మెరుపు వర్ణం


ముసురు పట్టిన ఒక సాయంత్రం
సంధ్య కూడలిని దాటుతున్న కాలవర్ణంలో
తిమిరపు తీరాన పరచుకున్న రేయి దుప్పటి
తడి తడిగా అల్లుకుపోతూ
 
వలయమై నన్ను వరించినట్లుంది.
అప్పుడే
మెరుపులా నువ్వొస్తావు

కొన్ని వెన్నెల తునకలు అంటిస్తావు
 
పెదవంచున తళుకులా కుసుమిస్తావు
 
కంటినిండా పచ్చని చిగుళ్ళేసిన
 
వసంతమౌతావు.
అంతలోనే
నేనొక అలౌకికతలో ఉండగానే..
 
ఎక్కడి నుండో రహస్య సందేశం అందుకున్న
 
బహుదూరపు బాటసారిలా
 
చటుక్కున వెళ్ళిపోతావు

ఆకాశపు సిగలో కాంతి సుమాలై 
వెలుగుని పరిమళిస్తున్న నక్షత్రాలని చూస్తూ
 
గాలి కౌగిట అల్లరల్లరి చేస్తూ
 
మెలమెల్లగా కదలాడుతున్న మబ్బులతో
 
చలచల్లని ఊసులు చెప్పుకుంటూ
 
వెన్నెల చినుకుల్లో తనివితీరా తడుస్తూ
 
కలల దోబూచులాటలని ఆనందించీ.. ఆస్వాదించీ...
నీ తలపుల దారులగుండా నడుస్తున్నప్పుడు
అక్కడ
 
ఎదురుగా నాకు స్వర్గ ద్వారం కనిపించింది
నన్ను నీకు మరింత దగ్గర చేస్తూ... !!!

No comments