నా జీవితం మళ్ళీ నాదవుతుంది!!!

నాకూ సూర్యుడికీ..ప్రతీ ఉదయం పందెం పందెం!!
ఎవరు ముందు లేస్తారా చూద్దాం అంటూ!!
ఎర్రగా వచ్చి .. తెల్లబోయిన సూర్యుడి మీదొట్టు,
గెలుపెప్పుడూ నాదే నాదే..
వాకిట్లో ముగ్గుగా మొదలైన జీవితం,
పాలల్లో తోడుగా నిద్రపోతొంది.
మా అమ్మ!! నా భార్య!! మా మేడం..
అరే అందరి కళ్ళలో ఎంత మెచ్చుకోలు!!!
నా మనసు నిండా గర్వం గర్వం..
అవును నేనో వండర్ వుమెన్!
నేను నేటి సూపర్ మాం!
ఇంతలో వచ్చింది ఓ రూపం,
కళ్ళల్లో మెరుపులేదేం పాపం?
అప్పుడు అంది నేనే నీ ప్రతిరూపాన్నని,
అర్ధం అయింది అది అద్దం అని..
అద్దం నిజమే చెప్తుంది గా..
అరే!! నాకు నేనుగా గీతలా ఉండే జీవితం,
ఇంత సంక్లిష్టవృత్తం అయిందేం?
ఒక్క అడుగు వెనక్కి వేసి 
జీవన వృత్తం నుండి వేరుపడ్డా..
పూర్తిగా..... ప్రేక్షకురాలిగా...
తిరుగుతున్న చక్రాన్ని వీక్షిస్తూ ఉండిపోయా!
వెలుపలనుండి చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంది సుమా!!
ప్రశాంతంగా ఉండే జీవనది,
ఉరుకుల పరుగుల సంద్రంగా ఎప్పుడు మారింది?
ముచ్చటగా నే వేసుకున్న ముగ్గు,
ప్రశ్నల చిక్కుముడిగా ఎప్పుడు మారింది?
సహజత్వం... నా సహజత్వం..
నా వృత్తపరిధిని విశాలం చేయాలి...
నన్ను నేను తిరిగి పొందాలి..
నాలోనూ ఉండి ఉంటుంది జ్వలనం..
కానీ మరి బయట పడదేం తరుణం!!
నాలోనూ ఒక తపన నిలిచుండేలా..
నా గమ్యం నాక్కనిపించేలా
నన్ను నేను మార్చుకుంటే....
అర్ధం అయింది నేస్తం!!
నేననే అస్థిత్వం.. నేను ఆస్వాదిస్తే..
నా జీవితం మళ్ళీ నాదవుతుంది!!!

-      17.09.14


No comments