పరజా – డా|| గోపినాథ్ మహంతి
సామాజికంగా, సాంకేతికంగా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. కానీ, ఇప్పటికీ ఈ అభివృద్ధికి నోచుకోని సమాజం దాదాపుగా ప్రతి రాష్ట్రంలో
ఉంది. వాళ్ళలో ఎక్కువ శాతం మంది గిరిజనులే. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తెగ
పేరుతో పిలవ బడినా, వారి ఆచార వ్యవహారాలు వేరైనా వారి స్థితిగతులు మాత్రం ఒక్కటే. వారు పడుతున్న కష్టాలు
ఒకలాంటివే.
అలాంటి ఒక ఆదిమ జాతి తెగ ‘పరజా’! ఒరిస్సాలో తూర్పు
కనుమల పాదాల దగ్గర నివసించే ‘పరజా’ కొండ జాతి తెగల వ్యధాభరిత గాధ ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న ‘పరజా’ కథ. ఈ నవలను డా. గోపినాథ్ మహంతీ 1945లో వ్రాసారు. తర్వాత విక్రమ్ కె.దాస్ అదే పేరుతో ఆంగ్లంలోకి
అనువదించారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అయిన డా. గోపినాథ్ మహంతీ తన జీవిత కాలంలో
ఎక్కువ భాగం తూర్పు కనుమల్లో కొండజాతి వారితో కలిసి జీవించి, వారి ఆచారాలు, ఆశలు, సుఖదుఃఖాలు అన్నింటిలో పాలు పంచుకొని పరజా జాతి జీవన విధానాన్ని
జీర్ణించుకొని వ్రాసిన నవల ‘పరజా’.
అమాయకులైన కల్లా కపటం ఎరగని
ఆదివాసులని ప్రభుత్వం మధ్యవర్తులూ కలిసి ఎలా దోపిడి చేస్తున్నారనేది ‘పరజా’ కథ. నేలను నమ్ముకుని, సుఖంగా హాయిగా బ్రతికే ఒక ఆదివాసి కుటుంబం ఎలా ఒక షావుకారు కోరల్లో
చిక్కుకుని చక్రవడ్డీల ఇనుప పాదాల కింద నలిగి కృంగిపోయింది చెప్తారు రచయిత.
ఉత్తరాంధ్ర సరిహద్దుల్లో ఉన్న
ఒరిస్సా రాష్ట్రంలో బరంపురం దాటాక వస్తాయి తూర్పు కనుమలు. ఆ కొండలు దాటుకొని కాస్త
దూరం వెళ్ళితే ఉంటుంది లచ్చంపూర్ గ్రామం. ఆ గ్రామమే గోపినాథ్ మహంతీ ‘పరజా’ నవలకి కథా వస్తువు. ఆ గ్రామంలో ఉన్న
సక్రుజా కుటుంబం ఈ నవలకి కేంద్ర బిందువు. ఆకులతో కప్పబడిన గుడిసెల్లో నివసించే
వీరు, ఆ చుట్టు పక్కలున్న భూమిని చదును
చేసుకుని పంటలు పండిస్తూ అడవిలోకి వెళ్ళి పుల్లలు ఏరుకుంటూ, పశువుల్ని మేపుకుంటూ తేనె, చింతపండు, కుంకుళ్లు మొదలైన సరుకుల్ని అమ్ము
కుంటూ బ్రతుకుతూ ఉంటారు.
పరజా తెగకి చెందిన ‘సక్రుజా’కి ఇద్దరు మొగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు, మొగ పిల్లల పేర్లు మాండియా, టిక్రా, ఆడ పిల్లలు జిలి, బిలి. అతని గుడిసెలో పెద్ద పెద్ద మట్టి కుండల్లో ఏడాదికి సరిపడా
ధాన్యం నిల్వ ఉంటుంది. పగలంతా కుటుంబం అంతా రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టపడడం, దీపాలు పెట్టే వేళకి ఇంటికి రేరుకుని సేదతీరడం వారి జీవన విధానం.
