ఎర్ర గులాబీలు

గొంతు దాటిన స్వేచ్ఛ ఒకటి
రాజకీయ కుతంత్రాల ఉరితాళ్ళకి
వేళ్ళాడబడుతున్నప్పుడు...
శాంతిపిపాసుల గొంతునొక్కి
స్వాతంత్ర్యాన్ని అణగద్రొక్కి
వేడుక చూస్తున్నప్పుడు
గుప్పెడు మెతుకులు కరువై
బతుకే బరువైనప్పుడు...
మనం నమ్మిన ప్రజాస్వామ్యం
పెత్తందార్ల చేతిలో బెత్తమై చావ బాదుతుంటే
ప్రతి రోజూ శిక్షకి గురవుతున్న బడుగు జీవి
ప్రశ్నలన్నీ సమాధిలో మూటగట్టి
మూగ జీవిగా మారినప్పుడు..
చినుకులు కరువై
ఆశలు ఆవిరై
రైతన్నకి చావే వరమైనప్పుడు
కూలీల కష్టం దోచేయబడి...
పేద,మధ్యతరగతి మనుగడ ప్రశ్నార్ధకమైనప్పుడు
అప్పుడు...
అప్పుడు...
నెత్తుటి రంగు పులుముకుని
ఎర్రెర్రని గులాబీలు గుత్తులు గుత్తులుగా విరబూస్తాయ్
నరనరంలో రుధిరజ్వాలలుగా ఎగసిపడుతూ...

-మహీ..
02.09.2015.


No comments