రోహిత్ కోసం


రోహిత్!!
నువ్వు మాయమైన చోట
ఇప్పుడొక ఉత్తరం మిగిలింది.
నీ ఆశ.. నీ శ్వాస
మా అందరి హృదయాల్లో
కడలి హోరై ఎగసింది...
అంతే లేని పోరాటాల్లో
ప్రజలింక మిగల్లేదని చెప్పడానికి
రోజుకోక రోహిత్
నేలను ముద్దాడతాడు.
జనమంతా మాయమైన
నేల మాళిగల్లో
ఇప్పుడు ప్రతీ చావూ
ఒక రహస్యాగ్ని..
దుఃఖం రద్దయిన చోట,
నిర్లిప్తతే మానవానుభూతి అయిన చోట
ఒక మనిషి చావడమంటే
అతని జీవితాన్ని ఆవిష్కరించడమే!!
బానిసత్వం జన జీవనమైన చోట
బతకడం కోసమే కాదు
చావడం కూడా
ఒక హక్కుల పోరాటమే
ఏక వ్యక్తిగా నిన్న నువ్వు చేసిన పోరాటం
అనేకానేక రోహితాంశల పరంపరయై
నేడు యుద్ద భూమిలో దునుమాడుతుంది.
అనేకాలన్నీ మమేకమై
నీ మరణాన్ని అమరం చేసే సమయం
ఇప్పుడిక్కడ నా కళ్ళల్లో కదలాడుతుంది
నిజం...
ఇప్పుడిక రోహిత్
ఒక్కడు కాదు!
రోహిత్ ఆశయం ఏకవచనం కాదు
ఒక్క రోహిత్ నేలరాలితే
ఇక్కడ వేల జనం
జెండాలై రెపరెప లాడతారు.

No comments