ఒక చిన్ని ఆశ


అక్కడ ఒక కాకి..
తన గూట్లో పిల్లల్ని పొదుగుతోంది!
అందులో కోకిల గ్రుడ్లు ఉన్నాయని తెలియక....
అక్కడ చీమలు..
రేణువు రేణువునీ కూర్చి
 
పుట్టని కడుతున్నాయి!
పాములు చేరతాయని తెలిసో.. తెలియకో!!
ఒక కురవని మేఘం..
నల్లదనంతో నేలని కప్పి,
తనని నమ్మిన రైతుని మభ్యపెడుతోంది!!
వంచన, కర్కశత్వం,నిర్దయత్వం...
ప్రకృతి ధర్మాలని.. ఒక తెలివైన మనిషి,
మనకి ఉపదేశం చేస్తున్నాడు...
కొందరు శూన్యత ముసుగు వేసుకుని
విషాదపు చెలమల వద్ద
కన్నీటి స్నానం చేస్తున్నారు..
మరికొందరు ఎర్రజెండా కింద నిలబడి
తమ రుధిరంతో తామే
వీరతిలకం దిద్దుకుంటున్నారు...
ఇక్కడ కొందరు తమ ఆశల సౌధాలు
తమకే సమాధులైతే... తెలిసీ..
స్వచ్చందంగా అడుగు పెడుతున్నారు!!
అయినా...
అలసిపోని గొంతుకతో నా మనసు ఇంకా..
ఆత్మవిశ్వాసపు గీతిక పాడుతూనే ఉంది!!!
నిర్భయత్వంతో నడిచే నిజాయితీ పరులూ...
మమతనందించే నిజమైన మనుష్యులూ..
ఎవరో ఒకరూ.. ఎపుడోకపుడూ
వస్తారనీ...
ప్రపంచగమనాన్ని మారుస్తారనీ..
అంతుతెలియని ఆశ----
నాలో ఇంకా మిగిలే ఉంది!!

-      01.11.15

No comments