స్త్రీవాద ఉద్యమాన్ని ముందుకు నడిపించే గాజునది

సమాజ జీవన చిత్రాన్ని చూసి స్పందించడమే సాహిత్యం. సాహిత్యం అధ్యయనం వల్ల జీవన చిత్రాలను అర్థం చేసుకోగలుగుతాము. జీవితాన్ని శాసించే కీలక చలన సూత్రాలు అవగతం చేసుకున్నవారే నాలుగుకాలాలపాటు నిలిచే రచనలు చేయగలుగుతారు. రచయితలు అనుభవంతో రాటుతేలుతున్నకొద్దీ విమర్శకుల ఉచ్చులో చిక్కుకుంటారు. అలా బయలుదేరిన ఉద్యమాలలో స్త్రీవాద సాహిత్యమొకటి. సంకెళ్ళలో ఉన్న ఒక కొలికెని తొలగించి ఒక సమస్యతోనే విడుదల కావాలనేదే కాకుండా మొత్తం సంకెళ్ళలో ఉన్న సమస్యల కొలికెల్నీ, కొక్కేలనీ పగలగొట్టాలని చెపుతుంది స్త్రీవాదం. నేటి స్త్రీ ఆర్థిక అసమానతలతో పాటు స్వాతంత్య్రం, విముక్తి, స్వేచ్ఛ, సమానత కావాలని అభ్యర్థించడం లేదు, కోరుకోవడం లేదు. స్పష్టంగా చెప్పాలంటే సంపూర్తిగా, ధైర్యంగా అనుభవిస్తామని బాహాటంగా ప్రకటిస్తోంది నేటి స్త్రీవాదం. దీర్ఘకాల నిద్రావస్థలోంచి, అణిచిన ఉంచి వ్యవస్థలోంచి జూలు విదిల్చి ప్రపంచం మధ్యలో నిలబడి సంపూర్ణ యుద్ధం చేస్తోంది.

స్త్రీవాద సాహిత్యం ఒక స్త్రీ విముక్తి గురించి మాత్రమేకాక ఆర్థిక, సామాజిక, సాంఘిక విముక్తులనూ, స్వేచ్ఛాయుత విముక్తులనూ గురించి ప్రశ్నించి మాట్లాడు తుంది. ఎదురునిలిచి పోరాడుతుంది. స్త్రీ బాహ్య, అంతఃసంఘర్షణల ప్రపంచంలో పురుషుని ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ప్రయత్నిస్తున్న పర్యవసానమే స్త్రీవాద సాహిత్యం. అంతేకాక అదే క్రమంలో తమని బాధించి, ద్వేషించే ప్రతీ విషయాన్నీ ప్రపంచం ముందు నిలబెట్టింది స్త్రీవాద సాహిత్యం. మరో ప్రత్యేకత ఏమిటంటే స్త్రీవాదం ఆర్థిక అసమానతల విషయంలో రాజీలేని పోరాటం చేస్తూనే, తన స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం పోరాడుతుంది. అంటే పురుషుడు వర్గరహిత సమాజం కోసం ఒక చేతితో, ఒక కత్తితో పోరాటం చేస్తూంటే, స్త్రీ వర్గరహిత సమాజం కోసం చేసే పోరాటంతోపాటు పురుషాధిపత్యంపై మరో చేతిలో కత్తితో తమ అస్థిత్వం కోసం, స్వేచ్ఛా స్వాతంత్య్రంకోసం అవిశ్రాంత పోరాటం చేస్తోంది. అలాంటి స్త్రీవాదాన్ని అత్యంత సున్నితమైన, పదునైన ధ్వనితో మనకు అందిస్తున్న విస్తృత కవిత్వం శిలాలోలిత వ్రాసిన గాజునది. వివిధ సందర్భాలలో సమాజంలోని సమకాలీన అంశాలపై శిలాలోలిత కలం నుంచి జాలువారిన కవితల సంకలనం ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న గాజునదిపుస్తకం.. నిండా మానవతావాదం నింపుకుని మన హృదయా లను గాఢంగా హత్తుకోవడం శిలాలోలిత కవితల ప్రత్యేకత.

