తీపి రాక్షసుడు

తనెందుకో స్వార్ధంలోకి త్రుళ్ళి పడుతూ ఉంటాడు
అదేమంటే నువ్వే నా ఏకైక స్వార్ధం అంటాడు
సరిగ్గా అదే క్షణంలో నా ఆనందం మొదలవుతుంది
నాకెప్పుడూ తన అరచేతుల్లో సేద తీరాలనిపిస్తుంది 
క్షణమాలస్యం లేకుండా గుండెల్లో పొదుపుకుంటాడు
ఒక వెచ్చని భరోసాని నాలోకి ప్రవహింపచేస్తూ
నాకు ఓ ఓదార్పు కావాల్సినప్పుడల్లా 
తనూ ఓదార్పుకోసం పేచీ పడతాడు
 
అంతే..
జత చెమరింపుల నిర్మలత్వం మాలో లీనమౌతుంది
ఒకరినొకరం ఓదార్చుకోవటమంటే 
ఇద్దరం బాధల్లో ఉన్నామని కాదు
ఒకే బాధని ఇద్దరిమై పంచుకుంటున్నామని

వాడంతే ఓ తీపి రాక్షసుడు 
నా ప్రతీ క్షణాన్నీ
 
తన పదాల నిండా నన్ను జీర్ణం చేసుకుంటూ..

No comments