బిట్టర్ చాక్లెట్ – పింకీ విరానీ
”పిల్లలూ దేవుడూ చల్లని వారే, కల్లకపటమెరుగనీ కరుణామయులే, ఈ పాట మనమందరమూ వినే ఉంటాము.
నిజమే పసిపిల్లలు దేవుడితో సమానం.
కానీ ఈ సమాజంలో కొంత మంది రాక్షసులున్నారు. వాళ్ళు కోరల్లేని రాక్షసులు.
కొమ్ములేని మృగాలు పట్ట పగలు తిరిగే కొరివి దెయ్యాలు. కళ్ళ నిండా కోరికలు
పులుముకున్న కామ పిశాచాలు. మానవత్వం లేని
పరమ దుర్మార్గులు. మన మధ్యనే మన చుట్టుపక్కలే ఉంటారు వీళ్ళు. వీళ్ళకు పసిపిల్లలను
చూస్తే వాళ్ళలో దైవత్వం కనిపించదు. పసిపిల్లలు కూడా వాళ్ళ దృష్టిలో వాళ్ళ
పైశాచికానందాన్ని తీర్చే వస్తువులు. వీళ్ళు పిల్లల్ని చొరవగా వొళ్ళోకి
లాక్కుంటారు. అది వాత్సల్యం కాదు – వాంఛ. ముద్దులతో ముంచెత్తుతారు. అది మమకారం కానే కాదు – మృగత్వం. వొళ్ళంతా తడుముతారు. ఛి.. ఛి.. అది ప్రేమేమిటి – పచ్చి కామం. పైపైకి అంతా సహజంగానే కనిపిస్తుంది. రక్త సంబం ధమనో, బంధుత్వ అనుబంధమనో, పిల్లలంటే అభిమానమనో అనిపిస్తుంది. కానీ లోలోపల మాత్రం అసహజమైన
వాంఛ. కామ ప్రకోపం. కాపు కాసి, అదును చూసి
రెచ్చిపోతారా రాక్షసులు. కరకు చేతులు కాల నాగులై లేలేత శరీరాల మీద బిరబిరా పాకుతా
యి. తాక కూడని చోట్ల తారట్లా డతాయి. చెయ్యకూడని పనులు నిర్లజ్జగా చేస్తాయి.
ఇలాంటి దారుణమయిన అనుభ వాల తరువాత
పాపం చిగురుటాకుల లాంటి పసి పిల్లలు వణికిపోతారు. లేలేత ప్రాయంలోనే రాలిపోతారు.
ఇలాంటి ఎంతోమంది పసిపిల్లల జీవితాలలో జరిగిన వాస్తవ గాధలను ఏర్చి కూర్చి.. మనసుకి
హత్తుకునేలా మన ముందుంచిన పుస్తకం పింకీ విరానీ రాసిన ”బిట్టర్ చాక్లెట్” ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్, మానవ హక్కులు ఉద్యమ నేత పింకీ విరానీ రాసిన ‘బిట్టర్ చాక్లెట్’ పుస్తకం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు, పసిపిల్లగా ఉన్నపుడు తనకు ఎదురైన అనుభవాల గాయాలనుంచి పోరాడే తత్వాన్ని
అలవరుచుకున్న ఆమె, పసి ప్రాయంలో లైంగిక దాడులకు గురయిన
వారిని ఎందరినో కలిసి వారి వారి బాధలను తెలుసుకుని వారి తరఫున సమాజాన్నీ పాలకులనూ
చట్టాన్నీ ప్రశ్నించే ఈ బిట్టర్ చాక్లెట్ అందరూ తప్పక చదివితీరవలసిన పుస్తకం.
ఇల్లంటే పెట్టనికోట, చల్లని నీడ. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే సురక్షితమని నమ్ముతాము.
