మనం..


రాత్రి కన్న కలలన్నీ
మంచు బిందువులుగా మారి
గరిక కొనల మీద ఉదయిస్తున్నప్పుడు...
నీలాకాశపు నిశ్శబ్దం బద్దకాన్ని వదిలేసి
కలువపూల పరిమళాన్ని అద్దుకుని
ఆకుల చిరుసవ్వడిలో ఊపిరిగా మొదలవుతూ..
నువ్వూ నేనూ సరికొత్తగా
జన్మించిన సమ్మోహన క్షణమొకటి
ఇప్పుడే.. ఇక్కడే జారిపోతుంది..
నీతో పెనవేసిన బంధమూ,
ఇన్నేళ్ళ దూరాన్ని దూరం చేసిన
రహస్యమూ.. ఇక్కడే ఒదిగిపోతుంది.
సంక్షిప్తమైన ఆశల్ని కలుపుతూ
ఏటవాలుగా విరియడానికి 
ఓ ఇంధ్ర ధనస్సు ఆరాట పడుతునే ఉంటుంది..
ఏటి ఒడ్డున గులక రాళ్ళలో..
ఎప్పుడూ వినిపించని రాగం
స్వచ్ఛంగా మనసుని మురిపిస్తూ ఉంటుంది..
నేను చెప్పాలనుకున్నవన్నీ నీకూ
నీవు చెప్పలేనివన్నీ నాకూ
గుసగుసగా వినిపించేసి,
నీకు నాకూ మధ్య సంగీతం
నిశ్శబ్ద వేణువై విశ్రాంతిగా తడుముతుంది..
ప్రకృతి జుగల్బందీలో 
రసాత్మక కావ్యాన్ని ఆలపించి
విశ్రాంతి తీసుకుంటున్న
నీలిమేఘాల క్రింద...
మౌనంగా "మనం"..
- 25.02.15

 

No comments