మ్యారీడ్‌ టు భూటాన్‌ – లిండా లీమింగ్‌

పిట్టకొంచెం కూత ఘనంఅన్న సామెత మన పొరుగున ఉన్న బుల్లి దేశం భూటాన్‌కి అక్షరాలా సరిపోతుంది.కేవలం ఏడు లక్షల జనాభా గల ఈ చిన్న రాజ్యం ఆనందం అంటే ఏమిటో దానిని ఎలా సాధించాలో, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి వేదికపైనుంచి ప్రపంచ దేశాలకు విడమర్చి చెప్పింది. ప్రజలు ఏ మేరకు ఆనందంగా ఉన్నారన్నదాన్ని బట్టి జాతి ప్రగతిని బేరీజు వేస్తున్న ఏకైక దేశం అదే మరి. ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలన్నీ తమ విధ్వంసకర ఆర్థిక పోకడలతో సామాజిక పర్యావరణ వ్యవస్థలను చిన్నా భిన్నం చేస్తూ మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితి మన కళ్లకు కనిపిస్తోంది. మరో వైపు ప్రజలను సంతోషంగా వుంచడమే ఆర్థిక విధాన అంతిమ లక్ష్యమని చాటి చెప్పి, ఆచరణలో దానిని సాధ్యం చేసిన ఏకైక దేశం భూటాన్‌. భూటాన్‌ దేశాన్నీ అక్కడి ప్రజల జీవన విధానాన్నీ కళ్లకు కట్టినట్లు వివరించే నవల ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న మ్యారీడ్‌ టు భూటాన్‌పుస్తకం. రచయిత పేరు లిండా లీమింగ్‌”.

మొదటిసారి 1994లో స్నేహితులతో కలిసి ఇండియా యూరో పర్యటనకు వస్తారు లిండా. స్నేహితుల బలవంతంతో పదిహేను రోజులు భూటాన్‌లో పర్యటిస్తారు ఆమె. ఆ పదిహేను రోజుల భూటాన్‌ పర్యటన, ప్రత్యేకం ఆ దేశంలోని పునాకాఅనే ప్రదేశం తన జీవితాన్ని మార్చేసింది అంటారు ఆమె. భూటాన్‌ దేశ ప్రజల జీవన విధానంపట్ల విపరీతంగా ఆకర్షింపబడిన ఆమె 1995లో మరల ఆ దేశానికి వచ్చి భూటాన్‌ దేశ నలుమూలలా పర్యటిస్తారు. అవన్నీ మన కళ్లకు కట్టినట్లు వివరిస్తారు లిండా లీమింగ్‌. భూటాన్‌లోనే స్థిరపడాలని నిర్ణయించుకున్న ఆమె ఒక ఆర్ట్‌ స్కూల్లో టీచర్‌గా చేరుతుంది. అదే స్కూల్లో పనిచేస్తున్న తోటి టీచర్‌ని వివాహం చేసుకుంటుంది. విభిన్న పరిస్థితుల మధ్య భిన్న ధృవాల్లాంటి జీవితాలు వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న గమ్మత్తు అనుభవాలు, చిన్నచిన్న సంక్షోభాలు, ఇవన్నీ అత్యంత సహజంగా వివరిస్తారు లిండా.

సూక్ష్మంగా చెప్పాలంటే ఇదీ కథ. ఐతే అంతర్లీనంగా పుస్తకమంతా భూటాన్‌ దేశ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక స్థితి గతుల వర్ణనతో నింపేస్తారు లిండా లీమింగ్‌. ఇప్పటకీి భూటానీయుల తలసరి ఆదాయం నెలకు 110డాలర్లు. అంటే దాదాపు ఏడున్నర వేల రూపాయలే. అయినప్పటికీి అనవసర భేషజాలకు పోకుండా వారు ఒక ప్రణాళిక ప్రకారం బ్రతుకుతారు. భూటాన్‌ ఆసియాలోని అత్యంత ఆనందమయ దేశమనీ, ప్రపంచంలో మొదటి ఎనిమిది అత్యంత ఆనందమయ దేశాలలో ఒకటనీ బిజినెస్‌ వీక్‌పత్రిక కితాబునిచ్చింది. ఆ దేశ ప్రజానీకం చాలా వరకు సుఖ సంతోషాలతోనే బ్రతుకుతున్నారన్న దానికి నిదర్శనమిది. బౌద్ధమత ఆధ్యాత్మికతనూ, ప్రజల బాగోగులే ప్రాతిపదికగా కలిగిన మౌలిక అర్థసూత్రాలతో సంధానించి రూపొందించిన స్థూల జాతీయ ఆనందంఅనే అభివృద్ధి నమూనా వల్లే భూటాన్‌ ఈ ఘనత సాధించగలిగింది. సుస్థిర న్యాయబద్ధ సామాజిక ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయాల రక్షణ అభివృద్ధ్ది సుపరిపాలన  అన్నవి భూటాన్‌ యొక్క గ్రాస్‌ నేషనల్‌ హ్యపీనెస్‌ (జి.ఎన్‌.హెచ్‌)నమూనాకు మూలాధారాలు.
