టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ – హార్పర్ లీ
అమెరికాలోని నీగ్రో జాతి వారి పట్ల శతాబ్దాల కాలం నుండి శ్వేత జాతీయులు జరుపుతున్న అత్యాచారాలని ఖండిస్తూ అనేక నవలలు వచ్చాయి. ‘అంకుల్ టాంస్ కాబిన్’, ‘రూట్స్’ వంటి నవలలు సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. అలాంటి కోవలోకి చెందిన పుస్తకమే ఈ నెల పరిచయం చేయబోతున్న ”టు కిల్ ఎ మాకింగ్ బర్డ్” పుస్తకం.
తరతరాలుగా శ్వేత జాతీయులు నల్ల జాతి వారిని అణగదొక్కుతున్నప్పటికీ, అదే శ్వేత జాతిలోని కొందరు మానవతా వాదులు, సంస్కర్తలు జరిపిన పోరాటాలు నల్ల వారి పోరాటంలో బాసటగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాలక్రమేణా నల్ల జాతి వారికి బానిసత్వం నుంచీ, జంతువుల వలే వేటాడ బడే నికృష్ట స్థితి నుండి విముక్తీ కలిగింది. ఓటు హక్కూ, సమాన విద్యావకాశాలు ఏర్పడ్డాయి. అయితే చట్ట బద్ధంగా ఇలాంటి అవకాశాలు ఏర్పడి ఉండవచ్చు గాని, నిత్య జీవితంలో ఈ సమానత్వం ఎంతవరకూ పొందలుగుతున్నారన్నది సమాజం పట్ల ఒక స్థాయి అవగాహన ఉన్న ఎవరికైనా కలిగే సందేహం. ఇలాంటి ప్రశ్నలకి ఎప్పటికప్పుడు రకరకాలైన జవాబులు దొరికినా ఆ సమాధానాలు సాహిత్య రూపంలో వచ్చినప్పుడు మాత్రం అంతులేని సంచలనాన్ని సృష్టిస్తాయి.
అలా సంచలనం సృష్టించిన నవల ”టు కిల్ ద మాకింగ్ బర్డ్”. స్కౌట్ అనే ఆరేళ్ళ పాప చెప్పినట్లు రాయబడిందీ కథ. అంటే కథ మొత్తం స్కౌట్ స్వగతంలో ఉంటుందన్న మాట. స్కౌట్‌కి ఒక అన్నయ్య. పేరు జెం. స్కౌట్ తండ్రి పేరు అట్టికస్ ఫించ్. అట్టికస్ న్యాయవాది. తల్లి లేని పిల్లలిద్దరిని చాలా అపురూపంగా పెంచుకుంటాడు అట్టికస్. అతను ఒక ఆదర్శవాది. మానవతా వాది. అట్టికస్ దృష్టిలో బీదా, గొప్ప, రంగూ, జాతీ, దేశం, ప్రాంతం ఇటువంటి భేదాలు ఉండవు.. మనుష్యులందరూ ఒక్కటే.
అట్టికస్ ఫించ్ అంటే ఆ ప్రాంత ప్రజలకి చాలా గౌరవం. అలాగే ఒక వర్గం వారికి చాలా కోపం కూడా. అట్టికస్ వంటి వ్యక్తుల వల్లే నిగ్గర్స్ – అంటే నల్ల వారు పెట్రేగి పోతున్నారని వారి భావం. స్కౌట్ పొరుగింట్లో ”బూరాడ్” అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎప్పుడూ తలుపులు మూసుకుని ఉండే ఆ విచిత్రమైన వ్యక్తి గురించి ఆ ఊర్లో కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ”బూ” వయసులో ఉండగా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఎవరినో హత్య చేసాడనీ… అందుకే అతని తల్లి తండ్రి అతనిని ఇంట్లో గొలుసులతో కట్టేసారనీ… అలా కట్టి వేసినా ఒకసారి అతను అతని తల్లి కాళ్ళు కొరికి తినేసాడని… ఇంకా ఆకలి వేసినప్పుడు అతను ఎలులు, పిల్లులు, ఉడుతలని కూడా చంపి తింటాడని… ఇలాంటి వింత వింత కథలు ప్రచారంలో ఉంటాయి.
”బూ” రాత్రి పూట రోడ్ మీదకి వచ్చి కనిపించిన వారి మీద దాడి చేసి తినేస్తాడని మరోకథ. ఇలా చిత్ర విచిత్రమైనవి… తాము విన్నవీ… విని ఊహించుకున్నవీ కలిపి ఆ ఊరిలోని పిల్లలకు అతనిని చూడాలనే కుతూహలం రోజు రోజుకీ పెరిగిపోతూ ఉంటుంది. స్కౌట్, ఆమె అన్న ఇందుకు మినహాయింపు కాదు. అయితే అట్టికస్ మాత్రం పిల్లలను ఈ విషయంలో సమర్థించడు. ”ఎదుటి వారిని గురించి ఒక అభిప్రాయానికి వచ్చే ముందు వాళ్ళ చెప్పుల్లో మన కాళ్ళుంచి, వారి చర్మం కింద మన గుండెను ఊహించుకుని ఆలోచించాలి. అప్పుడు గాని నిజా నిజాలు భోదపడవు…” అదీ అట్టికస్ భావన.
