పసి చిగుర్లు


మనల్ని మనం నిర్వచించుకోని ఆ క్షణం దాకా
చీకట్లోంచి, వెలుగుల్లోంచి
నవ్వుల్లోంచి, దుఃఖంలోంచి
జారిపోతూనే ఉంటాం!!
వానకి తడుస్తూ, చలికి వణుకుతూ
అలా బ్రతుకులోంచి నడిచిపోతూనే ఉంటాం
మనలోకి మనం ముడుచుకు పోతూనే ఉంటాం.
గుండెల్లో మిగిలిన ఆఖరితడీ తుడుచుకు పోయాక. 
సాగర తీరాల్లో కట్టుకున్న సైకత శిల్పాలూ
వెన్నెల రాత్రుల్లో పేర్చుకున్న పిచ్చుక గూళ్ళూ..
అన్నీ మనసు అగాధాల్లో మునిగిపోయాక
ఎప్పుడో ఒకసారి....
ఎక్కడో ఒక క్షణం...
మనలోంచి బయట పడి వెనక్కి చూస్తాం.
భయాల బాహువుల్లోంచి బయటకి వచ్చాక,
మన మనసు మనదయ్యాక
అప్పటిదాక పక్కనే మన చూపుకి నోచుకోని
ఒక గడ్డి పువ్వు, మత్తెక్కించే గులాబీలా పరిమళిస్తుంది.
రోజూ చిరాకు కలిగించే రణగొణధ్వనులూ
ఆరోజు హిందోళ రాగం వినిపిస్తాయి.
అద్దాన్ని ముక్కుతో పొడిచి అల్లరి చేసే బుజ్జి పిచ్చుక
హఠాత్తుగా పాలపిట్ట అందాల్ని సంతరించుకుంటుంది.
నిన్నటిదాక ఎండిపోయిన పారిజాతం చెట్టు
పొద్దున్నే ఒక పసి చిగురు పూయిస్తుంది.
మనతో కలిసే ఒక గొంతూ..
మనం కావాలనుకునే ఒక మనసూ మనదయ్యాక
కాగితానికి, కలానికి జుగల్ బందీ మొదలవుతుంది.
అప్పటిదాకా మనసులో అస్పష్టంగా ఉన్న భావాలు...
ఇలా అక్షరాలుగా నాట్యం చేస్తాయి.

-      27.09.15


No comments