ప్రపంచీకరణ పుణ్యమా అని సమాజం చాలా అభివృద్ధి చెందింది. అయితే స్త్రీల పట్ల హింస, అణిచివేతల రూపంలో మార్పు వచ్చిందేమో కానీ సారం మాత్రం ఇసుమంతైనా మారలేదు. స్త్రీగా తన అస్థిత్వాన్ని చాటుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచీ ఇప్పటిదాకా స్త్రీవాది తన తరవాత తరానికి ఏమైనా చేయగలను అనే నినాదాన్ని వారసత్వంగా ఇచ్చింది.

సమరభూమికవిత చదువు తుంటే మన మనసులో వేల ప్రశ్నలు మొదలవుతాయి.
చెరిసగం, ఆపై సగం, మరి ఇంకొక సగం
సగం సగం, సగంలో సగం.
చూసారా చూసారా
ఎన్ని సగాలో లెక్కా పత్రాలు వేసీ
చివరికి శేషమేమిటో గుర్తించాలి.
అంటూ ఎంత సంపాదిస్తున్నా స్త్రీల జీవితాలలో మార్పు రావట్లేదని అంటారామె.
నాలుగురాళ్ళు ఎక్కువే సంపాదిస్తున్నప్పటికీ మగవాడి అర్హతలకి మించి కట్నాలు ఇచ్చుకోవాలి. కాదు కూడదంటే అలవిమాలిన మేథోమథనానికి సమకట్టాలి. కాల్‌సెంటర్లలో పనిచెయ్యాలి.
సూపర్‌ వుమన్‌కి వారసులుగా అన్నీ చేసెయ్యాలి అవుననిపించుకోవాలి.

ఏమయినా చెయ్యగలమన్న ధీమా కాస్తా అన్నీ తానే చేయాల్సిన అగత్యంలోకీ అనూదితమైన విచిత్ర సందర్భమిది అంటారు ముందుమాటలో రచయిత్రి పసుపులేటి గీత. సమరభూమి కవిత చదివాక మనకీ అలాగే అనిపిస్తుంది.
ఇప్పుడామె రక్తసిక్త బాధాగ్ని రేణువు కానే కాదు.
నిశ్శబ్దంగా మసులుకొనే మౌనచిత్రమూ కాదు.
ఎల్లలు దాటి ఎల్లడెలా సముద్రాలకా వలకడుగులేసి
కొత్త దేహపటాన్ని, వ్యక్తిత్వ సూచీతో
సమానత్వపు బావుటాను ధరించి
బ్రతుకు ఉలితో తననుతాను చెక్కుకుంటున్న శిల్పి

అంటూ కొత్త తరం స్త్రీ ఆత్మ విశ్వాసంతో ఎలా ముందుడుగు వేస్తోందీ చెప్తారామె కొత్త దేహ పటంకవితలో.
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా వారి జీవితాలలోని వైరుధ్యాన్ని అనగనగా ఓ ఇల్లుకవితలో చెపుతారామె.
ఉదయం అతడు
పేంటూ చొక్కా తొడుక్కుని వెళతాడు
ఆమె ఇంటిని కూడా తొడుక్కుని వెళుతుంది.
ఆమె నడుస్తున్న ఇల్లులా ఉంటుంది.
పొగ చూరిన పొయ్యిలా ఉంటుంది
సాయంత్రం సి.డిలు మల్లెపూలతో రిలాక్స్‌ కోసమతను
కూరలూ తినుబండారాలూ నిస్సత్తువతో ఆమె…”

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా ఏ ఇంట్లో అయినా ఇంతకు మించిన దృశ్యముంటుందాభర్తకి ఉద్యోగం ఒక షిఫ్ట్‌ అయితే ఆమెకి ఇంటిపని రెండో షిఫ్ట్‌ కదా.