ముప్పైమూడు సూచికల ఆధారంగా జన జీవితాలని అంచనా వేసి, తదనుగుణమైన అభివృద్ధి పథకాలను రూపొందిస్తుంది భూటాన్‌. వృద్ధిరేటు, స్థూల దేశీయోత్పత్తి వంటివేవీ ప్రజల జీవన స్థితిగతులను మార్చలేని పరిస్థితులలో సరికొత్త యోచన ద్వారా పరివర్తనకు తెరచాపలెత్తిన దేశమిది. ఆ నమూనా ఎవరికైనా అనుసరణీయమే, కానీ అందుకు కావల్సిన చిత్తశుద్ధి ఎవరికైనా వున్నదా అన్నదే అనుమానం. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న భారత్‌ పట్టపగ్గాలు లేకుండా ప్రగతి పథంలో దూసుకెళ్తోందనీ, 2050 సంవత్సరం నాటికి అగ్ర ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందనీ, ఒక అంతర్జాతీయ నివేదిక ఇటీవల ఒక ఆశావహ దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఈ అభివృద్ధి ఫలాలు నిజంగా అట్టడుగు స్థాయి ప్రజానీకానికి అందుతున్నాయా? వారి ఆకలి దప్పులు తీరుస్తున్నాయా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. మానవాభివృద్ధి సూచీలో ఉన్న 187 దేశాలలో భారత్‌ది 134వ స్థానం. విద్య, ప్రజారోగ్యం, ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ సూచీ, దేశంలోని వాస్తవ పరిస్థితులకు అద్దంబడుతోంది. నేటికీి 70శాతం ప్రజలు పేదలేనని సోనియా గాంధీ సారధ్యంలోని జాతీయ సలహామండలి సభ్యులు శ్రీ ఎస్‌.సి. సక్సేనా చేసిన వ్యాఖ్యలను తీసిపారేయలేము. జనాభా గణాంకాల ప్రకారం మనదేశంలో కనీసం 20శాతం మందికి సొంత ఇళ్లు లేవు. దాదాపు అంటే మొత్తం ప్రజలకు రేడియో, టివి, వంట సౌకర్యాలు కూడా కరువు. సగానికి పైగా కుటుంబాలకు రక్షిత త్రాగునీరు, మరుగుదొడ్డి సదుపాయాలు అందుబాటులో లేవు. మనిషి ఆనందంగా బ్రతకడానికి కావలసిన ఏ ఒక్క సదుపాయాన్నీ మన ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడి జన జీవితాలు ప్లాస్టిక్‌ పూల మాదిరిగా తయారయ్యాయి.
స్వార్థమే పరమావధిగా గల నాయకులు గుర్రపు డెక్కల్లా విస్తరిస్తున్న కొలదీ జనం బ్రతుకులు కుంచించుకుపోతూనే ఉంటాయి. పెద్ద పెద్ద పథకాలు వేసే మన నాయకులకు భూటాన్‌ వంటి అతి చిన్న దేశం కానీ అక్కడి అభివృద్ధి గానీ అసలు కంటికి ఆనుతుందా? ప్రజమొహాలు స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎప్పటికెనా విప్పారుతాయా?