బడికెళ్ళిన వాళ్ళు తిరిగివచ్చేసారంటే నిశ్చింతగా ఉంటాము. కానీ ఆ ఇల్లే
కొన్నిసార్లు మానవ మృగాలకు ఆవాసమవుతుంది. పసి పిల్లలపై జరిగే అకృత్యాలకు సగానికి
సగం సొంత ఇళ్ళల్లోనే జరుగుతాయి అంటారు పింకీ విరానీ.. బిట్టర్ చాక్లెట్ పుస్తకం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో
పింకీ తన స్వీయానుభవాలతో పాటు పసిపిల్లపై జరిగే దాడులను గురించి అనేక రకాలుగా
చర్చిస్తారు. రెండవ భాగంలో ఇలాంటి అకృత్యాలకు గురైన పసి పిల్లలు పడే మానసిక వేదన, వాళ్ళ జీవితాంతం వాళ్ళనుభవించే సంఘర్షణా, అది వాళ్ళ జీవితాలపై చూపించే ప్రభావాలూ ఇవన్నీ చర్చిస్తారు. మూడవ
భాగంలో తానెదుర్కున్న అనుభవాల నేపధ్యంలో, ఈ రుగ్మతను రూపుమాపడంలో నేటి సమాజంలో తల్లి దండ్రుల బాధ్యతను
చర్చిస్తారామె.
ఈ రాబందులు చాలా సందర్భాలలో
బంధువులే అయివుంటారు అంటారు పింకీ. ఆ పిల్లలకు పరిచయస్తులే ఈ లైంగిక దాడులకు
పాల్పడతారు. ఆత్మీయులలాగా మెలుగుతూ, తలుపు తట్టకుండా ఇంట్లోకి వచ్చేంత చొరవ కలిగి ఉంటారు వారు. వయసులో
తాతయ్య, మామయ్య లేక బాబాయి వరసవుతారు. ఈ
దాడులు ప్రతీ చోటా జరుగుతున్నవనీ, బడి, గుడి, పొరిగిల్లు, ట్యూషన్, హాస్టల్ వీటిలో దేనికీ
మినహాయింపులేదనీ అంటారామె. నూటికి 50 శాతం మంది పసిపిల్లలు పసి వయసులోనే లైంగిక దాడులకు గురవుతు
న్నారని మన అధికారిక అధ్యయనాల గణాంకాలే చెపుతున్నాయి. దీనిలో కూడా 30 శాతం అత్యాచారంతో సమానమయినవీ, అతి తీవ్రమయినవీను. కాగా మిగతా 70 శాతం సందర్భాలలో తీవ్రత తక్కువే అయినా అవి పసివాళ్ళ మనసులను తీవ్రంగా
గాయపరుస్తాయి. మాటలతో బాధించడం, చేతలతో వేధించడం, అసభ్య చిత్రాలను చూపించి ప్రేరేపించడం, ఫోటోలతో, వీడియోలతో బెదిరించడం, ఒకటా రెండా – ఈ చిట్టా
నిలువెత్తు పాపాల పుట్ట. గణాంకాల పరంగా తీవ్రత లేకపోయినా బాధితుల మానసిక వేదన
మాత్రం ఏ లెక్కలకూ అందనిదే కదా. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతీ
రెండున్నర గంటలకూ ఒక బాలుడో… లేక బాలికో
లైంగిక అకృత్యాలకు గురవుతున్నారు. సాధారణంగా 7 సంవత్సరాల వయసు నుంచి 12 సంవత్స రాల వయసు కల పిల్లలు ఈ దాడులకు బలవుతున్నారు. వాళ్ళయితే
ఎదిరించలేరు, ఎవరితోనూ చెప్పుకోలేరు. వాళ్ళని
బెదిరించడం సులభం. ఎంత దురదృష్టకర మయిన పరిస్థితులివి? సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవలసిన విషయమిది.