కొండ మీద వత్తుగా పెరిగిన ఆ చెట్లని కొట్టి అడవిని చదును చేసుకొని అక్కడ వ్యవసాయం
చేసుకుంటే తన కుటుంబం సుభిక్షంగా ఉంటుందని సక్రుజా ఆశ. అడవులు నరికితే అది
తాత్కాలిక ఫలితం ఇచ్చే పంట భూమి అవుతుందే తప్ప వర్షాలు కురవక అనావృష్టి వస్తుందని
ఆ అమాయకులకు తెలియదు. ఆ అడవిలో తాము వ్యవసాయం చేయా లంటే ఫారెస్టు గార్డు అనుమతి
కావాలన్న విషయమే వారికి తెలుసు.
కోళ్ళు, అడవి కుందేళ్లు, కొంతసొమ్ము
లంచంగా ఇచ్చి ఫారెస్టు గార్డు అనుమతి పొందుతాడు సక్రుజా. ఈలోగా ఫారెస్టు గార్డు
కన్ను సక్రుజా పెద్ద కూతురు జిలిపై పడుతుంది. గ్రామ పెద్ద ద్వారా సక్రూజాకి కబురు
పెడుతాడు ఫారెస్టు గార్డు. ఇది విన్న సక్రుజా మండి పడితాడు. తన కూతురు తమ తెగలో
ఉంటుంది తప్ప ఫారెస్టు గార్డుకి అప్పచెప్పనని తెగేసి చెప్తాడు సక్రుజా. దాంతో అతని
కుటుంబానికి కష్టాలు మొదలవు తాయి. తర్వాత 15 రోజులకే రెవెన్యూ సూపర్‌వైజర్, ఫారెస్టు గార్డు వచ్చి ప్రభుత్వ అనుమతి లేకుండా అడవి నరికి, అక్రమంగా సాగు చేయాలని చూసినందుకు సక్రుజాకు 50 రూ.లు జరిమానా గాని జైలు శిక్షగాని అనుభవించాలని తీర్పు చెప్తారు.
సక్రుజా ఎంత మొరపెట్టుకున్నా అధికారులు వినరు. జైలుకి వెళ్ళిన వారిని పరజా తెగ
నుంచి వెలి వేయడం అక్కడ ఆచారం. దాంతో విధిలేక జరిమానా కట్టడానికి సిద్దపడతాడు
సక్రుజా. డబ్బు కోసం షావుకారు దగ్గరకు అప్పుకు బయలు దేరతాడు. 50 రూ.లు కోసం సక్రుజా,అతని రెండో కొడుకు టిక్రా ఆ షావుకారు వద్ద వెట్టివాళ్ళుగా ఉండే
ఒప్పందం జరుగుతుంది. షావుకారు దగ్గర సక్రుజా వంటి ఆదివాసులు అనేక మంది ఉంటారు.
అందరూ ఇలా అప్పులు తీసుకుని తమను తాము తాకట్టు పెట్టుకున్నవారే. తాము తీసుకున్న
అప్పు మాత్రమే వారికి తెలుసు. దాని మీద వడ్డీ ఎంత? ఎప్పటికి ఎలా తీరుతుందో తెలియని అమాయకులు వాళ్ళు. స్వతంత్ర జీవితం, పచ్చని చెట్లు, స్వచ్ఛమైన
కొండగాలి పోగొట్టుకుని పందులు నివసించే మట్టి శిధిలాల్లో రోజు ఇరవై గంటలు చాకిరీతో, చాలీ చాలని తిండితో బ్రతుకుతూ ఉంటారు సక్రుజా, టిక్రాలు.
