చెమ్మకురిసిన వేళ

చెమ్మకురిసిన వేళల్ని ఓదారుస్తూ 
నువ్విచ్చెళ్లిన నిశ్శబ్దం ఇంకా శబ్దిస్తూనే ఉంది
నీటి రహిత కన్నుల కాన్వాస్ పై 
కొన్ని స్మృతులు ఇంకా వెర్రిగా నవ్వుకుంటున్నాయ్
మనసుని దాటేసిన విలువలు
విపణి నిండా వెలకట్టబడుతున్న
నిజాల్ని పలకరిస్తున్నాయ్
వసంత పాత్ర పగిలినప్పుడల్లా 
శూన్యమొకటి పొంగిపొర్లుతుంది
విరామసమయాలంటూ మిగలని కాలం 
తనకి గాయమైనప్పుడల్లా
నన్ను ఆరామంగా చేసుకుంటుంది
చిక్కటి చీకటికి పగలెక్కడా తావు దొరకలేదనుకుంటా
నా గుండె వాకిట్లో ముగ్గులేస్తూ కూర్చుంది
నాలో నేను దాగుదామనుకున్నా 
చుట్టూ మిథ్యాపరదాలే కానవస్తున్నాయ్
అదిగో ఆ దిగంతాలని దాటాల్సిన
తెల్లపావురం
 
నా అరచేతుల్లోనే ఒదిగి ఒదిగి కూర్చుంటుంది ఏంతో ప్రేమగా



No comments