”బిట్టర్ చాక్లెట్” రెండవ భాగం అనేక యదార్థ సంఘటనల సమాహారం. వెంకట్ అనే ఏడు సంవత్సరాల
పసి పిల్లవాడి అనుభవం చదువుతుంటే మన మనసు నీరయిపోతుంది. పక్కింటి అంకుల్ రూపంలో
ప్రవేశించిన ఒక దుర్మార్గుడు చాక్లెట్లు కొనిపెడతాడు. సర్కస్‌కి తీసు కెళతాడు. హోం
వర్క్‌లో సహాయ పడతాడు. చివరికి స్నానం చేయిస్తానంటూ స్నానాల గదిలోకి చొరబడేదాకా, బట్టలు తొడుగు తానంటూ బెడ్రూం తలుపులు మూసేదాకా ఆ రాక్షసుడి నిజ
స్వరూపం అతనికి తెలియదు. శరీరాన్ని బొమ్మని చేసి ఆడుకోవడం లాంటి అసహ్యకరమయిన
అనుభవాలు చదువుతోంటే మన మనసుకి పుండు పడినట్టు అనిపిస్తుంది. ఒక రోజు ధైర్యం చేసి
వెంకట్ తన తల్లికి అంకుల్ గురించి చెపితే ఆ తల్లి వెంకట్నే మందలిస్తుంది.
చివరికి ఆ దుర్మార్గుడు ఒక రోజు ప్రమాదంలో మరణిస్తాడు. ఆ రోజు వెంకట్ పొందిన
ఆనందాన్ని గమనించిన అతని తల్లికి అర్థమవుతుంది అన్నాళ్ళూ ఆ పసి హృదయమెంత వేదనకు
లోనయిందో.. కానీ నిజ జీవితంలో అందరూ వెంకట్ పొందినంత సులభంగానూ అంత త్వరగా నూ ఈ
బాధ నుంచి బయటపడడం జరగదు.
తల్లిదండ్రులు నమ్మకపోయినా, లేక వారిని తిరిగి నిందించినా బాధిత బాలలు చాలా మనోవ్యధకి
గురవుతారు. వారు పెద్దవారయ్యే కొద్దీ ఆ న్యూనత మరింత పెరిగి వారి వలన వారి కుటుంబం
మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి కలుగుతుంది. ఇంకా కొన్ని సందర్భాలలో అయితే ఆ
పసిపిల్లల నిస్సహాయ స్థితి లోనుంచి ఒక రకమయిన కసి పుడుతుంది. వారు పెరిగి
పెద్దవారయిన తరువాత అలాంటి లైంగిక దాడులకు పాల్పడేవిధంగా వారిని అది
ప్రేరేపిస్తుంది. అంటే తాము పడ్డ బాధ మరొక రికి కలగజేసి ఆనందం పొందే మానసిక
వికృతికి వారు లోనవుతారన్నమాట.
ఇలాంటి యదార్ధగాధలు పింకీ పుస్తకంలో
కోకొల్లలుగా ఉంటాయి. ఈ దుశ్చర్యలు పసిపిల్లల జీవితాలపై చూపించే ప్రభావం గురించి తన
పుస్తకంలో విపులంగా చర్చిస్తారామె. ”ఒక వైపు తప్పించుకోలేని హింస – మరొక వైపు తప్పు చేస్తున్న భావన” అదొక నరకం. పిల్లలు తాము చేసే పని పట్ల ఏకాగ్రత కోల్పోతారు.