ఇక అక్కడ అడవిలో సక్రుజా పెద్ద
కొడుకు మాండియాకు ఒకే ఒక్క కోరిక ఎలా అయినా అప్పు తీర్చి తండ్రిని, తమ్ముడిని తమ దగ్గరకు తెచ్చుకోవాలని. దొంగతనంగా ఇప్పసారాయి కాచి
అమ్ముతూ ఉంటాడు. అది చట్ట వ్యతిరేకమైన పని. ఈ విషయం బయటపడి అతనికి కూడా శిక్ష
పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో జరిమానా కట్టడం కోసం అతను కూడా షాపుకారు వద్ద
తనను తాను తాకట్టు పెట్టుకుంటాడు. అన్న దమ్ములు, తండ్రి దూరం అవడంతో జిలీ, బిలీ అనాధలవుతారు. ఇంతలో అస్సాంలో రోడ్ వేస్తున్నారని తెలిసి
బ్రతుకు తెరువు కోసం అక్కడికి వెళ్తారు అక్క చెల్లెళ్లు. పెద్ద కొడుకు మాండియా
ఎలాగో ఒకలా రహస్యంగా సారాయి కాచి అవి అమ్మిన డబ్బులతో తండ్రిని తమ్ముని
విడిపించుకొని చెల్లెళ్ళను కూడా వెనక్కి తెచ్చుకొని మరలా గూడెంలో అడుగు పెడ్తారు.
ఒకప్పుడు స్వతంత్రంగా బ్రతికిన ఆ కుటుంబం ఇప్పుడు పొట్టకూటి కోసం మరొకరి పొలంలో
పని చేసే పరిస్థితిలో ఉంటుంది. ఈలోగా సక్రుజా తన పొలాన్ని తనకు వ్రాసినట్లుగా
పత్రాలు సృష్టించిన షావుకారు ఆ గూడెంలో తిష్ట వేస్తాడు. అతని కన్ను సక్రుజా పెద్ద
కూతురు జిలీపై పడుతుంది. డబ్బు నగలు ఆశచూపి ఆమెను బలవంతంగా లొంగదీసుకుంటాడు.
ఎలాగైనా తమ పొలాన్ని, కూతుర్ని తిరిగి తెచ్చుకోవాలన్న
ఆశతో నేరమని తెలిసి కూడా దొంగసారా కాచి, తాము తినీ, తినక డబ్బు దాచి షావుకారు దగ్గరకు
వెళ్ళి పొలం పత్రాలు, తమ కూతురు జిలీని పంపమని కాళ్ళవేళ్ల
పడతాడు సక్రుజా. అయితే షావుకారు ఒప్పుకోడు. అతనిని ఎదిరించే ధైర్యం చేయలేక
గ్రామస్తులెవరు అతనికి సహకరించరు. సక్రుజా కడుపు దహించుకు పోతుంది. గ్రామంలో తనకి
న్యాయం జరగకపోయినా కోరాపుట్ న్యాయస్థానంలో అయినా న్యాయం జరుగుతుందనే ఆశతో కొడుకుల
సాయంతో కోర్టులో పిటిషన్ వేస్తాడు.
డబ్బున్న వాడు న్యాయ దేవతని కొనగలడు
అన్న నిజం తెలియని ఈ అమాయకుడికి, ప్లీడరు కావాలని
వాయిదా తేదీని తప్పుగా చెప్తాడు. సక్రుజా కోర్టుకి రాని కారణంగా కోర్టులో కేసు
కొట్టేసి పొలాన్ని షావుకారుకి చెందినట్లుగా తీర్పు ఇస్తారు.
తాను కోర్టుకి వెళ్ళకుండానే కేసు
అయిపోయిందని తెలుసుకున్న సక్రు గుండెలు పగిలిపోతాయి.చేసేది లేక షావుకారు పాదాలపై
పడి తన పొలం తన కూతుర్ని తనకి ఇవ్వమంటూ ప్రాధేయపడ్తాడు. ఒక గిరిజనుడు, అక్షరజ్ఞానం లేని ఒక అడవి మనిషి తన మీద కేసు వేయడం అన్న అవమానంతో, ప్రతికారేచ్ఛతో ఊగిపోతున్న షావుకారు సక్రుని ఒక్క తన్ను తన్ని నీ
పొలం లాక్కున్నాను, నీ కూతుర్ని లాక్కున్నాను అని
గట్టిగా నవ్వుతాడు.
