ఒకరోజు..


అదిగో…
అక్కడ అడుగులేస్తున్న సాయంత్రం ఒకటి 
రేయి రజాయి కప్పుకుంటున్నప్పుడు, 
చిన్నగా రెక్కలిప్పుకుంటున్న దీపకాంతిలో 
కంటి తీరాల నిండా 
మెరుపుకలల తోరణాలని వేలాడ దీసుకుంటూ 
చిక్కగా మెరుస్తున్న జీవితం ..
ఏకాంతంగా చెప్పే అమాయకత్వపు అనుభవాల్లోకి 
తొంగి చూసినంతసేపూ 
వేసంగి మల్లె పరిమళమంటి 
మత్తు ఒకటి మనసు మీద
యోగినిలా విశ్రమిస్తుంది
ఇదిగో…
ఈ సూరీడు కంటి మీద కరుకుగా కదలాడినప్పుడు 
శీర్షాసనమేసిన రేయికి 
నా పగటితో పనేమీ లేనట్లుంది 
నీ వత్తిడిలో నువ్వు కాలిపో అంటూ 
నా స్వేద సముద్రాల మీదుగా వీస్తున్న చల్లగాలిలో 
తాను హాయిగా విశ్రమించింది

No comments