మ్యూజిక్‌ డైస్‌

”ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు” అన్నారు నెహ్రు. అయితే ఇప్పుడు అవే ఆనకట్టలు శవాల దిబ్బలకు నిలయాలవుతున్నాయి. అభివృద్ధి పేరుతో కట్టిన ఆనకట్టల వల్ల కొన్ని వేల గ్రామాలు కనుమరుగు అయ్యాయి… అవుతున్నాయి. క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో మొదలైన మెసపుటేమియా నిర్మాణం వల్ల లక్షలాదిమంది అభివృద్ధి చేదుఫలం రుచి చూశారు. ఇప్పుడు పోలవరం కట్టడం వలన లక్షా పది వేల ఎకరాలకు పైగా సాగు భూమి, మూడు వందల గ్రామాలు, మూడు రాష్ట్రాల్లో మూడు లక్షలకు పైగా నిర్వాసితులు అమాయకంగా మేము ఇక్కడే పుట్టాం… ఈ మట్టిలోనే కలిసిపోవాలి అంటున్నారు.


అలా తాము పుట్టిన మట్టి నుండి, తాము కౌగిలించుకున్న చెట్టు నుంచి, తన పాదాలను మెల్లిమెల్లిగా ముద్దాడిన నీటి నుండి… తమ జీవన సంగీతం నుండి, తమ సాంస్కృతిక నేపధ్యం నుండి… ఒక మనిషి దూరంగా జరిగి, చివరకు కనుమరుగైపోయి, ఒడ్డున పడిన చేపపిల్లలా దు:ఖపడడం కంటే విషాదం ఎక్కడ ఉంటుంది? ఈ నెల పరిచయం చేయబోతున్న అరుణ్‌ సాగర్‌ రాసిన ”మ్యూజిక్‌ డైస్‌”లో రూపుదిద్దుకున్న విషాదం ఇదే. అభివృద్ధి జగన్నాధ రథ చక్రాల కిందపడి నలిగిపోతున్న మూల వాసుల ఆంతరంగిక వేదనకి అక్షర రూపం మ్యూజిక్‌ డైస్‌ కవిత్వ సంకలనం.
ఈ విశ్వంలో చెట్టూ, పిట్టా, మనిషీ… ఏదీ ఎవరూ శాశ్వతం కాకపోవచ్చు. కానీ సంగీతం మరణించదు. ఆకుల గలగలలలోనో, నీటి తరగల తళతళలలోనో, మేఘాల సవ్వడిలోనో, మెరుపుల తీగల్లోనో, ఎక్కడో ఒకచోట సంగీతం తనను తాను ఆవిష్కరించు కుంటుంది. అలాంటి ఒక పాట… ఒక నదీమతల్లి గర్భంలో పుట్టిన పాట… ఒక అడవి తల్లి ఒడిలో ఊయలలూగిన ఒక పాట… ఎలా మరణించబోతోందో మనసుని కదిలించేటట్లు చెప్తాడు అరుణ్‌ సాగర్‌.
రాజ్యం తలచుకున్నప్పుడు ఆదివాసీల బడుగు జీవితాలు ఎంత?? వారి అస్తిత్వమెంత?? అస్తిత్వ రాజకీయాల యుగంలో అస్తిత్వం కోల్పోతున్న ఆదివాసీల గోడు ఎవరు పట్టించుకుంటారు?? ఒక్క కవులు తప్ప… ఇంతకీ ఏ కవి అయినా ఏం చేస్తాడు. ఆక్టేవియా పాజ్‌ భాషలో చెప్పాలంటే కవులు గోడలకి చెవులు ఇస్తారు. మూగవాడికి మాటనిస్తారు. అలా మూగబోయిన ఆదివాసీ గొంతులకి అక్షర రూపం ఈ పుస్తకం.
