రహస్యంగా

పగటి అంచుని వెన్నెల రాత్రి
అందంగా తాకే చోట ...,
అమావాస్య చీకటిని కాంతి ఉదయంగా
తళుక్కుమని చేసే చోట ,
సూర్యచంద్రులు వంతులేసుకుని 
దిగంతాలలో మునకలేసే వేళ
ఈ తీరపు ఆశల్ని ఆ తీరానికి
అలలు అలలుగా చేర్చే చోట...
రహస్యంగా ఎవరో నా చేతుల్లో
ఒక బ్రహ్మకమలం వదిలి వెళ్ళారు.
బదులుగా నా హృదయాన్ని
దొంగిలించి విశ్వమంతా వెదజల్లారు
ఇప్పుడు... ఇక ఎప్పటికీ రాదనుకున్న
వసంతం వచ్చినట్లూ....
లేదనుకున్న సమస్తం చేతులు చాచి స్వాగతించినట్లూ..
మంచు వర్షంలో మంచి ముత్యం
మరల మరల మెరుస్తూ
ఈ జీవితం ఇక నీదే అంటోంది
కలల రెపరెపల రంగుల కాగితం మీద
దరహాస కవిత్వం రాస్తోంది.

మహీ..
06.09.2015.

No comments