తన నవ్వు


కలలు కాటేసినప్పుడు
గుండె మురిసిన
ఒక వాస్తవాన్ని పరిచయిస్తూ వచ్చిందొక నవ్వు
ముళ్ళలోంచి
దుమ్ములోంచి
ద్వేషాల్లోంచి
నిందల్లోంచి
దుఃఖంలోంచి
నిరాశలోంచి
ఒక పవిత్రత లోకి
జీవితాన్ని అంత నిర్మలంగా
తోసెయ్యగలిగిన స్వచ్ఛమైన తన నవ్వు
తామరాకుమీద నీటిబొట్టులా
ఆకుల్లోంచి జారే వెన్నెల రేఖలా
తను నడిచిన చోటల్లా
హృదయాలమీద చెరగని ముద్రలు వేస్తున్న ఆ నవ్వు
ఆషాడ వర్ష గాడచ్చాయలలో
కంటిపాప మాటున లీనమైన రహస్యపునీడలలో
రాత్రిలా నిశ్శబ్దమైన తన నవ్వు
అరణ్యం తన ఆకుపచ్చని పాట ఆపి
ఆత్మీయంగా కౌగలించుకున్నట్లు
కాస్తంత తడిని తన చుట్టూ పరిచయించే ఆ నవ్వు
ఎక్కడ మొదలవుతుందంటే ఏం చెప్పగలం
ఒక అచ్చమైన మనిషితనంలోకి జారిచూస్తే తప్ప


No comments