వాడంతే


నా కాలి బాటగా కదలాడుతుంటాడు వాడు 
కంటకాల ఉనికికి ఊపిరి తీస్తూ
పెదవి అంచునే కూర్చుని ఉంటాడు వాడు 
మాట చివర మౌనాన్ని రోజంతా చదువుకుంటూ
అరచేతినిండా పరచుకుని ఉంటాడు వాడు 
ఎప్పటికప్పుడు వెచ్చని భరోసాగా చెక్కిలి చెమ్మని చిధ్రం చేస్తూ
వీడ్కోలంటే తెలియదు వాడికి 
నా నిద్రకీ తను నీడై కాపలా కాస్తుంటాడు
నన్నొక చెరసాలని చేసుకుంటాడు వాడు
కవాటాలనే కటకటాలుగా భావించే ఆత్మ బందీయవుతూ
అప్పుడప్పుడూ ఒక పసి నిశ్శబ్దంలోకి జారిపోతుంటాడు 
తడంటిన కనుపాపని చూస్తే ఆర్ద్ర శబ్దమే చేస్తాడు
దిగులుసంద్రమౌతాడు వాడు 
నవ్వంటని నా క్షణాలని చూస్తే
పొడిబారిన కళ్ళనుండో 
తడుస్తున్న కలల నుండో
 
ఇక్కడిక్కడే కురుస్తుంటాడు వాడు
 
కొంచెం స్నేహాన్ని
 
అనంతంగా జీవితాన్ని

వాడంతే మరి 
స్నేహమే కాదు
జీవితం కూడా!


No comments