బ్రెస్ట్ స్టోరీస్-1


' ఇంతకు మించి నువ్వు ఏం చెయ్యగలవు? '

చాలదా ఈ ఒక్క ప్రశ్న. చీకటి కోణాలు సోపానాలుగా రాయబడిన దారుణ విజయ పీఠికకి ఆవల?

అవును ఒక స్థాయిని మించిన దుఃఖం మనిషికి ఇచ్చే ధైర్యం ముందు అన్ని వ్యక్తిత్వ వికాసాలూ దిగదుడుపే... ఆ సంగతి మీరూ ఒప్పుకుంటారు ఈ పుస్తకం చదివితే...!

కొన్ని పుస్తకాలు చదివాక కలిగే ఉద్వేగాన్ని మాటల్లో చెప్పలేం. అసలు చెప్పాలంటే మాటలు రావు. కవిత్వం వచనం ఏదీ సరిపోదు.

చదివి పక్కన పెట్టాక కూడా అందులో అక్షరాలు మన గుండెలోతుల్లో చిన్న అర కట్టుకుని పాతుకు పోయాయా అనిపిస్తుంది.

ఆ దుఃఖం కళ్ళను తడపదు. గుండెను తడుముతుంది.

లే.. నిద్రావస్థ నుంచి లే.. అంటూ లోపల ఒక సముద్రమై ఎగిసి పడుతుంది.

"బ్రెస్ట్ స్టోరీస్..."

1998 లో చదివా ఈ పుస్తకాన్ని. మూడు కధల సంపుటి ఇది. చాలా రోజులు దూరంగా అలమరలోంచి చూసినా ఏదో ఉద్వేగం పట్టి ఊపేసేది. మూడే మూడు కధలు.

ద్రౌపది
బ్రెస్ట్ గివర్
చోళీ కే పీచె...

అన్ని కధల్లోనూ... రొమ్ములే కధాంశాలు. అంతే కాదు, ప్రస్తుత సామాజిక వ్యవస్థలోని దోపిడీకి బలవుతున్న స్త్రీత్వానికి ప్రతీకలు కూడా. 

ద్రౌపది కధలో ప్రధాన పాత్రధారిణి అయిన ద్రౌపది ఒక గిరిజన విప్లవకారిణి. ఆమెని పోలీసులు అరెస్ట్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడినప్పుడు...

గాయలతో, నెత్తురోడే రొమ్ములతో ఆమె నడి రోడ్డుపై నగ్నంగా నడుస్తూ... "ఇంతకు మించి ఏం చేయగలవు" అని ప్రశ్నించి నప్పుడు... సాయుధుడైన శతృవు గజ గజా వణికి పోతాడు.

అప్పుడు నెత్తురోడే ఆమె రొమ్ములు శతృవుని వణికించిన ఆయుధాలకి ప్రతీకగా రచయిత్రి మనకి చూపిస్తారు.
"ఇంతకు మించి ఏం చేయగలరు..."

ఈ ప్రశ్న పుస్తకం చదివాక మనల్ని వెంటాడేస్తుంది.

అందరూ దుఖపడే చోట... ఏ ఒక్కరో ఉవ్వెత్తున ఒక జ్వాలలాంటి ఘర్జనని గొంతుని దాటిస్తారో... అప్పుడిక దుఃఖం ఎదుటివాడి జీవితంలో కుంభవృష్టిగా కురుస్తుంది. దాన్ని అడ్డుకోవటం ఇక ఏ శక్తివల్లా అవ్వదు.

బ్రెస్ట్ గివర్ కధలో కుటుంబాన్ని పోషించడానికి కిరాయికి పాలిచ్చే వృత్తిలో చేరిన ఒక తల్లి.. తాను పాలిచ్చి పెంచిన ఏ కోడుకూ తనని ఆదుకోకపోగా... తన కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగ పడిన తన రొమ్ములూ ఆమెని మోసం చేసిన పరిస్థితుల్లో రొమ్ము కాన్సర్ తో చనిపోతుంది.

ఆ కధ చదువుతుంటే కన్నీళ్ళు ఆగవు మనకి.

మహాశ్వేతాదేవి!!

తాను ఏ అక్షరమైతే రాసిందో, అదే శ్వాశగా బతికిన గొప్ప మనిషి. గిరిజనుల జీవితాల గురించి రచనలు చేయడంకోసం, ఆ తెగలతో పాటు అడవుల్లో తిరిగి వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకున్నారు. ఆమె రచనలు సామాజిక పరిశోధనా గ్రంధాలు. ఆమె అక్షరం సాహిత్య ప్రపంచపు సాధికారత.

...............



No comments