అమీనా – మహమ్మద్ ఉమర్
ప్రపంచ పటంలో
సామాజికంగా ఎన్ని మార్పులు జరిగినా, ఎన్ని వ్యవస్థలు మారినా మారనిదల్లా స్త్రీ జీవితాలే.ఏదేశం , ఏసమాజం, ఏకులం, మతం ఇందుకు మినహాయింపు కాదు. అందునా ఛాందసవాదం ప్రబలిఉన్న ఆఫ్రికన్
దేశాలలోని ముస్లిం మహిళల పరిస్థితి అసలు చెప్పనక్కరలేదు. అలాంటి ఒక వాతావరణంలో
పుట్టి, పరిస్థితులను ధిక్కరించి తాను ఎదిగి
చుట్టూ ఉన్న సమాజాన్ని అందులోని మహిళలను స్వయంకృషితో ఎదిగేటట్లు చేయగలిగిన ఒక
ధీరోధాత్త మహిళ కథ ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న ‘ అమీనా ‘ నవల. ఈ నవల ఇప్పటికే 36 భాషలలో అనువదించబడింది.
ఈ నవల వ్రాసిన మహమ్మద్ ఉమర్‌ను ఆఫ్రికా స్త్రీవాదానికి నాందీ
ప్రస్తావకుడిగా పరిగణించవచ్చు. సమకాలీన నైజీరియన్ సాహిత్యంలో ఉమర్ రచనలు
విలక్షణస్థానం అక్రమిస్తాయి.
ఇక నవలలోని కథ విషయానికివస్తే కుటుంబానికి, భర్తకి అంకితమైన ఒక సాధారణ ముస్లింమహిళ, కాలక్రమేణ తాను ఉన్న పరిస్థితులను ఆంక్షలను ధిక్కరించి ఆ క్రమంలో
తనకే కాక సమాజానికి మేలు చేసే మార్పులను ఎలా సాధించిందో కళ్ళకు కట్టినట్లు
వివరించే కథ. ఇందులో నైజీరియాలో ముస్లిం మహిళల చట్ట ప్రతిపత్తి, సాంప్రదాయాలు, మతాచారాలు వారిపై
విధించిన శృంఖలాలు ఇవన్నీ నవలలో మనకి కనబడతాయి. సమాజంలో పురుషాధిక్యత వల్ల మహిళలు
ఎదుర్కొనే దుర్భర పరిస్థితులు మనకి కనబడతాయి. రచయిత ఒక్క నైజీరియా గురించే
చెప్పినా మనకు ఎక్కడ ఏ దేశంలో చూసిన దాదాపుగా ఇదే పరిస్థితి.
కథలోకి వస్తే ‘ అమీనా ‘ ఈ నవలలో ముఖ్యపాత్ర. అల్లజీహరూన్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన
నాయకుడు. అతను జీవితంలో సాధించిన ఒక్కొక్క విజయానికి గుర్తుగా ఒక్కో వివాహం
చేసుకుంటాడు. అలా నూతనవిజయం నూతనభార్య అనే సిద్ధాంతంతో అసెంబ్లీకి ఎన్నికైన
సందర్భంగా వివాహమాడిన భార్యే ‘అమీనా’. అమీనా ఇంట్లో ఉండి భర్తను కుటుంబాన్ని చూసుకోవడమే తన కర్తవ్యం అని
నమ్మే సాధారణ మహిళ. ‘ఫాతిమా’ అమీనాకు యూనివర్సిటి స్నేహితురాలు.. ప్రగతిశీల భావాలున్న యువతి.
ఆడవాళ్ళకు శారీరక అందం ఒక భాగం మాత్రమే అనీ తెలివితేటలూ, ఆత్మగౌరవం అసలైన అందాలని నమ్మే మహిళ. మహిళల సమస్యలపై పోరాడుతూ
ఉంటుంది. విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ తమ రహస్య కార్యకలాపాలకు
వేదికగా అమీనా ఇంటిని ఉపయోగించుకుంటూ ఉంటుంది.
అమీనాను సోమరితనంగా రోజులు గడపవద్దని తాను చదువుకున్న చదువుని నలుగురి
అభివృద్ధికి ఉపయోగించమని ఫాతిమా కోరుతూ ఉంటుంది. ఎటూ తేల్చుకోలేని స్థితిలో అమీనా
సోమరిగా ఆలోచిస్తూ ఇంట్లోనే ఉంటుంది. ఫాతిమా ఇచ్చే పుస్తకాలు ఇంట్లో జరిపే చర్చలు
క్రమంగా అమీనాలో కొంత మార్పును తీసుకువస్తాయి.
నైజీరియన్ మహిళలకు ముఖ్యంగా ముస్లిం ఛాందస కుటుంబాల్లో స్త్రీలకు
చదవడం, వ్రాయడం నేర్పాల్సిన అవసరం ఉందని
ఫాతిమా చెప్తూ ఉంటుంది. మహిళలను వారి హక్కులు రక్షించుకునే దిశగా చైతన్యపరచాలని ఆ
సభ్యులు తపిస్తూ ఉంటారు.
అమీనా భర్త అల్లా జీహారున్‌కి ఫాతీమా బృందం పెట్టే సమావేశాలు
నచ్చవు. అతని దృష్టిలో ఫాతిమా ఒక అతివాది. అంతేకాక భార్య అమీనా అందం, చదువు అతనిలో ఆత్మన్యూనతను పెంచుతూ ఉంటుంది. ఆమెను అనుక్షణం
అనుమానంతో హింసిస్తూ ఉంటాడు. అయినా అమీనాలో మార్పు ఉండదు. ఇవన్నీ
అనుభవించాల్సిందేనని ఆమె నిర్వేదంగా అనుకుంటూ ఉంటుంది.
