ఆమె!!

కాకినాడ, కరీంనగర్
గుడివాడ, విజయవాడ...
ఊరేదైనా వాడేదైనా
ఇ-(ంటి) సేవా రూపం ఒకటే!!

ఏ పనికీ "నో" చెప్పని
సింగిల్ విండో కౌంటర్ ఆమె,
ఎంత చేసినా ఎన్ని చేసినా
ఇంకా ఏదో చేయలేదని..
తనకి తాను పెట్టుకున్న "టార్గెట్స్"
చేరుకోలేని పనిమని"షీ" ఆమె!!

పగలంతా ఆఫీసులో పని
కత్తి మీద సాము అయినా
బ్యాగుతో పాటు నీరసాన్నీ
అల్మరా లో దాచేసి..
కొంత చిరునవ్వునీ
మరి కొంత ఓపికనీ అద్దుకునే
డైనమిక్ విధేయురాలామె!!

దేనికైనా రాజీ పడాలి,
స్థిత ప్రజ్ఞతను ప్రదర్శించాలి..
గాంభీర్యం నటించాలి,
వేయి మాటలెందుకు..
పొరపాటున అయినా
హౌస్ వైఫ్ బెటరనే
అపప్రధ రాకుండా..
అడగకుండా అన్నీ అమర్చే
రోబో అవుతుందామె!!

ఇంత చేసినా ఆమె జీతం,
వేన్నీళ్ళకు చన్నీరో,
చన్నీళ్ళకు వేన్నీరో..
మొత్తం మీద అర్ధం కాక
 
వత్తిడుల చిత్తరవు అవుతుంది..
నలభై ఏళ్ళకే బామ్మయి పోయి,
అన్నీ అరిగిన..
ఆస్థియో పొరాసిస్ అవుతుందామె!!!

-      11.06.14 


No comments