నిశ్శబ్ద గాయాలం

పుట్టుక నుంచి చావుదాకా
అనేకానేక సవాళ్ళ నడుమ
ఎప్పటికీ చేరని లక్ష్యాలతో
ఆధునిక లక్ష్మణ రేఖల మధ్య
ఆందోళనా కేతనాలెగురేసే
నిశ్శబ్ద గాయాలం మేం..
కొందరు తోటి మానవులే
నాగుపాములై కాటేస్తున్నా
కట్టుకున్న వాడు అనుమానంతో
కత్తి గాయం చేసినా
మా నడకలనూ నడతలనూ
వలువలనూ విలువలనూ
పనికి రాని ధర్మాలలో బేరీజు వేస్తున్నా
అవమానం, కులదురహంకారం
మెడలో చెప్పుల దండై వేలాడినా
తలవంచుకు భరిస్తున్న స్త్రీ మూర్తులం
లోలోపల అగ్ని గుండాల్ని దాచుకున్న
ఆధునిక భూపుత్రికలం
పగలంతా నవ్వుల్ని తొడుక్కున్న
పని యంత్రాలం
వంటగది కార్యాలయాల్లో
జీవితాంతం జీతం లేని కొలువుకు
సెలవు లేకపోవటమే భత్యాలుగా పొందుతున్న
అవనీ సుతలం
అలసిన వేళలోనూ ఆవగింజంత విశ్రాంతినెరుగని
తర తరాల దాసీలం
గడప దాటితే చాలు
విసుర్లు, వెక్కిరింతల మధ్య
విముఖతలు విమర్శల మీద
అంతరిక్ష యానాలు చేస్తున్నా
వివక్షను మాత్రం దివారాత్రులు
భరిస్తున్న వసుంధరలం
పుట్టిన క్షణంలోనే
మమ్మల్ని మేం కోల్పోయి
ఎప్పటికప్పుడు
ఎవరి చిరునామాలోనో కొనసాగిపోతూ
బతుకు వేదికపై శతావధానులం
మిలీనియం దాటినా
మింగేసే క్రూరమృగాల మధ్య
ఆదమరిస్తే దోచుకునే
రాక్షసుల మధ్య
యాసిడ్ స్ప్రేలకు బలవుతూ....
అయేషాలుగా.. స్వప్నికలుగా
శ్రీలక్ష్ములుగా.. నిర్భయలుగా
చరిత్రలో దురదృష్టపు
ఆనవాళ్ళుగా
కన్నీటి చారికలుగా
శిధిల స్వప్నాలుగా
మిగులుతున్న వాళ్ళం
అవును...
మేం
ఎప్పటికీ నిశ్శబ్ద గాయాలం…
చివరగా
ఒక్క నిజం… ఒకే ఒక్క నిజం చెప్పాలని ఉంది
అణువణువునా గాయాలతో మనగలగడం
యుగాలుగా మాకలవాటు
కానీ… మేమంటూ లేని ఒకే ఒక్క గాయం చాలు
మీ బతుకులలోని ప్రళయాన్ని చూసుకోవడానికి.

No comments