పరీక్షలు తప్పుతారు. ఆత్మ న్యూనతకు గురవుతారు. నలుగురిలో కలవలేరు, చొరవగా మాట్లా డలేరు…. ఈ న్యూనత వారి వయసుతో పాటు పెరుగుతుంది. ఒంటరితనాన్ని వదలలేక
ఇబ్బంది పడతారు. దేముడు కనిపించి వరం కోరుకోమంటే ఎవరైనా తమ బాల్యం కావాలని కోరుకుం
టాము. కాల యంత్రమెక్కి వెనక్కి వెళ్ళిపోవా లనుకుంటాము. లైంగిక హింసకు గురయిన వారు
మాత్రం బాల్యాన్ని తలుచుకోవడానికి భయపడతారు. వారి జీవిత కథలో అదొక చీకటి అధ్యాయం, జీవితాంతం అదొక చేదు జ్ఞాపకం. పెద్దయ్యాక కూడా ఆ వేదన నుంచి బయట
పడలేక జడత్వం ఆవహిస్తుంది. పెద్దల ఒత్తిడి వల్ల వివాహం జరిగినా వారి దాంపత్యం
సజావుగా సాగదు. మరికొందరు బాధితులు మద్యం, మాదక ద్రవ్యాల మత్తుకు బానిసలయి తమదయిన ప్రపంచాన్ని
సృష్టించుకోవాలని ఆరాటపడతారు. ఈ ప్రభావాలు ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కొక్కలాగా
దారి తప్పిస్తాయి అంటారు పింకీ విరానీ.. పోలీసుల రికార్డుల ప్రకారం ఏటా కొన్ని వేల
మంది పిల్లలు కనిపించకుండా పోతున్నారు. ఈ చిన్నారులు ఇల్లు వదిలి పోవడానికి కూడా
చాలా వరకు లైంగిక దుశ్చర్యలు కారణమంటే మనకు బాధతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది.
తల్లిదండ్రులకు అర్థమయేటట్లు చెప్పి వారిని నమ్మించలేని పరిస్థితులు. దాడికి
గురయిన పిల్లలను అక్కున చేర్చుకుని వారిలో తిరిగి ఆత్మవిశ్వాసం నింపే మనుషులు
లేకపోవడం వలన వారు గడప దాటుతున్నారని ఆవేదన చెందుతారు పింకీ విరానీ..
మూడవ అధ్యాయంలో ఇలాంటి పరిస్థితులు
ఎదురయినప్పుడు – అసలు ఇలాంటి పరిస్థితులే లేని సమాజం
కోసం తల్లిదండ్రులు నిర్వర్తించవలసిన బాధ్యతలను చర్చిస్తారామె. అపరిచితులతో వచ్చే
ప్రమాదాన్ని గురించి తల్లిదండ్రులు తమ పిల్లలను సాధారణంగా హెచ్చరిస్తూనే ఉంటారు.
కానీ పరిచయస్థుల వలన రాబోయే ప్రమాదాలను గురించి వారు ఊహించరు. ఊహించినా జాగ్రత్తగా
వ్యవహరించమని పిల్లలని హెచ్చరించరు. లైంగిక దుశ్చర్యలలో నూటికి 90 శాతం తెలిసిన వారి తెగింపే. బంధుమిత్రుల ద్రోహమే కనపడుతుంది. ”గ్రామమని లేదు. నగరమని లేదు. పేదలని లేదు.. సంపన్నులని లేదు. ప్రతీ
చోటా, ప్రతీ మూలా ఈ దుర్మార్గం
రాజ్యమేలుతోంది. బాల్యం ఆ హింసని
నిశ్శబ్దంగా భరిస్తూనే ఉంది. చాలు చాలు ఇప్పటికైనా మౌనాన్ని చేధించే
ధైర్యాన్నిద్దాం” అంటారు పింకీ.
”మీ పాపేంటి? ముద్దు పెట్టుకుంటుంటే అంత
గింజుకుంటుంది?” అని ఎవరైనా
అడిగినా, ఫిర్యాదుగా అన్నా వారు వచ్చినప్పుడు
మన పిల్లల మొఖంలో ఇబ్బంది లేదా అసౌకర్యం కనిపించినా ”తనకు ఇలా చేస్తే ఇష్టముండదు.. ఏమనుకోకండి” అని కన్నవారే గట్టిగా చెప్పాలి అంటారు రచయిత్రి. ఇలా చెప్పినప్పుడు
ఎదుటి వాళ్ళ మనసులో ఎటువంటి కల్మషం లేకపోతే తప్పకుండా అర్థం చేసుకుంటారు ఏ
దుర్మార్గపు ఆలోచనో ఉంటే హెచ్చరికలా తీసుకుంటారు. ”అన్నిటికన్నా ముందు పెద్దవాళ్ళకూ పిల్లలకూ మధ్య మొలిచిన అడ్డుగోడలు
కూలిపోవాలి. సాన్నిహిత్యం పెరగాలి. బిడ్డలు తమ భయాలనూ, సమస్యలనూ ధైర్యంగా ఫిర్యాదు చేయగలిగిన చనువుండాలి .. ఈ విషయంలో
కన్న వారే తొలి అడుగు వేయాలి” అంటారు రచయిత్రి.