అరుణ్‌ సాగర్‌!!! ఒక సంపాదకుడిగా, ఒక సీనియర్‌ పాత్రికేయుడిగా, కవిగా, కథకుడిగా, చిన్న వయసులోనే మనల్ని వదిలివెళ్ళిన అమరుడిగా చిరపరచితం. కానీ లోలోపల ఆయన అసలు సిసలైన ఆదివాసీ. ఒక నిర్వాసితుడు. పాత్రికేయ వృత్తిలో పునరావాసం పొంది… ఆధునిక వేషధారణలో మగ్గిన ఒక విస్తాపితుడు. ”మ్యూజిక్‌ డైస్‌” పేరుతో వచ్చిన ఈ సంకలనంలో అరుణ్‌ సాగర్‌ ఒక హెచ్చరిక చేశాడు. రాష్ట్ర పునర్విభజన చట్టం వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ నాయకులకు వరప్రదాయినిగా మారిపోయిన పోలవరం నేపథ్యంలో ఆయన నిర్వాసితులవుతున్న తన లక్షలాది ఆదివాసీ మిత్రుల ఆఖరి వాక్యాన్ని తన గొంతుతో వినిపించే ప్రయత్నం చేశాడు.
”పుష్పవిలాపమో, బతుకు విషాదమో… జనమే పోరాడుతున్న చోట… కనీసం గొంతయినా కలపక పోవడం నేరం. కవితకు ఆచరణ సాటి రాదు. అయితే గియితే ఒక సహానుభూతి… ఒక మద్దతు ప్రకటన…
ఒక విధాన అవసరం. ఒక ధైర్య వచనం. ఒక నినాద రాత. ఇది మరణిస్తున్న పాటను చూస్తూ వ్యధ లోతుల్లోకి కూరుకుపోతున్న హృదయం”.
…ఇదీ అరుణ్‌ సాగర్‌ పుస్తకం మొదట్లో చెప్పుకున్న కన్‌ఫెస్‌. ఈ కన్‌ఫెషన్‌ ఇప్పుడు కేవలం ఆదివాసీలకు మాత్రమే కాదు. సమస్త ప్రజానీకానికి కావాలి. లేకపోతే ఈ అభివృద్ధి నమూనా మొత్తం సమాజానికి డెత్‌ సెంటెన్స్‌గా మారక తప్పదు.
”మాయా మేయమగు
మైదానం కమ్మిన ఇనుప తివాచీ
ఆపాద సంస్కృతి అనగా సాంఘిక ఆటవికత…
బతుకు పృధక్కిరణ చెందింది..
ఒకనాటి రేలపాట పరీవాహక ప్రాంతమిది
ఈ ఎడారిలో వనం కోసం అంజనం వేయాలి”.
… అంటూ..
ఇప్పుడు,
మా ఊళ్ళకెళ్తే
చెప్పలేనన్నా… మన్నించు
దు:ఖంతో గొంతు పూడుకు పోతోంది…
అంటూ అరుణ్‌ చెప్తుంటే పాఠకుల మనసు బరువెక్కిపోతుంది.
భద్రాచలం నుండి పాపికొండలు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూనవరం దాకా బస్సులో వెళ్తే ఆ అందాలు మాటల్లో చెప్పలేం. ఎర్రటి పగడాల్లా ఆరబోసిన మిరప కళ్ళాలు, రహదారి వెంట బారులు బారులుగా నడిచి వెళ్ళే గిరిజన స్త్రీలు, విల్లంబులు ధరించి అడవిలోకి నడిచి వెళ్ళే యువకులు… ఈ శబరీ సంగమ స్థలం సొగసులే వేరు. వెదురు పొదల గుసగుసలు, విప్పసారా ఘుమఘుమలు… ఇవన్నీ ఇకముందు జ్ఞాపకాలే అవుతాయంటే ఎవరి మనసైనా భోరుమనకుండా ఉంటుందా!
”మూలన పొగాకు బేళ్ళు
ఎండిపోయిన తునికాకు విస్తళ్ళు
చిట్టిలు కట్టి, కట్టుకున్న ఇళ్ళు
నిను పెంచి పెద్దచేసిన ఇళ్ళు…”
ఇప్పుడు ఆనకట్ట మెట్ల మీద జ్ఞాపకంలా కూలబడిపోతుంటే, గుండెను ఎవరో కోస్తున్నట్లు ఉంటుంది. దు:ఖం తీవెలాగా సాగి, ఇళ్ళనిండా, కళ్ళనిండా, నీళ్ళు నిండిన దృశ్యాన్ని మన హృదయ ఫలకం మీద ముద్రిస్తుంది.
సీఆర్‌ సెంద్రయ్య పేరుతో తన స్నేహితుడి గురించి రాసిన స్మృతి గీతం చదివాక చెమర్చని కళ్ళు బహుశా ఉండవు. క్షణంలో అనుభూతి ఎండిపోయి మన మనసు గ్రీష్మ గోదారిలా మిగిలిపోతుంది.