మ్యారీడ్‌ టు భూటాన్‌ పుస్తకం చదువుతున్నంత సేపూ ఇవే ప్రశ్నలు మన మనస్సులో మెదులుతూ ఉంటాయి. భూటాన్‌ దేశ నాలుగో రాజు జిగ్మే సింగ్లే వాంగ్‌ చుక్‌నాలుగు దశాబ్దాల క్రితం అంటే 1972లో స్థూల జాతీయ ఆనందంఅనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు. స్థూల దేశీయోత్పత్తి స్థానే దాన్ని ఖాయంచేసి ప్రజలు సుఖ సంతోషాలతో వుండటమే అభివృద్ధికి కొలమానంగా పరిగణిస్తూ ముందుకెళ్తోంది భూటాన్‌. దాని ఫలితంగానే ప్రపంచ కార్యాచరణ ప్రణాళిక (అజెండా)లో ఆనందాన్ని కూడా చేర్చాలని నిరుడు జూలైలో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అది ఇప్పుడు అమలులోకి రావడంతో భూటాన్‌ దేశ వినూత్న ఆలోచనకు ప్రపంచ ఆమోదం లభించినట్లైంది. ఐక్యరాజ్య సమితి 66వ సమావేశంలో భాగంగా ఆనందంపై ఉన్నత స్థాయి సదస్సును నిర్వహించే అవకాశం దీనితో లభించింది.
వేలెడంత లేని దేశం ప్రపంచ పెద్దలకే చెప్పడం వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది అన్న ఆత్మ విమర్శ కావాలిప్పుడు. అనేక దేశాలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలు ఏవో కొన్ని వర్గాలకే ప్రయోజనం చేకూరుస్తూ, అత్యధిక ప్రజానీకానికి ఆశాభంగం కలిగిస్తున్న నేపథ్యంలో అసలైన ఆనందానికి భూటాన్‌ అర్ధం చెపుతోంది. కాకి లెక్కలూ, కనికట్టులూ, గారడీ విద్యలతో ప్రజానీకాన్ని బురడీ కొట్టించడమే గొప్పతనమని భావిస్తున్న ఆర్థిక నిపుణులూ, మేధావులూ ఆ చిన్న దేశాన్నించి నేర్చుకోవాల్సిన పెద్ద పాఠాలు ఎనెన్నో
మ్యారీడ్‌ టు భూటాన్‌ పుస్తకంలో లిండా లీమింగ్‌ తాను భూటాన్‌ దేశానికి ఎందుకు ఆకర్షితురాలైందో చెప్పే క్రమంలో ఆ దేశ సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను మనకు అద్దంలా చూపిస్తారు. భూటాన్‌ ప్రజలు ఆనందంగా, ప్రశాంతంగా జీవించడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పటికీ ఆ దేశంలో చాలామందికి ఇంటర్‌నెట్‌ పరిచయం లేదు. మన దేశంలో ఉన్నన్ని పబ్‌లు లేవు. ఇన్ని సినిమా థియేటర్స్‌ లేవు.. అయినా వారు ఎంతో సంతోషంగా ఉంటారు. కుటుంబంతో, స్నేహితులతో ఎక్కువగా గడపడానికి ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణం. శీతాకాలంలో పని గంటలు చాలా తక్కువగా వుంటాయి. ఆ సమయంలో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా చాలా తక్కువ. ఆ సమయం అంతా బౌద్ధమత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ప్రజలు పాలుపంచుకుంటారు.
UST AS ALICE, WHEN SHE WALKED THROUGH    THE LOKING GLASS, FOUND HERSELF IN A NEW
AND WHIMSICAL WORLD, SO WE, WHEN WE
CROSSED OVER THE PA CHU, FOUND OURSELVES AS
THOUGH CAUGHT UP ON THE SAME MAGIC TIME MACHINE
FITTED FANTASTICALLY WITH A REVERSE….
భూటాన్‌ రోడ్లమీద కార్లు షికారు చేయవు. ఇప్పటికీి ఎక్కువ శాతం గుర్రపు బండ్లే కనబడతాయి. వేగవంతమయిన జీవన విధానానికి అలవాటు పడిపోయిన మనకి మ్యారీడ్‌ టు భూటాన్‌చదువుతుంటే మొదట్లో భూటానీయుల జీవన విధానం మరీ స్థబ్దంగా నిస్సారంగా అనిపించవచ్చు. కానీ చదువుతున్న కొద్దీ మనం ఎంత ఆనందాన్ని కోల్పోతున్నామో అర్థం అవుతుంది. పుస్తకం ముందు మాటలో రచయిత్రిఅప్పటి బ్రిటిష్‌ గవర్నర్‌ ఆఫ్‌ బెంగాల్‌.. భూటాన్‌ గురించి అన్న మాటలు వ్రాస్తారు.
పుస్తకం చదువుతుంటే మనకు కూడా ఒక అద్భుత ప్రపంచంలో విహరిస్తున్నట్లే ఉంటుంది. అలాంటి జీవితం కొన్నాళ్ళైనా గడపాలి అనిపిస్తుంది.

No comments