మహిళ మనిషిగా ఒక అడుగు ముందుకు వేస్తే సమాజం ఆమెను మనువాదపు చీకటి శిలాయుగాలలోకి వేలాది అడుగుల పర్యంతం వెనుకకు నెట్టేస్తోంది. స్త్రీవాదం వాడి, వేడి తగ్గిపోయాయంటూ అక్కడక్కడా వినిపిస్తున్న అపనిందలకు కూడా ఎప్పటికప్పుడు జవాబు దొరుకుతూనే ఉంది. కానీ ఆ జవాబు గుర్తించడంలో కాసింత నిశితంగా, సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. శిలాలోలిత తాజా సంపుటి ఈ అవసరాన్నే నొక్కి చెపుతుంది.

శిలాలోలితకు స్త్రీవాద సిద్ధాంతం ప్రేరణనిచ్చి ఉండవచ్చు. కానీ అంతకు మించిన వస్తువిస్తృతిని సాధించుకుంది ఆమె కవిత్వం. అయితే ఒకానొక అస్థిత్వ చైతన్యాన్ని ప్రోది చేసుకోవటానికి ఆలంబననిచ్చి, అక్కడికే పరిమితమై ఉండకుండా సమాజంలో జరిగే ప్రతీ పరిణామాల ప్రభావాన్నీ ఆమె గమనిస్తూ పోయారు. జీవితంలోకి చొచ్చుకువచ్చిన వ్యాపారీకరణని ప్రశ్నించారు, నిరసించారు. ఈ నేపథ్యంలోనే అమ్మకం ధరఅనే కవిత వచ్చింది. ఈ కవితలో సహజీవనం సాగించాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు మార్కెట్‌ సరుకు కావడం వెనుక ఉన్న విషాదాన్ని ఆమె అత్యంత దయనీయంగా ఇలా చెపుతారు.
హోల్‌సేల్‌ అబ్బాయి ధర మూడు లక్షలు
రిటెయిల్‌ లైవ్‌ అమ్మాయి ధర జీవితాంత సేవ
ఇవన్నీ నిన్నటి ధరలు. రేపటి ధరలు మరింతగా పెరిగే అవకాశముందీ, త్వరపడండి
అంటారామె.

మతం చేసే గారడీనీ, మతం పేరుతో మనుషులు ఆడే క్రీడలనీ శిలాలోలిత తీవ్రంగా వ్యతిరేకిస్తారు. హైదరాబాద్‌ నా మతంఅంటూ సగర్వంగా ప్రకటిస్తారు. ఈ నగరపు సంస్కృతిలోని ఔన్నత్యాన్నీ, విశాలతనూ చాటిచెపుతారు. మతానికతీతంగా మానవ సంబంధాలు బలపడాలన్న ఆకాంక్ష వ్యక్తమవుతుంది ఆమె కవితలో.
ప్రపంచమంతా తిరిగినా, జేబులన్నీ తరిగినా
దొరకని నా హైదరాబాద్‌ బన్నూ, ఇరానీ చాయ్‌ల రుచి,
పరాఠా-షోర్వా, బిరాయానీ, షీర్‌కుర్మా, తలావా గోష్‌,
దాల్‌ఖానా హైదరాబాద్‌ నన్నా వరించే పరిమళం,
ఇప్పుడు నేను హిందువునూ కాదు, ముస్లింనూ కాదు,
మరే మతమూ కాదు.
ఏకత్వపు హైదరాబాద్‌ నా మతం
అంటారామె.

మరో కవితలో పెళ్ళైన తొలిరోజు నించీ అజ్ర వంట్లో దొంగలు పడ్డారుఅంటారామె. ఎంతో అమాయకమైన, అందమైన అజ్రఅనే పసిపిల్ల పెళ్ళయిన తరువాత భర్త పెట్టిన హింసలవల్ల ఎలా కుమిలిపోయిందో ఈ కవిత చెపుతుంది.
తెగిపడ్డ సీతాకోకల రెక్కలుఅనే ఆమె కవితలోంచి గోకుల్‌ చాట్‌ బాంబు దాడి వలన గాయపడిన ఒక సున్నితమైన మది మనకు ఆవిష్కృతమవుతుంది.
భాయ్‌ భాయ్‌ సంస్కృతిలోని మనం,
మతం రాజకీయంలోనే కానీ
మానవ అభిమతం కాదని నిరూపించిన మనం -
ఉన్మాది చేతిలో రాళ్లబాంబులు
విసిరిన ప్రతీసారీ గాయపడుతున్నాం…”
అంటూ ఎంత దుఃఖం, ఎన్ని కన్నీళ్ళుఎంత ఏడ్చినా తరగని ఊటబావులు కళ్ళు, ఈ కళ్ళకు కులమేది? ఈ కన్నీళ్ళకు మతమేది?” అని ప్రశ్నిస్తారామె. నువ్వూ, నేనూ ఒకటే, మన మధ్య ఉన్నది మానవత్వమే, కొంత ప్రేమ, కొంత నమ్మకం, కొంత ఓర్పు, కొంత దయా, మనల్ని మళ్ళీ బ్రతికిస్తుంది. కొత్త బతుకు పుస్తకం తెరిపిస్తుందిఅంటూ హింసావాదులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు శిలాలోలిత.

