బతుకు పాట



"జానె వాలో జరా.. మూడ్‌కె దేఖో ముజే...
ఏక్ ఇన్‌సాన్ హూమై... తుమ్హారీ తరహ్...."
చిన్ని పొట్టనీ, విధి రాసిన ఆకలినీ
మాసిన బుగ్గల్లోంచి..
నల్లని కనుపాపల తీక్షణతలోంచి
కలగలుపుకుని వస్తూ 
శ్రావ్యంగా హాయిగా సోలిపోతోంది
శృతి.. లయ.. గమకాల్లేని ఆ పాట...
ఓ రూపాయి బిళ్ళకోసం..
ఆ పాట ఆర్తిగా సాగుతోంది...
ముందుకూ వెనక్కూ ఊగుతున్న రైలు..
ఈ గమకాలకు..
సృష్టి స్థితి లయల్ని ప్రాకారం చేస్తోంది!!
ఒక బోగీలోంచి మరో బోగీకి ..
తడబడే అడుగుల నాట్యంతో
బతుకు వారధి దాటే ప్రయత్నంలో 
రెండు వేళ్ళ మధ్యలో
పల్చటి రేకుల శబ్దం చేస్తుంది
పదేళ్ళ ఆ చిన్ని పాప..
ఆమె బతుకు పాట అతనిని తట్టింది...
శ్రావ్యంగా కాదు... కఠోరంగా...
అతడి రాత్రి కధల్ని బయటకి లాగిందో..
నిదిరించిన స్వప్నాల్ని జ్వలనం చేసిందో గానీ...
ఆశగా దగ్గరకి వెళ్ళిన పాప
పసివాడని చెంప చెళ్ళుమంది.
భౌతిక సృష్టికి స్వరాలైన
ఆమె చేతిలో రేకులేమో 
ఎక్కడో దూరంగా తుప్పల్లో...
ఆ లేత చెక్కిళ్ళు ఎరుపెక్కాయి
కన్నీళ్ళ తడి స్పర్శతో 
నాదం ఆగింది
పాటా ఆగింది
స్పందన... ప్రతిస్పందన మధ్య...
మౌనంగా కొద్దిసేపు... ఆ పాప...
రోగిష్టి తల్లో..
ఆకలి గొన్న తమ్ముడో...
ఏదైనా కావచ్చు... ఎవరైనా ఉండొచ్చు 
అదే నవ్వు... అదే ధైర్యం... మళ్ళీ చిగురిస్తూ 
సంచీ లోంచి మరో రెండు రేకులు..
ఇప్పుడు.. మరో పాట.. మరో బోగి..
అదే జీవితం!!!
"రుక్ జానా నహీ... తూ కహీ హార్ కే..
కాంటోంపె చల్‌కే.. మిలేంగే సాయ్ బహార్‌కే..!!..."

- 19.01.15

No comments