మహీ మ్యూజింగ్స్-3
అప్పుడు నాకు నాలుగైదేళ్ళు ఉంటాయేమో. అమ్మకి అపెండిసెక్టమీ జరిగింది. నేనూ అక్కా చిన్న పిల్లలం. ఒడిషాలో ఎలాంటి వసతులూ లేని బలిమెలా ప్రాజెక్ట్ ఏరియా.. చిత్రకొండ లో ఉండేవాళ్ళం.
"ఈ రోజో రేపో అమ్మమ్మ వస్తుంది. ఇంక భయం లేదు." ఈ మాట అమ్మ చెప్పిందో.. నాన్నగారు చెప్పారో సరిగా గుర్తు లేదు.
కానీ అమ్మమ్మ ఉంటే చాలు ఇంక దేనికీ భయపడక్కర్లేదు అన్నది మాత్రం మనసులో నాటుకు పోయింది.
పచ్చటి పసిమి రంగు. నుదుటిన పెద్ద బొట్టు.. మెరిసే ముక్కు పుడక. మెత్తటి చేనేత చీరల్లో అమ్మమ్మ అచ్చం చందమామ కధల్లో పేదరాశి పెద్దమ్మ లా ఉండేది.
పచ్చటి పసిమి రంగు. నుదుటిన పెద్ద బొట్టు.. మెరిసే ముక్కు పుడక. మెత్తటి చేనేత చీరల్లో అమ్మమ్మ అచ్చం చందమామ కధల్లో పేదరాశి పెద్దమ్మ లా ఉండేది.
"మంచికలపూడి సరోజినీ దేవి" అసలు ఈ పేరే ఆత్మ విశ్వాసానికి మారుపేరులా ఉండేది.
ఇప్పుడంటే నేను అమ్మకూచిని… నాన్న కూచిని అంటూ ఉంటాం కానీ… నిజం చెప్పండి… చిన్నప్పుడు మనమందరం అమ్మమ్మ కూచులమే కదా!
అమ్మమ్మకి అన్నీ తెలుసు... చిన్నప్పుడు అదే నమ్మకం మాకు. అమ్మమ్మకి తొమ్మిది మంది పిల్లలు. వాళ్ళ పిల్లలం మేం 21మందిమి.మేము కాక అమ్మ వాళ్ళ కజిన్స్ పిల్లలు ఒక పదిమంది. అందరం శెలవులు రాగానే కృష్ణాయపాలెం చేరేవాళ్ళం. కృష్ణా నది వడ్డున ఉన్న అందమైన పల్లెటూళ్ళలో ఒకటి మా ఊరు.
పగలంతా ఆటలు ఒక ఎత్తయితే భోజనం టైం కి అమ్మమ్మ చేసి పెట్టే రుచులు ఒక వంతులా ఉండేవి. చాపల పులుసు చేసిందంటే ఆ సందు చివరికి వచ్చేవి ఘుమ ఘుమలు. రాత్రి పూట అమ్మమ్మ ఒక తాంబూలం పళ్ళెంలో అందరికీ మామిడి కాయ పచ్చడి, సాంబారుతో తలా ఒక పెద్ద ముద్ద పెట్టేది. అలా పెట్టేడప్పుడు తను సాక్షాత్తు అన్నపూర్ణమ్మలాగానే అనిపించేది. ఎవరికైనా పెట్టడంలో అమ్మమ్మ తరువాతే ఎవరైనా.
ఎవరైనా ఆకలంటే తన కడుపులోకి వెళ్ళే ముద్దనైనా బయటకి తీసి పెట్టేస్తుంది. పిల్లలకి పెట్టే విషయంలో అంతటి ప్రేమ చూపే అమ్మమ్మ ఒక విషయంలో మాత్రం పిల్లల్లో పిల్లగా మారి పోతుంది. అదేమిటంటారా... గోరింటాకు చెట్టు నుండి ఆకు కోసి దాన్ని రుబ్బగానే తన కోసం కాస్తన పక్కన పెట్టుకున్నాకే పిల్లలకైనా ఇంకెవరికైనా అది ఇవ్వటం. ఎనభై ఏళ్ల వయసులోనూ గోరింటాకు పట్ల అమ్మమ్మకి అదే మమకారం. బహుశా తన బాల్యం నుండి చివరి వరకూ తను కొనసాగించుకున్న పసితనపు పంట అదేనేమో. ఈ విషయం తలచుకుంటే ఇప్పటికీ నాకు పెద్దల్లో ఉండే పసితనపు స్వచ్చత అలా తలపుకు వస్తుంది.
వేసవి వచ్చిందంటే ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు వదలవు.
పున్నాగ పూలుతో పూల మాల అల్లడం.. సాయంత్రం అయితే వీధిలో ఉన్న పేడ అంతా ఎత్తుకొచ్చి శుభ్రంగా కళ్ళాపు చల్లడం. వంకర్లు లేకుండా 21చుక్కల ముగ్గు పెట్టడం.. ఇవన్నీ తన దగ్గర నేర్చుకున్నవే.
అమ్మమ్మ చాలా అందంగా ఉండేది. పచ్చటి చాయతో... తన పక్కన పడుకుని పచ్చగా మెరుస్తున్న తన పొట్టని తడుముతూ పడుకోవడం భలే ఉండేది.
సరిగ్గా అప్పుడే నేను నల్లగా ఉన్నానని భలే బెంగగా అనిపించేది. ఇవన్నీ ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది గాని అద్భుతమైన జ్ఞాపకాలివి.
అసలు అమ్మమ్మ అంటేనే ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం.
తాతయ్య పెద్దగా పట్టించుకోక పోయినా.. ఏ యేటికాయేడు తాను నమ్ముకున్న వ్యవసాయం ఇబ్బందులు పెడుతున్నా తన తొమ్మిది మంది పిల్లల్నీ.. మనవ సంతానాలమైన మమ్మల్ని ఒక తాటి మీద ఉంచి పెంచింది.
పెద్ద వసారా ఇల్లు అమ్మమ్మ వాళ్ళది. ఇంటి ముందుకి వెళ్ళగానే వసారాలో అమ్మవారిలా కనిపించేది అమ్మమ్మ.
అమ్మమ్మ చాలా ఇచ్చింది నాకు. జీవితం... ధైర్యం.. ఆశ.. అన్నీ.
అమ్మమ్మ చాలా ఇచ్చింది నాకు. జీవితం... ధైర్యం.. ఆశ.. అన్నీ.
ఇప్పుడు అమ్మమ్మ లేదు.
అమ్మమ్మ జ్ఞాపకమైన ఆ వసారా ఇల్లు లేదు.
అసలు కృష్ణాయపాలెమే లేదు. ఆ పచ్చ దనం లేదు. ఒక్క పెంకుటిల్లూ లేదు. రాజధానిలో కలిసిపోయింది.
అయినా అక్కడే ఎక్కడో అమ్మమ్మ నవ్వు.. మాట కలియతిరుగుతున్నట్లే ఉంటుంది.
అసలు అమ్మమ్మ అంటే అమ్మ టు ద పవర్ అమ్మ.
తన మమకారంతో మనం పొందినది ఆనందం టు ద పవర్ ఆనందం…
తన మమకారంతో మనం పొందినది ఆనందం టు ద పవర్ ఆనందం…
తను ఉన్నప్పుడే కాదు. తనను తలచుకున్నప్పుడల్లా తాకేస్తుంది ఆ మమకారపు స్పర్శ.
Post a Comment