సమరభూమిఅనే కవితలో ఇలా అంటారు
స్త్రీలంటే ఫలానా కొలతలేననీ,
స్త్రీలంటే ముద్దులిడే మగువలేననీ,
స్త్రీలంటే ప్రచార మాధ్యమాలేననీ
స్త్రీలంటే విమర్శించడానికి పనికివచ్చే పనిముట్లేననీ
అన్నిసార్లూ, అన్ని సందర్భాలనూ
తేల్చి చెపుతూనే ఉన్నారు.
ఇలా మిగిలిన మనం ఆకాశంలో సగమా?
పురుషస్వామ్య అహంకారం తెగ్గొసి మిగిల్చిన సగమా?”
అని ప్రశ్నిస్తారామె.
తస్లీమాపై మతతత్వవాదులు చేసిన దాడి మీద ఇలా స్పందిస్తారామె.
ఒక అశ్రుతర్పణం మినహా
ఉద్వేగభరిత ఉపన్యాసం మినహా ఏమీ చేయలేని మనం
మానులం మన తోటి అక్షరకర్తను విహ్వలంగా చూడడం మినహా…”

శిలాలోలిత సమాజంలో తట్టని అంశం లేదనిపిస్తుంది ఆమె గాజునది పుస్తకం చదువుతుంటే. ఒక సందర్భంలో ఇంటి ముత్యాలుఅంటూ ఒక కవిత రాస్తారు.
ఇల్లెక్కి కూయలేని ఆమె
పిల్లల్నీ, కుటుంబాన్నీ మోస్తూ, మోస్తూ
మన ఇళ్లల్లో మన మధ్యనే
కొట్టుమిట్టాడుతూ
అవమానాల అవహేళన బ్రతుకునీడుస్తుంది.
జాతీయాదాయాలలో మహిళల ఇంటిచాకిరీ మూడొంతులున్నా
లెక్కకురాని, శ్రమ విలువలేని జీతాల్తో వీళ్ళు…”
అంటూ పనిమనుషుల జీవితాల గురించి తట్టి చెపుతుందామె. సునామీ ఉపద్రవం గురించి మరోచోట రాస్తూ కోల్పోయిన తరువాత గానీ, ఏం కోల్పోయామో తెలీదు, ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయనుకుంటాము. ఉండీ లేనప్పుడూ ఉన్నాయనుకుంటాం. కానీ కోల్పోవడమంటూ జరిగితే, నోరులేని నీరు నిట్టనిలువుగా చెలరేగుతుందనీ, నిప్పుల గుండాన్ని మోసుకొస్తుందనీ, ఊళ్ళనీ, ఊరి జనాల్నీ, నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని అర్థమయిందిఅంటూ బాధపడతారామె.

శిలాలోలిత కవిత్వంలో తత్వధోరణి కూడా అపుడపుడు కనిపిస్తూ ఉంటుంది. ఇంత చిన్న జీవితానికి ఇన్ని ముడులూ, పీట ముడులూ అవసరమా, ఇన్ని సర్దుకోవ డాలూ, సరిపెట్టుకోవడాలూ, ఇన్ని బంధా లూ-భవబంధాలూ, ఇన్ని ఆశలూ-అడియా శలూ, ఇన్ని శాంతులూ-అశాంతులూ అవసరమా అనే ప్రశ్నలు సలపరం పెడుతుంటాయిఅంటారామె.

