ఆనంద లిఖితం


స్వప్నం స్వప్నం కలసిన తరుణాన
కలని దాటుకుంటూ వచ్చిన వెన్నెల బిందువుల్లా
తడి తీరపు కాంతి పరదాలమై
ఇసుక రేణువుల గుజ్జెనగూళ్ళలో కూర్చుని 
వెలుగు రేఖల గణితాలాని వల్లెవేస్తూ
కాలపు రహదారిలో
కదిలిపోతున్న యుగాలని లెక్కపెట్టుకుందాం రా
మౌనంలో చుట్ట బెట్టుకున్న మనసు స్వగతాల నిండా
అమరత్వమద్దుకున్న ఆనందమొకటి లిఖితమైన సవ్వడిలో
సాగరమే ప్రణవమైన మధురాలాపనగా స్వరిస్తుంటే
ఆర్తిగా కళ్ళని తడిమే ప్రతి బిందువూ నీ ప్రతిబింబమై
నన్ను చూపుతుంటే తెలిసిందప్పుడే
నేనయ్యాను నువ్వుగా… నువ్వయ్యావు నా నవ్వుగా అని
అనాచ్చాదితమైన బాల్యపు ముద్రల్లో నడుస్తున్నప్పుడు
ఇప్పటి దాకా తెలిసిన క్షణాలన్నిటినీ జమ్మిచెట్టెక్కించేసి
అమాయకత్వపు చిన్ని చిన్ని సంభ్రమాలని
జీవితానికి మరింత కొత్తగా పరిచయం చెయ్యటానికి
బాల్యసారులకి గాలమేస్తున్న స్వచ్ఛతకి
మళ్ళీ మళ్ళీ దాసోహమవుదాం రా

No comments