నిర్వచనం


కనిపించీ కనిపించకుండా
ఒక ఆర్ద్ర దృశ్యం
 
వినిపించీ వినిపించకుండా
 
ఒక తడి స్వరం
 
మనసు పైన తను రాసి వెళుతున్న
 
నిశ్శబ్ద గాయం
 
ఏ పొత్తిళ్ళలోనూ ఒదగని
 
ఒక శోకం
 
---
ఇది కాదు నా నిర్వచనం
నేనంటే
మనిషిని మనిషిగా
 
నమ్మే నమ్మకం
 
కలుషితాన్ని కాలరాసే
 
మౌన కాఠిన్యం
 
ప్రమిదలో దీపంలా వెలుగుతున్న
 
నిప్పుకణాల సమాహారం...
 
తన అసహజత్వపు దురాగతాలని
 
యథాతథంగా వెల్లడి చేసే అద్దం
కళ్ళ చెమరింపు తెలిసిన దాన్నని
తేమ మొహరింపులతో
 
మాయాజాలం వేద్దామని చూస్తే
 
ఒక్క ప్రళయంగా పగిలిపోతాను

నిశ్శబ్దం పిక్కటిల్లే మౌన హృదయంలో
తొక్కిపెట్టబడ్డ మాటను వెలికి తీసాక
 
బయటకు వచ్చేవన్నీ ఉల్కాపాతాలే
ఇక ఎదురుగా మిగలడానికేమీ మిగలవులే

No comments