రోజుకొక అరగంట, వీలయితే ఒక గంట సమయం పిల్లలకు
కేటాయించాలి. వాళ్ళతో మాట్లా డాలి. వాళ్ళు మనసు విప్పి మాట్లాడేలా ప్రోత్సహించాలి.
వారికి ఇష్టమయిన చర్చకు తెరతీయాలి ఆ సమయంలో … ఇటువంటి వాతావరణం తల్లిదండ్రులకు పిల్లలకూ సామీప్యం పెంచుతుంది. తమ
భయాలను తల్లిదండ్రు లతో పంచుకొనే విశ్వాసం పిల్లలకు కలుగుతుంది. ఒక్క లైంగిక
దుశ్చర్యలకే కాక అనేకానేక సమస్యలకు ఇదే తొలి పరిష్కారమవుతుంది అని అర్థమవుతుంది
మనకు ఈ పుస్తకం చదువుతుంటే.
పిల్లలు ఎవరితో చనువుగా ఉంటున్నారు? వాళ్ళెలాంటి వారు? అన్నది గమనిస్తూ
ఉండాలి. హఠాత్తుగా పిల్లల స్వభావంలో వచ్చే మార్పులను తేలికగా తీసుకోవడానికి వీలు
లేదు. ఆ మౌనానికీ, పరధ్యానానికీ, ఒంటరితనానికీ, కృంగుబాటుకు ఏదో
ఒక కారణం ఉండే ఉంటుంది అని అర్థం చేసుకోవాలి అంటారు పింకీ. శరీర భాగాల మీద గాయాలు, రక్కిన గురుతులు కనబడినా, తరచూ రక్తస్రావాల వంటివి అవుతూ ఉన్నా కూడా నిర్లక్ష్యం వహించకుండా
వెంటనే దాని పూర్వాపరాలు తెలుసుకోవాలంటారామె. చివరిలో పింకీ మన ముందు పెద్ద చర్చనే
లేవనెత్తుతారు. చాలా పాఠశాలలలో పేరెంట్ సమావేశాలు చాలా మొక్కుబడిగా జరుగుతున్నాయి, మార్కుల గురించీ, హోం వర్కుల
గురించీ విపరీతమయిన చర్చ జరుగుతుంది. ”తరగతిలో పిల్లలు ఎలా ఉంటున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళ ప్రవర్తనలో అసాధా రణమయిన మార్పులేమన్నా ఉన్నాయా” అన్న విషయం ఈ సమావేశాలలో చర్చకు నోచుకోదు. అని అంటారామె. ”ఇంట్లో కంటే బడిలోనే పిల్లలు స్వేచ్ఛగా ఉంటారు. స్నేహితులతోనో, ఇష్టమయిన టీచర్లతోనో మనసు విప్పి మాటాడతారు. వారి ప్రవర్తన లోని
అసాధారణతను గమనించి తల్లిదండ్రు లకు చెప్పవలసిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉంటుంది” అంటారామె.
