మా పసలపూడి కథలు – వంశీ
యాంత్రికమైన
జీవితం… రణగొణ ధ్వనులు… మనస్సుల్లోనూ… మనుష్యుల మధ్యా
పెరిగిన కాలుష్యం… వీటి నుంచి దూరంగా పచ్చటి పొలాలు… స్వచ్ఛమైన మనుష్యులు… మధురమైన మట్టి వాసన… ఇవి ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది. జీవితం మీద మళ్ళీ ఆశ చిగురిస్తుంది
కదూ! ఇలాంటి మధురానుభూతుల్ని మనకందించే పుస్తకం వంశీ వ్రాసిన ‘మా పసలపూడి కథలు’. వంశీ చిత్రాలు
మనకు అందరికీ పరిచయమే. వెన్నెల్లో హాయ్, హాయ్,మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే
కురిసే’ అన్నట్లు హాయిగా ఉంటాయి ఆయన తీసిన
చిత్రాలు. అందులో పాటలు శ్రావ్యంగా, పాత్రలు కడుపుబ్బ నవ్విస్తాయి.
వంశీ పేరొందిన దర్శకుడే కాదు, మంచి రచయిత కూడా. ఆయన వ్రాసిన పుస్తకం ఈ నెల మీకు పరిచయం
చేయబోతున్న ‘మా పసలపూడి కథలు’ పుస్తకం. పసలపూడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజ వరం మండలానికి చెందిన చిన్న ఊరు. వంశీగా చిరపరిచయమైన
జివికె. నారాయణరాజు బాల్యం గడిచింది ఆ ఊరులోనే. ఆయన స్మృతులకు కాస్త కాల్పనికత
జోడించి వ్రాసిన పుస్తకం ‘మా పసలపూడి కథలు’. కథలన్నీ పసలపూడి చుట్టూ అల్లుకున్నవే. వివిధ కాలాల్లో అప్పటి
స్థితిగతులను ప్రతిబింబిస్తూ చాలా వాస్తవికంగా ఉంటాయి. గోదావరి అందాలు వినడమే గాని
అక్కడి నైసర్గిక స్వరూపం అంతగా మనలో చాలా మందికి పరిచయం లేకపోవచ్చు. అయినా ఆ ఊరి
పేర్లు అందులోని పాత్రల పేర్లు తెలుగుదనాన్ని ప్రతిబింబిచే కథాగమనం. ఆ నేపథ్యంలో
విభిన్న పాత్రల మధ్య అల్లిన మానవీయ సంబంధాలు చదువుతుంటే తొలకరి చినుకులకు తడిసిన
నేల వాసన ఆఘ్రాణించినట్లు ఉంటుంది.
కథ వ్రాయడమంటే మాటలు చెప్పినంత
తేలిక కాదు. ఒక మూడు నాలుగు పేజీలలో కథ అయిపోవాలి. ప్రతీ కథకి ఒక బలమైన కథాంశం
ఉండాలి. కథకీ కథకీ విభిన్నత ఉండాలి. అలాంటిది ఒకే ఊరి పేరుతో, ఆ ఊరినే కథాంశంగా, ప్రతీ కథనీ
విభిన్నంగా వ్రాయగలగాలంటే ఎంత ఓర్పు ఎంత నేర్పు ఉండాలి. ఇవన్నీ ‘మా పసలపూడి’ కథల్లో మనకి కనిపిస్తాయి. 2004 సం.లో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడిన ఈ కథలు ఆ తర్వాత ఒక
పుస్తక రూపంలో వచ్చాయి. మట్టికి, మనుగడకీ దగ్గరగా
కృత్రిమత మచ్చుకైనా లేకుండా ఉంటాయి. ఇందులో పాత్రలు.. మనుషుల మంచితనం గురించి ‘రామభద్రం చాలా మంచోడు’లో చదువుతాం మనం. అరవై ఏళ్ళ ‘రామభద్రం’ కథ ఇది. ప్రింటింగ్ మిషన్ నడిపే
రామభద్రం వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు. ప్రామిసరీ నోట్లు వ్రాసుకోకుండా
కేవలం నోటిమాట మీద తక్కువ వడ్డీకి అప్పు ఇస్తూ ఉంటాడు. నలుగురికి వీలైన సాయం
చేయాలి అనుకునే మనిషి. ఆ ఊళ్ళో ఒకరింట్లో చిన్న పిల్ల స్కూల్‌కి వెళ్ళనని మారాం
చేస్తుంటే ఆ అమ్మాయిని తన బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి ఐస్‌క్రీమ్ ఇప్పిస్తాడు.