”వాడి కాళ్ళ కింద మట్టి
నీటిపాలయితే
నది కన్నీటి పాలు కాకుండదా…
కడలిలోన కలవకుండా
ఆనకట్టకు అడ్డం పడకుండా ఉంటదా…
అమ్మ గదరా మరి…
గోదారమ్మ కదరా…”
…అంటూ ఒక పాజిటివ్‌ ఆశను మనలో రేకెత్తిస్తాడు అరుణ్‌. అంతలోనే…
చెట్టుపుట్టలు కూలుస్తున్న ఒక ప్రొక్లెయిన్‌
గుండె బరువెక్కి మొరాయించింది.
ఒక మట్టి పెళ్ళ పెకిలించలేక కూలబడింది.
సాయిల్‌ టెస్ట్‌…
మట్టి నింపిన పరీక్ష నాళిక రక్తంలో చెమ్మగిల్లింది.
వాగులు వంకలు ఏరులు పారులు భోరున సుడులు తిరిగి దు:ఖపడి పెగిలిపోతున్నవి…
…అంటూ అడవితల్లి తరఫున మరణ శ్లోకాన్ని వినిపిస్తాడు.
పాటల్ని చంపేసి, ప్రకృతిని చంపేసి, నిలబడడానికి నీడలేకుండా చేసుకుంటూ, విస్తరిస్తున్న మైదానపు మోడర్న్‌ మాన్‌ ఎడారితనంపై పసీనాన్ని, పచ్చదనాన్ని వదులుకోలేని అడవి బిడ్డల తరఫున దుఃఖపు సూరీడులా వకాల్తా పుచ్చుకుని చివరికి రామయ్య తండ్రి దగ్గరకు వెళ్తాడు అరుణ్‌ సాగర్‌.
”రామయ్య తండ్రీ
నీ అరణ్యాన్ని
ఆవాసాన్ని ఆవరణాన్ని
లేడిపిల్లల్ని అడవి బిడ్డల్ని
నీ పాదాలు ముద్దాడే పాపికొండల్ని
రేపో మాపో రెవెన్యూ రికార్డుల నుండి తొలగిస్తారు.
రామా
ఇలారా
నా పక్కన కూర్చో
నాతో కలిసి ఈ గుట్ట మరణ వాంగ్మూలాన్ని విను.
దమ్మక్క పెడుతున్న శాపనార్ధాలు విను.
వినరా విను
సీలేరు ఒడ్డున విరుగుతున్న విల్లు
ఫెట ఫెటేల్‌ ధ్వానాల్‌ విను…
వినరా విను”
అంటూ… రాముడికి మరణ వాంగ్మూలం వినిపించే ప్రయత్నం చేస్తాడు.
జాతుల్నీ, వాటి సంస్కృతుల్నే కాదు, ప్రకృతిని, పర్యావరణాన్ని అభివృద్ధి పేరుతో ధ్వంసం చేసే పాలకుల దళారీ చర్యలమీద ఈ రచయిత ఏదో ఒక కవిత రాసి ఊరుకోలేదు. ఒక సంకలనమే తెచ్చాడు. ఇది కేవలం అరుణ్‌ సాగర్‌ మాత్రమే చేయగలడు. ఎంత ఆవేదన, ఎంత అవగాహన, ఎంత పోరాట పటిమ లేకపోతే ఇంత గొప్ప పని చేయగలడు??? అమర వీరుల స్థూపం ముందు ఎగురుతున్న ఎర్ర జెండాకి చేతులెత్త్తి లాల్‌ సలాం చెప్తూ సగర్వంగా ఫోటో వేసుకుని తన మ్యూజిక్‌ డైస్‌ పుస్తకాన్ని ”పోడు కోసం గూడు కోసం తూనికాకు కోసం అటవీ హక్కుల కోసం జెండాలై ఎగిరిన తల్లులకు, తండ్రులకు, అక్కలకు, అన్నలకు” అంకితమిచ్చిన అరుణ్‌ సాగర్‌ భౌతికంగా మనముందు లేకపోయినా.. కవిత్వంగా పరిమళిస్తూనే ఉంటాడు.

No comments