అమీనా ఇంటికి దగ్గరలో లైరా అనే అమ్మాయి ఉంటుంది. చిన్న వయస్సులో
అనారోగ్యం పాలయ్యి భర్త నిరాదరణకు గురై ఒక పాపకి జన్మనిచ్చిన లైరా పరిస్థితి
అమీనాలో మార్పుకు కారణం అవుతుంది. అమీనా మనస్సు సమస్యల పట్ల స్పందించటం
మొదలవుతుంది. లైరాను ఆమె కూతురిని ఇంట్లోకి తీసుకొచ్చి ఉంచుకుంటుంది. ఒక మహిళాసంఘం
పెట్టే దిశగా అమీనా ఆలోచనలు సాగుతాయి.
ఫాతిమా అరెస్టయ్యి, ఆమె స్థాపించిన బకారో ఉమెన్స్ అసోసియేషన్ ఆందోళనకర పరిస్థితుల్లో
ఉన్నప్పుడు ఆ సంఘానికి అమీనా అధ్యక్షురాలవుతుంది. అలా అమీనా జీవితం అనుకోకుండా
సోమరితనం నుంచి క్రియాశీలకంగా మారుతుంది. మహిళలకు పురుషులతో సమానత్వం, అన్ని స్థాయిలలో బాలికల విద్యను ప్రోత్సహించడం, బలవంతపు వివాహాలను నిరుత్సాహపరచడం, గృహహింసపై చట్టాల కోసం పోరాడటం, మహిళలకు పూర్తిస్థాయిలో ఉద్యోగాలు కల్పించడం వీటిపై అమీనా తదితరుల
సంఘం పనిచేస్తుంటుంది.
సహకార ఉద్యమం వైపు వాళ్ళ సంఘం పనిచేస్తూ ఉంటుంది. ఆడవాళ్లకు వచ్చిన
వెంటనే ఒక వ్యాపారంగా మలిచి, వారికి దాన్ని ఒక
ఆదాయమార్గంగా మలుస్తారు. స్థానిక మందులను తయారీని ప్రోత్సహిస్తూ ఉంటారు. సహకార
వ్యవస్థ ద్వారా, మందుల మార్కెటింగ్ చేయడం ద్వారా
మహిళలకు మరింత ఆదాయం వస్తూ ఉంటుంది. అమీనా ఆలోచనలు మరింత ప్రగతిశీలకంగా మారతాయి.
ప్రభుత్వం మహిళలపై వివిధ ఆంక్షలు విధిస్తూ ప్రవేశపెట్టిన మహిళా
బిల్లును అమీనా వాళ్ళ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఫలితంగా వారి సంఘాన్ని
నైజీరియా ప్రభుత్వం నిషేధిస్తుంది. వీరి సంఘం నెలకొల్పిన సహకార ఉద్యమం కుడా
నిషేధానికి గురవుతుంది. దీనికి నిరసనగా మహిళలను అందరిని సంఘటితం చేసి అందరూ ఇళ్ళు
వదిలిపెట్టి ఒకచోట సమావేశమయ్యేలా చేస్తుంది అమీనా. పోలీసులు వీరిని అరెస్టు
చేస్తారు. అమీనాతో పాటు చదువుకుని ఆమె స్ఫూర్తితో న్యాయవాదిగా మారిన ఆమె
స్నేహితురాలు రబీ ధైర్యంగా వాదించి వాళ్ళను విడుదల చేయిస్తుంది.
విడుదలైన మహిళలంతా ఒకచోట సమావేశమవుతారు. మనం పోరాటాన్ని కొనసాగించి
తీరాలి. పోరాటం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. మనం జన్మనివ్వాలనుకున్న భవిష్యత్తు
మన గుండెల్లోనే ఉంది. తదుపరి పోరాటాలకు మరింత బలంగా సిద్ధపడాలి. విజయం తధ్యం. ఒక
మంచి ప్రపంచం సాధ్యమే అన్న అమీనా మాటలతో నవల ముగుస్తుంది. తను పుట్టిన వాతావరణంలో
ఉన్న ఆంక్షలను ధిక్కరించిన ఒక మహిళ కథ ఇది. ఆ క్రమంలో ఆమె తనకే కాక అందరికీ మేలు
చేసే మార్పులు సాధిస్తుంది. ఇందులోని ఇతివృత్తం కోట్లాది మంది మహిళలు తమను తాము ఆ
పాత్రలలో ఊహించుకునేటట్లు ఉంటుంది. ముస్లిం మహిళల చట్ట ప్రతిపత్తి, సంప్రదాయాలు మతాచారాలు వారిపై విధించిన శృంఖలాలు వారి ఆర్థిక
కార్యకలాపాలపై ఆంక్షలు అన్నీ చదువుతున్నప్పుడు మన మనస్సు చలించిపోతుంది.
తిరుగులేని పురుషాధిక్యత వల్ల అడుగడుగునా మహిళలు ఎదుర్కొనే
అవమానాలు మనకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. రచయిత ఉమర్ సమకాలీన నేపథ్యంలో
చైతన్యవంతురాలైన ఒక మహిళను అత్యంత వాస్తవికంగా తీర్చిదిద్దిన తీరు పాఠకులను
కట్టిపడేస్తుంది. పోరాటాలతోనే మార్పు సాధ్యమన్న సత్యాన్ని తద్వారా మంచి ప్రపంచం
సాధ్యమనే విశ్వాసం చాటుతుంది ఈ పుస్తకం. సామాజిక న్యాయం కోసం ప్రగతిశీలమైన
పిలుపుగా ప్రతిధ్వనించే ‘అమీనా’ నవల తప్పక చదివితీరాల్సిన పుస్తకం.
Post a Comment