మిత్రమా...

మిత్రమా...
ఇంతకీ,
ఇలా ఎప్పుడు మారావు?
స్మృతి శకలాలుగా రాలిపడుతూ
నీకు నువ్వే నచ్చలేనంతగా
నిన్ను నువ్వే గుర్తించలేనంతగా
ఇలా ఎప్పుడు మారావు?
వ్యక్తిత్వం వదిలి అస్తిత్వం మరచి
వట్టి మెదడుతో అలా ఎలా బ్రతికేస్తున్నావు?
పరదాలు కప్పుకున్న పద్ధతైన ప్రపంచంలో
పైసలకై పరుగు పందెం మొదలెట్టి
మిధ్యాలోకంలో మిద్దెలు కడుతూ మురిసిపోతున్నావా?
పేకమేడలెపుడన్నా చూసావా?
నీటి రాతలెపుడన్నా రాసావా?
వాటి ఆనందం ఎంత సేపు?
నీకు తెలుసా మిత్రమా!!
ఇప్పటి కన్నా చెప్పు
మనిషిలా ఎప్పుడు మారతావు?
నీలా నువ్వు మళ్ళా ఎప్పుడు పుడతావు?
పిడికెడంత గుండెలో
విశ్వమంత ప్రేమని నింపుకుని
సీతాకోక చిలుక రెక్కలపై
ఒక మంద్రమైన స్వరాన్ని చిత్రిస్తూ
మైదానం నిండా నవ్వులని వెదజల్లుతూ
మళ్ళీ ఒక్క సారి
మళ్ళీ ఒక్క సారి
మొదలయ్యి చూడు
అయినా గుర్తించలేవు నిన్ను…
కాకుంటే ఇది మరోలా..


No comments