ఇదిగో… ఇలానే ఉంటారు కొందరు


ఇదిగో…
ఇలానే ఉంటారు కొందరు
లోకం కళ్ళకి !
ప్రతి అడుగులో తోడుగా
ప్రతి నిమిషమూ నీడగా
సుతి మెత్తని మనసున్నట్లుగా
కానీ... 
కనిపించేవన్నీ నిజాలే ఐతే
కంటి చివరి కన్నీటి గుర్తులకి పుట్టుకే ఉండదు
ఓ చిరునవ్వు కింద విషం
మనసు మరణానికి తొలి ఇంధనమన్న నిజం
ఏ గుండెనీ చేరదు
అసలు నిజం ఎలా ఉంటుందో తెలుసా 
మన మధ్యే కొందరుంటారు...
వీళ్ళొక అందమైన ముసుగు వేసుకుని
ఒక మెత్తని నవ్వుతో లోకంపై ఇంద్రజాలమేస్తూ
మాటల నిండా తేనె నింపినట్లుగా కనికట్టుకడుతూ 
మనలో కాంతిని మొత్తం మెత్తగా తాగేస్తూ 
చీకటితో ఆ ఖాళీని నింపేస్తూ ఉంటారు
అయితేనేం. ఐరనీ ఏమిటంటే..
ఈ లోకమెప్పుడూ 
తమ చెవులకి వినిపించే 
తియ్యని మాటలనే నిజమనుకుంటుంది
మన ప్రక్కన కనిపించే నవ్వులనే నమ్ముతుంది 
అవన్నీ తమ మీద కప్పబడుతున్న మాయాతెరలని
తెలుసుకోలేని అమాయకపు రామచిలుకగా మారిపోతుంది
ఒక్కోసారి మరణమే తమ అంశగా మారి
మనల్ని నీడగా అనుసరిస్తున్నట్లు
రహస్యంగా ధ్వనిస్తున్న అంతఃస్వరాన్ని
బలవంతంగా కొల్లగొడుతున్నట్లు
అంతా భయం భయం 
అయినా
మనకి మనం నీళ్లై పోవాల్సిందే కానీ 
లోకానికి ఏమీ పట్టదు… 
తనకు పట్టేదల్లా తనకు కనిపించే నిజాల్లాంటి అబద్ధాలే
రాలి పడుతున్న ఒక్కొక్క కన్నీటి చుక్కా
మనిషిలోనుండి జారిపోతున్న ఒక్కొక్క విలువకూ
నిదర్శనమని అనిపిస్తుంటే
జీవితపు నడకలన్నీ 
కత్తిమొనల రక్తదారి పై
స్వచ్చంగా భ్రమింప చేసే 
విషపుజీవుల కలుషిత గాలి తోడుగానే…

No comments