ప్రపంచీకరణ మనల్ని మనుషులు గా కాకుండా యంత్రాలుగా ఎలా మారుస్తోంది అన్నది రోబోట్‌అనే కవితలో చెపుతారామె.
ప్రాణమున్న రోబోట్లం మనం
మనకై మనం
నవ్వం, మాట్లాడం, కరుణించం, కలిసిరాం
యంత్రాలై, మరమంత్రాలై
శవాల మీంచి, సమాధుల మీంచి
సహృదయుల మీంచి,
శతకోటి అన్యాయాల మీంచి
నడిచెళ్ళిపోతుంటాం
అంటారామె. ఈ కవితలోని వ్యక్తీకరణకు కూడా మూలాలు బ్రతుకు ప్రయాణాన్ని వాణిజ్యమయం చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలలోనే ఉన్నాయి. వీటిని పసిగట్టినందువల్లే ఆమె మానవ సంబంధాలలో లుప్తమవుతున్న ఆర్తినీ, స్నేహశీలతనీ చాలా కవితలలో స్పర్శించారు. అవును ఇక్కడ మనుషులు మాటాడుకోవడం లేదు. నిజంగా మాటాడుకోవడం లేదు. మదిలోని మాటలన్నీ మౌనంగానే మరణిస్తున్నాయి. శబ్ద దుస్తుల్ని ధరించకుండానే మిగిలిపోతున్నాయి. స్వరపేటిక తెరుచుకోవడమే లేదు. శబ్దలయలూ, స్వరవిరుపులూ, ప్రేమామృత పలుకులూ, ధ్వని గర్భ భావాలూ అన్నీ, అన్నీ ఔట్‌డేటెడ్‌ అయిపోయాయిఅంటూ బాధపడతారు ఇంకొక సందర్భంలో. బ్రతుకు కంటే స్వేచ్ఛ గొప్పది, పుట్టుక నీది చావు నీది. బ్రతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటలు ఎప్పటికీ శిలాక్షరాలుఅంటారామె.

శిలాలోలిత గాజునది పుస్తకం చదువుతుంటే ఒక రకమైన ఉద్వేగం మన మనసుని చుట్టేస్తుంది. ప్రతీ అంశంపైనా, సమాజంలోని ప్రతీ పరిణామంపైనా ఆమెకున్న నిశిత దృష్టి, మార్పు కావాలన్న తాపత్రయం ప్రతీ అక్షరంలోనూ మనకి కనిపిస్తుంది. అందుకే కవి యాకూబ్‌ ఒక సందర్భంలో ఇలా అంటాడు – ”ఓ మానవులారా వినండి. రండి. చూడండి. ఇక్కడో మనిషి ఆమె రూపంలో చంద్రవంకని భూమి మీదకి రప్పించే ప్రయత్నం చేస్తోంది.గాజునది చదువుతున్నంతసేపూ ఇవే మాటలు మన మనసులో మెదులుతూ ఉంటాయి.

బిడ్డ పుట్టగానే ఏడుస్తుంది. ఆ ఏడుపు శిశువుకు కొత్త వాతావరణంలో బ్రతకాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుంది. ఆ ఆందోళన క్రమంగా పాత జ్ఞాపకాలనుంచి, కొత్త ప్రపంచంలోకి తీసుకువచ్చి కొత్త జీవితానికి అలవాటు చేస్తుంది. స్త్రీవాద ఉద్యమం కూడా తొలినాళ్ళలో ఆవేశాలతోనూ, నినాదాలతోనూ, సూటి ప్రశ్నలతోనూ మొదలై నేడు నిప్పుల తుఫానునే సృష్టిస్తోంది. ఉద్యమ లక్ష్యం కేవలం నినాదం మాత్రమే కాదనీ, అవగాహనా, సంయమనం అన్నవి స్త్రీవాద ఉద్యమాన్ని నిరంతరాయంగా ముందుకు కొనసాగించే జీవ లక్షణాలనీ శిలాలోలిత రాసిన గాజునది చదువుతుంటే మనకు అర్థమవుతుంది.

No comments