తీర్పు


నీ హృదయం... నీ మనసూ
అర్ధం చేసుకోలేని చోట,
నీ గురించి చేసే తీర్పుల గురించి
 
బెంగ పడకు నేస్తం!!!
వాళ్ళు చేతకాక లోంగిపోయిన పోరాటాలలో
నువ్వు భయంకరంగా పోరాడి గెలచినప్పుడు..
 
అప్పడు నీ నుదుటిపై ఏర్పడ్డ గాయం..
వాళ్ళకి అసహ్యపు మరకలా కనిపించవచ్చు.
నువ్వు నీ అంతరాంతరాల్లోనే ఉన్న
శతృవుతో ఘోరమైన యుద్ధంలో మునిగి ఉన్నప్పుడు,
పరాకుగా ఉన్న నీ చూపులు
వాళ్ళకి చంచలంగా అనిపించవచ్చు.
బహుశా నువ్వు విరిగిన నీ రెక్కలు
మళ్ళీ ఉపయోగించడం నేర్చుకుంటున్నప్పుడు
నువ్వు వదిలేసిన గమ్యాన్నే
వాళ్ళు చూస్తుండవచ్చు!
ఒక్క సారి నీకు వచ్చిన ఓటమికి
వాళ్ళు చేసే తీర్పులు..
నువ్వూ ఒక్కసారి ఉపేక్షించి చూడు
నువ్వు పడిలేచిన లోతులకీ.. నీ వేదన తీవ్రతకీ,
నీ పోరాట పటిమా.. నీలో ఉన్న ప్రేమా
కొలమానం అని
తీర్పు వచ్చే తీరుతుంది.

-      23.09.15


No comments