నిర్వచనం

ఆవేశం.. ఆక్రోశం.. నిస్సహాయతా
కళ్ళనిండా ప్రళయమై ప్రచండిస్తున్నప్పుడు,
ఒక్కోసారి మోకాళ్ళ నడుమ తలదాచుకుని
నన్ను నేను తవ్వుకుంటాను.
అట్టడుగు లోలోతుల్లోకి జారిపోతుంటాను.
మనసు పొరల్లోకి పయనిస్తున్న కొద్దీ
ఏదో పొందుతున్నట్లే ఉంటుంది..
కోల్పోయిన ప్రతీసారి
కొత్త శక్తి పోగయినట్లు,
ఒక అదృశ్య సంకల్పం వెన్నుతడుతునే ఉంటుంది
అందుకే నన్ను ఒక జ్వాలై రగిలించుకుంటా...
యోచించి యోచించి తపస్సులా
నా గమ్యాన్ని నిర్వచించుకుంటా
కొత్త ఆశలు చేరినప్పుడల్లా
ఆకాశంలో ఎన్ని వెల్తురు పిట్టలో
మనస్సు బుజ్జి పిచ్చుక పిల్లలతో పులకించే
గడ్డి గూడవుతుంది.
ఒక చిన్ని చిగురాశ విస్తరించి విస్తరించి కొమ్మవుతుంది.
చినుకూ చినుకూ స్నేహించి వర్షమవుతుంది
అప్పుడప్పుడూ ఒక నిరీక్షణ జీవితకాలమనిపించినా...
అది పొందిన క్షణం…
లలితంగా నర్తిస్తుంది ఒక మధుర హాసం
జీవితానికి కొత్త నిర్వచనాలని లిఖిస్తూ...


No comments