ఓటమి తీరానికి..




చిగురాకుల పైకి నమ్మకాల నిచ్చెనలు
 
వేస్తున్న ఆశను...
ఆశల్ని నిలువెత్తు నిజాలుగా మార్చగల
 
ఆత్మవిశ్వాసాన్ని.. అతను ఛిద్రం చేసాక,
అప్పుడు అర్ధం అయింది ఆమెకి..
తనది కాని స్వప్నంలో తాను బతుకుతున్నానని..
ఇద్దరి మధ్యా నిశ్శబ్దపు గోడలు
ఇంకి పోయిన కన్నీళ్ళకు సమాధి కట్టాక
తెలిసింది తనకి..
గాయానికి లేపనం రాయడం కాదు,
అసలు గాయమే పుట్టకుండా చూడాలని!!
నల్లని జ్ఞాపకాలు సిరాగా మార్చి,
ఆమె చెప్పడం మొదలు పెట్టాక..
 
అప్పుడు తెలిసింది అతనికి..
అవి అచ్చోసిన మైనపు గోడలు కాదని..
ఇప్పుడు పగిలిన ఆమె 
మనసు ముక్కల్లో
తన రూపం వెతుక్కుంటున్నాడతను..
గుప్పెడు కన్నీళ్ళు చేత బట్టుకుని,
నేనున్నాననే చిన్ని ఓదార్పు కోసం...
అతనిప్పుడు వీధి వీధీ తిరుగుతున్నాడు!!
-      06.07.15


No comments