నన్ను నాలా ఉండనివ్వు

"నాకు మరణం మీద కోపం లేదు, కాని, మరణంలోకి తోసేసే జీవితపు/ మనుషుల దయలేనితనం మీద కోపంగా వుంది.
ఏం కోరుకుంటామో తెలియదు జీవితం నించి-
అది ఏమిస్తుందో కూడా తెలియదు.
కానీ, వొక చిన్న నిరాకరణ, చిన్న అసంతృప్తి, వొకే వొక్క అనుక్షణికపు నిస్పృహ- చాలు మనిషిలోని ప్రాణం లాగెయ్యడానికి!"-- అంటారు Afsar ఒకచోట. మన జీవితం మనం బతకలేని నిస్సహాయత లో ఈ మాటలు ఈ రోజు పదే పదే గుర్తుకొస్తున్నాయి.
“కళ్ళల్లో కాసిన్ని నవ్వులు రాసుకుందామని కూర్చుంటానా
గుండె నిండా కన్నీటి బావులు తవ్వుదామని చూస్తారు
పెదవులపైకి ఆనందాన్ని చేరవేద్దామని చూస్తుంటానా 
మనసు లోపల విషాదాన్ని నింపటానికి చూస్తారు
మరణం అంటే మళ్ళీ మళ్ళీ అయ్యే అనుభవం కాదని ఎవరో రాసారు… కానీ తప్పేమో అనిపిస్తుంది. ఊపిరి ఆగిపోవడమే కాదు మరణం అంటే. 
మనసు ఆగిపోయిన ప్రతీ క్షణమూ మరణం సంభవించినట్లే..
స్నేహం పేరుతో కొందరు మన జీవితంలోకి వస్తారు. స్నేహం అంటే ఇదే నని మనల్ని నమ్మిస్తారు. ఇక అక్కడ నుంచి మన ప్రతీ క్షణం తమ హక్కు అనుకుంటారు. అదేమంటే మన గుణగణాల మీదనే నిప్పులు చిమ్మటానికి చూస్తూ ఉంటారు.
అడవిని దహించే దావాలనం కన్నా గుండెని మండించే అవమానమే ఎక్కువ ప్రమాదం.
మన బతుకు మీద తమ ఆశలను రాసుకుంటూ మాటలతోనే మరణాన్ని ఇంజెక్ట్ చేసే వాళ్ళు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. తమని తాము అనైతికం చేసేసుకుని నరాల నిండా నరకాన్ని రాసెయ్యటానికి ఆలోచిస్తూ మన జీవితాలకి మనల్ని ప్రేక్షకుల్లా చెయ్యటానికి చూస్తుంటారు.
మనకి పరిచయమైన ముఖాల క్రింద దాగి ఉన్న ఆగంతకత్వం ఏ కంటికీ అందదు. చాటి చెప్పినా ఏ చెవికి చేరదు. వీళ్ళ ద్వారా మనసు కంటిన యాతన ఏ మనసుకీ అనుభవమవ్వదు.
అవసరార్థాల మేర ముఖాలు మార్చుకునే వంచన ఎప్పుడూ బహు ముఖమే. మిత్రులని ఎంచుకుంటే శత్రువులుగా మెసలుతూ ఉండే గోముఖ వ్యాఘ్రాలు. వీళ్ళు పాకుడు రాళ్ళ లాంటి వాళ్ళు, తెలిసి కాలు వేసినా తెలియక వేసినా మనల్నిజారి పడి పోయేలా చూడటమే వాళ్ళ సహజ లక్షణం.
వీళ్ళకి అర్థం కానిది ఏమిటంటే, నీటి జాడ కూడా లేని ఒక మాయా మబ్బు కూడా ఒక్కోసారి శిఖరాన్ని కప్పేస్తుంది. అంత మాత్రాన అది శిఖరాన్ని కమ్మేయగల గొప్పదని కాదు. కూసింత గాలి వీయగానే మబ్బు జాడ కూడా లేకుండా తేలిపోతుంది.
అందుకే మనం కోరుకోవలసిందల్లా ఒక్కటే.
ప్రియమైన జీవితమా 
నన్ను నాలా ఉండనివ్వు 
నీ విలువ ఎంతో నీకే తెలియ చెప్పుతాను”


No comments