అదే ఊరిలో ఉద్యోగం సద్యోగం లేని ఒక తెల్ల వాడు ”బాబ్ ఈవెల్” ఉంటాడు. పిల్లలు కూడా అతని లానే తిరుగుళ్ళకి అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. తన పెద్ద కూతురు మెయిల్లాపై నీగ్రో యువకుడైన టాం రాబిన్‌సన్ అత్యాచారం చేసాడని ఒక రోజు బాబ్ ఈవెల్ పోలీస్ కేస్ పెడతాడు. దాంతో అలా అలా సాగిపోతున్న కథ ఒక పెద్ద మలుపు తిరుగుతుంది.
టాం రాబిన్‌సన్ నీగ్రో యువకుడు కనుక అతని తరఫున వాదించడానికి ఎవరూ ముందుకు రారు. అట్టికస్ ఆ కేసుని తాను వాదిస్తానని అంటాడు. ఒక నీగ్రో యువకుడిని వెనకేసుకు రావడం నచ్చక ఆ ఊరిలోని తెల్లవారిలో ఎక్కువమంది అట్టికస్‌కు శతృవులైపోతారు. కేసు విచారణ ప్రారంభం అవుతుంది. అట్టికస్ ఎంత వాదించినా, ఎన్ని సాక్ష్యాలు చూపించినా అన్యాయమే గెలుస్తుంది. టాం రాబిన్‌సన్ తాను తప్పు చేయలేదని మొత్తుకుంటాడు. అయినా జ్యూరీ అతని మాట వినరు. పోలీసులు వచ్చినప్పుడు పారిపోయావు కాబట్టి నువ్వే నేరస్థుడివి అంటుంది జూర్యీ బృందం. అట్టికస్ పట్టువదలకుండా హై కోర్టుకు వెళదామని ప్రయత్నాలు మొదలుపెట్టే లోపే టాం జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నించి పోలీసుల చేతిలో మరణిస్తాడు.
టాం మరణించినా అట్టికస్ మీద బాబ్ ఈవెల్‌కి పగ చల్లారదు. ఒక చీకటి రాత్రి స్కౌట్, జెం ల మీద దాడి చేస్తాడు బాబ్ ఈవెల్. అంతలో చీకట్లోంచి ఒక వ్యక్తి వచ్చి బాబ్ ఈవెల్‌ని చంపేస్తాడు. తమని కాపాడింది తమ తండ్రే అనుకుంటారు పిల్లలు. కానీ ఇంతలో పోలీసులని తీసుకుని బయటనుంచి తమ తండ్రి రావడంతో తమని కాపాడింది తమ తండ్రి కాదని ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి అని అర్థం చేసుకుంటారు.
చీకట్లో లీలగా వెళ్ళిపోతున్న ఆకారాన్ని గుర్తు పట్టడానికి ప్రయత్నిస్తుంది స్కౌట్. తెల్లగా పాలిపోయిన చర్మం… భయం భయంగా సిగ్గుగా చూస్తున్న ఆ కళ్ళు… ఎప్పుడో తాము కిటికి సందుల్లోంచి రహస్యంగా చూసిన ”బూరాడ్” అతనే అని గుర్తుపడుతుంది స్కౌట్. పదిహేనేళ్ళుగా వెల్తురు చూడని ”బూ”… నలుగురిలోకి రాలేక ఏకాంత వాసం చేస్తున్న ”బూ”…. అతి సహజంగా పిల్లల్ని కాపాడి, అంతే నెమ్మదిగా తన ఏకాంతంలోకి జారుకుంటాడు.
శరీరం ఆకర్షణీయంగా ఉండి కేవల బాహ్య రూపంతో సమాజంలో గౌరవం పొందిన బాబ్ ఈవెల్ కుటుంబం ఒక వైపు… చేయని తప్పుకి బలైపోయిన టాం రాబిన్‌సన్ ఇంకో వైపు…. సమాజంచే అతి భయంకరుడిగా ఊహింపబడి, వెలి వేయబడి, పిల్లలని కాపాడి మరలా అజ్ఞాతంలోకి జారుకున్న బూరాడ్ మరో వైపు నిలబడి మనకి ఈ సమాజం గురించి విలువైన పాఠాలేవో చెప్తున్నట్లనిపిస్తుంది ఈ నవల చదువుతున్నంత సేపు.
మాకింగ్ బర్డ్ అంటే మన కోకిల లాగా పాటలు పాడుకుంటూ ఎవరికీ హాని చేయని ఒక బుజ్జి పిట్ట. దక్షిణ అమెరికాలో ఉంటుంది. ”బూరాడ్” కూడా మాకింగ్ బర్డ్ లాంటి వాడే. అవసరం వచ్చినప్పుడు ఇతరులకి సహాయం చేస్తాడే కానీ ఎలాంటి హానీ చేయడు. ఎవరి గురించీ అంత త్వరగా చెడు అభిప్రాయానికి రాకూడదన్న అట్టికస్ మాటలు పిల్లలకి, మనకీ కూడా అప్పటికి అర్ధం అవుతాయి.
”టు కిల్ ఎ మాకింగ్ బర్డ్” నవల సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హార్పర్ లీ రాసిన ఏకైక నవల ఇది. 1961లో దీనికి పులిట్జర్ అవార్డ్ కూడా వచ్చింది. నవల రాసి 50 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక సమాజాల్లో ఇవే అసమానతలు ఉన్నాయి. స్వేత వర్ణాల వాళ్ళు నీగ్రోలపైనా, అగ్రవర్ణాలు హీన జాతులుగా ముద్ర వేయబడిన వారిపట్లా, బలవంతులు బలహీనుల పైనా జరిపే దాడులలో ఇప్పటికీ పెద్ద మార్పేమీ లేదు. సమాజ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు వివరించే ఈ నవల ప్రతీ ఒక్కరూ తప్పక చదవాలి.
Post a Comment