బొమ్మలు కొనిపెడతాడు. మరి ఇన్ని చేసాను కదా! తాత మాట వింటావా అని అడుగుతాడు. ఓ
వింటాను అంటుంది ఆ పాప. కాన్వెంట్‌కి వెళ్దాం పదా అని తీసుకువెళ్తాడు. ఇక ఆ తర్వాత
ఆ పాప ఎప్పుడూ బడిమానదు. ఒకాయన ఇంటికి పండక్కి కూతురు అల్లుడు వస్తారు. చేతిలో
డబ్బుల్లేక దిగాలుగా ఉన్న ఆ మనిషి దగ్గరకెళ్ళి తన కుటుంబంతో పాటు వాళ్ళ
కుటుంబానికి కూడా బట్టలు కొని, జేబులో 500 పెట్టి నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఇవ్వు అని పంపిస్తాడు రామభద్రం.
కొడుకుల మీద అలిగి అన్నం తినకుండా పడుకున్న ఓ పెద్ద మనిషి దగ్గరకెళ్ళి నేను నీలాగే
ఇంట్లో గొడవపడి వచ్చాను, ఆకలేస్తుంది అని ఆ మాట ఈ మాట చెప్పి
అన్నం తిన్నాక ఇంటికి తీసుకు వెళ్ళి ఆయన పిల్లలకి, నాలుగు మంచి మాటలు చెప్పి వస్తాడు.
ఇదంతా చూసిన బంధువులు ‘నీకు పిల్లలున్నారు నీ జాగ్రత్తలో నువ్వుండాలి డబ్బులు దుబారా
చేస్తే ఎలా’ అని సలహాలు ఇస్తుంటారు. అలాంటి
రామభద్రం ఒక రోజు చనిపోతాడు. అది జరిగిన కొన్ని రోజులకి రామభద్రం గారి పిల్లల
దగ్గరికి ఒకాయన వస్తాడు. రామభద్రం గారు ఏ కాయితం వ్రాసుకోకుండా పాతిక వేలు
ఇచ్చారు. ఇదిగో అసలూ, వడ్డీ అని ఇస్తాడు. ఇంకొకావిడ ఒక
లక్ష రూపాయలు ఇచ్చి వెళ్తుంది. ఇలా వారం రోజుల పాటు ఇంటికి వచ్చే వాళ్ళకి డబ్బులు
ఇచ్చేవాళ్లకి తెంపు ఉండదు. మంచితనానికి ఇంత విలువ ఉందా అని బంధువులు
ఆశ్చర్యపోవడంతో కథ ముగుస్తుంది.
అయితే కలికాలంలో మంచితనాన్ని
స్వార్థపు మనుష్యులు ఎలా వాడుకుంటారో కూడా చూపిస్తాడు వంశీ. ఆ కథ పేరు ‘మేట్టారులోవరాజు’ తాను చదువుకోక
పోయినా, నలుగురినీ చదివించాలి, అందుకు సాయపడాలి అనుకునే పాత్ర ఇది. ఎవరైనా వచ్చి మేము
చదువుకోవాలనుకుంటున్నాము కానీ డబ్బులు లేవు అని అడిగితే లేదనకుండా డబ్బులు ఇచ్చి
పంపిస్తూంటాడు లోవరాజు. ఇది తెలిసి కొంత మంది ”చదువుకోవాలని ఆశ, కానీ డబ్బులు లేక
ఆపేస్తున్నాము” అని ఆయనని ఎలా మాయచేసి డబ్బులు
తీసుకొని మోసం చేసారో చెప్తాడు వంశీ. కథ చివర్లో. ఇలా చేస్తున్నారు అని తెలిస్తే
లోవరాజు ఏమైపోతాడో అని బాధపడతాడు. ఈ కథ చదువుతుంటే మనకి కూడా అలాగే అనిపిస్తుంది.
ఇంకో కథ ‘తూరుపోళ్ళు’. తాను కొన్న
దివాణం దొడ్డి చదును చేయడానికి తూర్పు నుంచి వచ్చిన కూలీలతో బేరమాడతాడు అబ్బులు. ఆ
తర్వాత దివాణంలో లంకె బిందెలు ఉన్నాయని పుకార్లు లేవదీస్తాడు. ఆశపడ్డ తూర్పు
కూలీలతో దివాణంలో దొరికిన సొత్తంతా మీరే తీసుకోండి అని ఉదారంగా చెప్తాడు. బదులుగా
కూలీ లేకుండా దివాణం చదును చేసి లంకె బిందెలు తీసుకోవచ్చని ఆశపడ్తారు తూర్పు
కూలీలు. చివరకు అలా పొలం చదునవుతుంది అబ్బులకి కూలీ డబ్బులు మిగులుతాయి. తూర్పు
కూలీల అమాయకత్వం ఎలా దోచుకోబడుతుందో మనకి వివరంగా చెప్తాడు వంశీ ఈ కథలో.
