ఒక చినుకు


నిన్న వర్షించనని మొరాయించిన మేఘానికి
ఎవరు చుక్కాని పట్టారో గానీ
నీలి దారాల మెలికలేసుకుని
ఆకు పచ్చని మెరుపుతో
నీటి చప్పుళ్ల తో ఏవో జ్ఞాపకాలని కదిలిస్తూ 
రాత్రి నిశ్శబ్దంపై చినుకు సవ్వడిని రాసేస్తుంది
ఎప్పుడూ మాట్లాడని ఆకాశానికి
నీలి నేపథ్యపు సముద్రానికి
వెన్నెలంటి పలుకులతో మాట కలుపుతూ
జన పదాన్ని పద్యాలుగా కేరింతలు పెడుతూ
నీటి నిచ్చెనై నింగీకీ నేలకి రాయబారం నెరపుతుంది
నా గది కిటికీ అద్దంపై చిత్రకవిత్వమై వాలుతూ
తానున్నంత సేపూ కాలాన్నీ, 
వెళ్లిపోయాకేమో మనసు గడియారాన్నీ
అలా నిలబెట్టేస్తూ
ఒక్కో వాన చుక్కా
వేయి కావ్యాల వచనమవుతుంది
ఇప్పుడు వానంటే
వేల పూరేకుల తడి పలకరింపు
చినుకంటే
చిగురించిన దీపపు మొలక 

No comments