కుటుంబ గౌరవం. పరువు వంటి విషయాలను
అతిగా పట్టించుకోవడం వలన ఈ సమస్య మరింత జటిలమయిపోతోంది. పసిపిల్లల విషయంలో ఇటువంటి
చేదు అనుభవాలు గమనించిన తల్లిదండ్రులు కూడా, కొన్ని కొన్ని సందర్భాలలో నలుగురికీ తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో
అని గోప్యత పాటిస్తారు. అందులోనూ అటువంటి దుశ్చర్యకి పాల్పడిన వ్యక్తి కుటుంబానికి
చాలా సన్నిహితుడూ, సంఘంలో గౌరవనీయ మయిన స్థానంలో
ఉన్నవాడూ అయిన ప్పుడు నిలదీస్తే సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయనే భయం వల్ల కలిగిన
నిర్లిప్తత తల్లిదండ్రులలో ఉండడం కూడా చాలా సంఘటనలకు కారణమవుతోం దంటారామె. ”ఎంత మంది జీవితాలను నాశనం చేస్తారు? ఇంకా ఎన్ని పసిహృదయా లను గాయపరుస్తారు? ఈ రాక్షసులకు బుద్ధి చెప్పాల్సిందే” అని అంటారామె. నూటికి తొంభై మంది విషయంలో ఈ వికృత వాంఛ ఒక తీవ్ర
మానసిక సమస్య. మానసిక శాస్త్ర పరిభాషలో దీనిని ”పైడొఫీలియా” అంటారు. వాళ్ళ దృష్టిలో తాము
చేస్తున్నది తప్పే కాదు, పిల్లలకు తామేదో ఆనందాన్ని
పంచుతున్నా మని వాళ్ళు భ్రమిస్తారు. అయితే ఎపుడయినా ఈ లైంగిక దాడికి గురయిన
బాధితులు కోర్టును ఆశ్రయించిన పక్షంలో ఆ దాడికి పాల్పడిన మృగాలు ఈ పైడోఫిలియా అనే
రుగ్మతనే సాకుగా చూపి తమకు పడే శిక్షను తప్పించుకొంటున్నారనే దిగ్భ్రాంతికర
వాస్తవం మనకు ఈ పుస్తకం ద్వారా తెలు స్తుంది. గుండె గొంతుకలో కొట్టాడుతుంది. పింకీ
విరానీ పుస్తకం మనలో చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక కుటుంబ మంటూ ఉన్న పిల్లల
విషయంలోనే ఇంత అభద్రత ఉంటే, మన చుట్టు పక్కల భద్రతలో
బ్రతుకుతున్న పిల్లల విషయంలోనే ఇంత ప్రమాదం ఉంటే… వీధి పిల్లల సంగతేమిటి? అనాధ శరణాలయాల లో తల దాచుకుం టున్న పిల్లల సంగతేమిటి? కార్ఖానాలలో, హోటళ్ళలో పని
చేస్తున్న చిన్నారులకు దిక్కెవరు? నిజమే! మరీ
దయనీయమయిన పరిస్థితి వీరిది. మితిమీరిన శారీరక మానసిక వేధింపుల వలన ఎయిడ్స్ వంటి
ప్రమాదకర వ్యాధుల పాల్పడుతున్నారు. పువ్వులతో ఆడుకుంటూ ఎదగాల్సిన వయసు అది.
సురక్షితంగా, స్వేచ్ఛగా ఎదిగే హక్కు వాళ్ళకుంది.
వాళ్ళ బంగారు భవిష్యత్తుని కాల రాసే కాల సర్పాల కోరలు పీకాల్సిన బాధ్యత మనది.
మనందరిదీ….
చాక్లెట్ ఇష్టపడని పసిపిల్లలు ఎవరూ
ఉండరు. పిల్లల ప్రేమ పొందడా నికి.. వారిని మాలిమి చేసుకోవడానికి ఒక రకంగా చాక్లెట్
దగ్గరి దారి. ఐతే కొంతమందికి ఆ చాక్లెట్ చూపించే చేదు రుచి మనకి ”బిట్టర్ చాక్లెట్” పుస్తకం రుచి చూపిస్తుంది. ”క్రయింగ్ డాల్….” గిచ్చినా, గిల్లినా, ముట్టినా, కొట్టినా కెవ్వుమంటుంది. కేర్ కేర్‌మని
ఏడ్చేస్తుంది. పెద్ద పెద్ద మాటలు వాడాల్సిన పని లేదు. వయసుకు మించిన విషయాలు
విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డ వ్యక్తులను ఆమడ దూరంలో ఉంచమని చెప్పడానికి
ఏడ్చే బొమ్మే మనం పిల్లలకి నేర్పించే తొలి పాఠం.
Post a Comment