మంచితనం అన్నది మనల్ని బట్టి కాక
చూసే వాళ్ళను బట్టి కూడా ఉంటుంది అని మనకు అర్థం అవుతుంది. ‘దేవాంగుల మణి నవ్వినప్పుడు’ కథ చదువుతుంటే దేవాంగుల మణిది అందమైన నవ్వు. ఎవరినైనా నవ్వుతూ
పలకరించే ఆమెనీ, ఆమె నడవడికనూ అనుమానించి ఆమెను
చులకనగా చూస్తారు కొందరు యువకులు. కానీ పసలపూడిలో ఉన్న కృష్ణమాచారి గారికి మణి
నవ్వు చూడగానే తాను రోజు పూజించే కనుకదుర్గమ్మ అమ్మవారు కళ్ళ ముందు కనిపించినట్లు
ఉంటుంది. టైలరు త్యాగరాజుకి ఆమెలో తన చెల్లెలు కనిపిస్తుంది. ఆ ఊరి సూర్యనారాయణ
మేష్టారుకి ఆమెలో చనిపోయిన తన కూతురు కనిపిస్తుంది. దేవాంగుల మణి నవ్వులో ఎలాంటి
తేడా లేదని తేడా ఉందల్లా చూసే వాళ్ళ మనసుల్లోనే అని మనకు అర్థం అవుతుంది. అలాగే
వ్యసనాలు మనల్ని ఎంత దిగజారుస్తాయో చెప్పే ‘జక్కం వీరన’ కథ. అమాయకులని మోసం చేసే ‘డాక్టర్ గుంటూరు శాస్త్రి’, చిత్రవిచిత్రాలు చేసే ‘చెల్లాయత్త మొగుడు’ ఇలా ప్రతీకథా చదివి తీరాల్సిందే. ప్రతీకథా దిగువ గోదారి ప్రాంతంలో
పసలపూడి చుట్టుపక్కల అల్లుకున్నవే. ఆ భాష, ఆ యాస అందులో వాస్తవికతా మనల్ని కట్టి పడేస్తాయి. మనం వాడడం
మర్చిపోయిన ఎన్నో అచ్చ తెలుగు పదాలు ఈ కథల్లో వినిపిస్తాయి, కనిపిస్తాయి.
‘చెల్లాయత్త, కర్రోరి సుబ్బులు, బ్రాకెట్టు ఆదిరెడ్డి, కుమ్మరి కోటయ్య, పర్లాకిమిడి
నాయుడు, గవళ్ళ అబ్బులు…. వీళ్ళందరినీ పసలపూడి వెళ్ళి వెతికి మరీ చూడాలనిపిస్తుంది ఈ కథలు
చదువుతుంటే. దారుణాలు, అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవే పరమావధిగా టీవీ
సీరియల్స్ రూపంలో చూడడం అలవాటైన పరిస్థితి మనది. పొరపాటున ఒక ఎపిసోడ్ చూస్తే ఇక
ఆ రోజుకి సరిపడా నెగిటివిటీని మన మనస్సుకి ఎక్కించే అంతశక్తి ఉంది వాటికి. ఇలాంటివి
ఏవీ లేకుండా, పచ్చటి పంటపొలాల మీదుగా వచ్చే
స్వచ్ఛమైన గాలిలా ఉంటాయి వంశీ రచనల్లో కథలు, అందులోని పాత్రలు, ఖరీదైన సెంట్లు, స్ప్రేలు ఎన్ని ఉన్నా తొలకరి పడినప్పుడు మట్టి నుంచి వచ్చే వాసనకి
సాటిరావు. అది స్వయంగా అనుభవిస్తే గాని తెలియని సత్యం. అలా ఆ మట్టిలోని, చెట్టులోని పసలపూడిలోని మనుష్యుల అందమైన జీవితాల్లోని పరిమళాలని
మోసుకొస్తాయి ‘మా పసలపూడి కథలు’. కథలన్నీ చదివాక పెసర పుణుకుల పులుసు తినాలనిపించక పోయినా, పులస చేప రుచి చూడాలనిపించకపోయినా, గోదారిలో వెన్నెల రాత్రి పడవ ప్రయాణం చేయాలి అనిపించకపోయినా, పసలపూడి చూడాలనిపించకపోయినా మనలో ఏదో తేడా ఉన్నట్లే.
Post a Comment