్షర బద్ధం చేయడానికి ఆయన దారి కూడా సరిగా లేని కొండల్లో నడుస్తూ, టిబెట్‌, కాశ్మీర్‌, లడఖ్‌, కార్గిల్‌ ప్రాంతాల్లో తిరిగి అక్కడ లభ్యమైన పుస్తకాలను కంచర గాడిదలమీద తరలించుకు వచ్చారట. అవి అధ్యయనం చేయడానికి ఆయన టిబెటిన్‌ భాషను నేర్చుకున్నారు. ప్రపంచంలో యాత్రలను చేయడానికి మించిన గొప్ప పని లేదంటారాయన. యాత్రలంటూ జరగకపోతే మనిషి నాగరికతలో ఇంత పరిణామం జరిగి ఉండేది కాదనీ, సమాజం పశు స్థాయి నుండి మానవ సమాజంగా ఇలా మారి ఉండేది కాదనీ.. అంటారు రాహుల్‌ సాంకృత్యాయన్‌.
ఇందులో కథలన్నీ… క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నుండి ఇప్పుడు 1942 వరకు జరిగినవి. ఈ పుస్తకం అవసరం ఇప్పుడెందుకని పాఠకులకు అనిపించవచ్చు. అయితే మానవ జీవన వికాసాన్ని ఏయే విషయాలు ఎంతగా ప్రభావితం చేశాయో మనం తెలుసుకుని తీరాలి. ప్రస్తుత కాలంలో లింగ విక్ష, మతం పెను ప్రభావం, బలవంతుడు బలహీనుడిపై చేస్తున్న దాష్టీకం… వీటికి మూలాలు ఎంత బలంగా ఏ క్రమంలో పాతుకుపోయాయో ప్రగతిశీల వాదులంతా అర్థం చేసుకుని తీరాలి.
మానవ సమాజ క్రమాన్ని పరిశీలించి చివరకు మార్క్సిజం దగ్గర తన భావాల్ని స్థిరీకరించుకున్న రాహుల్‌ సాంకృత్యాయన్‌ మార్క్సిజం అవసరాన్ని బలంగా చెప్పిన నేపధ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో తప్పక చదివి తీరాల్సిన పుస్తకం ”ఓల్గా నుంచి గంగకు”.

1 comment

శ్యామలీయం said...

.... మానవ సమాజ పరిణామ క్రమాన్ని ఖచ్చితంగా మన ముందుకు తెచ్చిన పుస్తకం ‘ఓల్గా నుంచి గంగకు’.....
అంత ఖచ్చితంగా చెప్పలేమండి. ఇది రెండు తప్పుడు సిధ్ధాంతాలని గుడ్డిగా నమ్మి చేసిన రచన. అంతే. మిగతాది అంతా రచనావైభవమాత్రమే. వాటిలో‌మొదటి సిధ్ధాంతం ఆర్యులు భారతదేశం మీదకు హిమాలయాల గుండా దండయాత్రగా వచ్చారన్నది. రెండవది మార్క్సిజమే సమస్తవిశ్వానికీ ఆధారభూతమైన పరమ సత్యం అన్నది. దొందూ‌దొందే.

.... తొలి కథలో ఆర్యుల సంస్కృతి కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు రాహుల్‌....
.... ఆర్యులకి, అనార్యులకి మధ్య యుద్ధం జరిగిన క్రమం… ఆ క్రమంలోనే రాజుని తమ చెప్పుచేతల్లో పెట్టుకునే పురోహిత వర్గం బలపడడం, వేదాలు అందుకు చేసిన దోహదం .....
ఆర్యుల దండయాత్ర అన్న సిద్ధాంతం చెత్తలో కలిసిపోయినా మన మేతావులు మాత్రం దాన్ని జనం మీద రుద్దటం కోసం ఇంకా అహరహం కృషి చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు...

.... అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో తప్పక చదివి తీరాల్సిన పుస్తకం ”ఓల్గా నుంచి గంగకు”.....
తప్పక చదవవలసిన పుస్తకమే. సిద్ధాంతవ్యామోహంతో‌ జనాన్ని తప్పుదారి పట్టించేదుకు ఒక మహామార్క్శిష్టు చెసిన విన్యాసం చదవదగినదే.

.... ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు.....
నాలుగున్నర దశాబ్దుల క్రిందటనే ఈ‌పుస్తకం తెలుగులో చదివాను. అది తులసిగారి అనువాదమేనా మరొకరిదా అన్నది గుర్తులేదు.

నా వ్యక్తిగత అభిప్రాయాలను అటుంచి రాహుల్ వ్రాసిన ఈ‌పుస్తకం గొప్ప రచనా శిల్పం కలది అన్నది మాత్రం నిజం.