వానొస్తద...
వానొస్తద...?
ఇదిగో ఈ ప్రశ్న అప్పుడెప్పుడో అన్నయ్య వేసిన గుర్తు.ఇప్పుడు అదే అమాయకపు ప్రశ్న... అదే అమాయకపు కళ్ళతో మళ్ళీ మళ్ళీ నిన్నడగాలని ఉంది.
నీకేం!!
నీ మటుకు నువ్వెళ్ళి పోయావు.
నువు అల్లరి చేసిన తువ్వాయిలు.. ఆటలాడుకున్న బోరు బావి నీరు..
పలకరించిన అరటి తోట.. రెల్లు దుబ్బులూ..
కరిగిపోయిన కలలా...
తరిగిపోయిన మెరుపులా..
రెక్కలు తెగి పడి ఉన్నాయి.
ప్రాణం కళ్ళల్లో పెట్టుకుని నాకు మల్లేనే..
నీ రాక కోసం ఎదురు చూస్తున్నాయి.
ఇదిగో...
నేనిలానే నడుస్తుంటా..
ఒక బాధలోంచి.. ఇంకో బాధలోకి..
కలలన్నింటినీ శిలలు చేస్తూ..
కొన్ని నవ్వుల్ని కప్పిపెడుతూ..
ఇంకొన్ని ఊసులకి ఉరి వేస్తూ..
ఆశల ప్రస్థానపు అంతిమ దృశ్యాన్ని
పరిచయం చేస్తూ..
ఇదిగో.. ఈ రెల్లు పొదలు చూడు.
వాటి మధ్యలో చేరిన గాలి చేస్తున్న సవ్వడి,
వేణు గానంలా.. అచ్చం నీ నవ్వులా ఉంది.
ఈ రెల్లు పొదల మధ్య ఇలా చిక్కడిపోయి..
ఎంత సేపని నీరాక కోసం ఎదురు చూస్తాను నేను!!
ఎదురు చూసీ.. చూసీ.. గుండె ఆగిన చప్పుడు!!
అయినా...
ఆగిన గుండె చప్పుడు కాదుగా మరణం అంటే..
మనసు నిశ్శబ్దంలోకి వెలివేయబడడం..
Post a Comment