రాజధాని

పరిగెత్తాలి...పరిగెత్తాలి...
ఈ కొత్త నగరం.. ఈ కొత్త రాజధాని!!
నన్ను ఆవహించకముందే,
పరిగెత్తాలి....
మొలకను చెట్టుగా చేసిన మా ఊరు..
మట్టిబెడ్డను మడిగా మలచిన మా ఊరు..
అమ్మమ్మ చేయి పట్టుకుని పొలంవెళ్ళి...
'ఆ తాటి తోపు నుంచి.. ఇక్కడిదాకా మనదే' అని చెప్తే..
పచ్చదనంతో తప్ప.. పచ్చనోటుతో కొలవలేని..
మా అందమైన పొలం..

పసుపు నుంచి చెరకు వరకూ..
 
ఏదైనా పండించి..
చెమటనీ.. మట్టినీ.. కలిపి
ఆహారంగా మలచిన మా పొలం..
బొంగరాలాట.. కుంటాట..
ఆడి ఆడి అలసిపోయి,
మళ్ళీ ఇంటికి వచ్చి.. చింతపిక్కలూ.. వామన గుళ్ళూ..
ఎన్నో ఆటలు నేర్పించి..
ప్రతీ ఆటలోనూ.. బతుకుపోరులో
గెలుపు సాధించే ఒక మెలకువ ఉందని
మాకు నేర్పిన మా ఊరు...

నేడు రాజధాని ప్రవాహంలో 
కొట్టుకుపోతోంది!!
ఇప్పుడు మా ఊర్లో రైతు లేడు.
ఉన్నదంతా వ్యాపారులే..
ఇప్పుడక్కడ పొలంలో వ్యవసాయం లేదు..
ఉన్నదల్లా వాణిజ్యమే!!

ఇప్పుడు అక్కడ వాణిజ్యం ఒక
 
తిరుగుడు గుమ్మి..
ఆ తిరుగుడు గుమ్మిలో పడిన రైతు హృదయం...
రేపటి తరాల కోసం
పురావస్తు శాలలో
ప్రదర్శనకైనా నోచుకుంటుందా????
ఇప్పుడక్కడ మూలాల్ని తడుముకోవడం..
నోస్టాల్జియాను.. కౌగిలించుకోవడం..
అవునుమరి! విషాదాన్ని తట్టుకోలేని మనస్సు..
వర్తమానంలోకి రావట్లేదు!!

ఇప్పుడు రైతుది కాని పొలం..
గాయపడ్డ హలం..
 
ప్రతీ గొంతులో సుడితిరుగుతున్న
హాలాహలం!!
విషాదం నుండి విషాదం లోకే...
ఎప్పుడూ రైతు ప్రయాణం!!

-      23.12.14


No comments