ఎప్పుడూ నోరులేని మూగ జీవాల్లా పడి
ఉండే ఆ తండ్రి కొడుకులు కసితో, కోపంతో, నిస్సహయతతో విరగబడతారు. భుజం మీద ఉన్న గొడ్డలితో ఒక్కసారిగా
షావుకారిని తల పగలగొట్టి చంపుతాడు. ఏ జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి, ఏ తెగ నుంచి బహిష్కృతులు కాకూడదనే భయంతో వాళ్ళు ఆ షావుకారు
దగ్గరికి అప్పు కోసం వెళ్ళి తమను తాము తాకట్టు పెట్టుకొని సర్వస్వం కోల్పోయారో అదే
జైలు శిక్ష ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. అయినా వాళ్ళు పారిపోరు. రక్తసిక్తమైన ఆ
గొడ్డళ్ళతో సహా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి లొంగిపోతారు. దాంతో సక్రుజా పోరాటం
ముగిసిపోతుంది.
‘పరజా’ కథ 1945లో వ్రాసింది. అప్పటికి ఇప్పటికి గిరిజనుల జీవన విధానంలో ఎన్నో
మార్పులు వచ్చాయి. అయినా ఇప్పటికీ పరజా వంటి తెగలు సక్రుజా వంటి అభాగ్యులు ఉంటూనే
ఉన్నారు. నేలను నమ్ముకుని నేల విడిచి పెట్టకూడదనే మమకారంతో ఏళ్ళ తరబడి గిరిజనులు
ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ పోరాటాల ఫలితంగా వచ్చిన అటవీ చట్టాలు వారి
జీవన స్థితిగతుల్లో కొంత పురోగతిని తెచ్చాయి. అందువల్ల అటవీ ఫలసాయం, అడవి భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు వచ్చాయి. వామపక్షాల
చొరవతో, సమగ్రమైన పరిశోధనా ఫలితంగా అటవీ
హక్కుల చట్టం 2006 వచ్చింది.
అయినప్పటికీ అటవీ హక్కుల చట్టం 2006 ఆచరణలో కేవలం కాగితాలకే పరిమితం అయ్యింది.
సరళీకరణ విధానాల నేపథ్యంలో ‘అడ వుల అభివృద్ధి గిరిజనుల భాగస్వామ్యం’ పేరుతో వరల్డ్ బ్యాంక్ కొత్త పథకం తెచ్చింది. కోట్లాది రూపాయలు
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చాయి. సరళీకరణ విధానాల
పుణ్యమాని కాంట్రాక్టర్ల ప్రవేశానికి తోడు పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో లక్షలాది ఎకరాలు అటవీ భూముల ను సంపదను బహుళజాతి
బడా కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టడం వల్ల గిరిజనుల జీవనం అస్తవ్యస్తమవుతుంది.
ఇలాంటి పరిస్థితులల్లో అటు విద్యా వసతులు లేక, ఇటు ఫలసాయంపై ఆధారపడే పరిస్థితులు లేక గిరిజనులు పడే అవస్థలు అన్నీ
ఇన్నీ కావు. ఇలాంటి పరిస్థితులకు సంఘటిత పోరాటాలే శాశ్వత పరిష్కారం.
పరజా నవల చదువుతుంటే ఎన్నో ఆదిమ
జాతి తెగల వ్యధాభరిత గాధలు మన కళ్ళ ముందు కదులుతాయి. డాక్టర్ గోపినాథ్ మహంతీ
ఒరియాలో వ్రాసినప్పటికీ విక్రమ్ కె.దాస్ అనువాదం అదే పేరుతో అంతే సరళమైన భాషలో
అందరూ చదివి అర్థం చేసుకునేటట్లు ఉంటుంది. గిరిజనుల సామాజిక జీవన విధానం, వారి కష్టనష్టాలు అర్థం చేసుకోవాలంటే ‘పరజా’ పుస్తకం తప్పక చదవాలి.
Post a Comment