బ్రెస్ట్ స్టోరీస్- 2



చోళికే పీఛే..

మహాశ్వేతాదేవి!!

ఉపెన్ అనే ఒక చాయా గ్రాహకుడు, గంగా (గంగోర్) అనే ఒక నిరుపేద మహిళ మధ్య జరిగిన కథ. చాయాగ్రాహకుడైన ఉపెన్, తన వృత్తిలో భాగంగా గ్రామీణ జీవన పరిస్ఠితులని ఫొటోలు తీయడానికి ఒక గిరిజన గూడేనికి వెళతాడు. అక్కడ పసిపిల్లకు పాలిస్తున్న గంగ ను చూస్తాడు. మారుమూల గిరిజన ప్రాంతంలో స్వచ్ఛంగా అమాయకంగా కనిపించిన ఆమె అచ్చమైన భారతీయ అందానికి ప్రతిబింబంలా అతనికి కనిపిస్తుంది.... గంగ ఫొటోలను తీస్తాడు. యాదృఛ్చికంగానే గంగ రొమ్ములను ప్రతీకగా కొన్ని చిత్రాలను తీసిన ఉపెన్ వాటిని ఒక తాను పని చేస్తున్న జాతీయ పత్రికలో అచ్చువేయిస్తాడు.
క్రమంగా వాటి పట్ల ఒక విధమైన అబ్సెషన్ పెంచుకుంటాడు. తన భార్య కృత్రిమ అందాలను గంగతో పోల్చుకుంటూ భార్య పట్ల విముఖత ప్రదర్శించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత జరిగిన అనేక సంఘటనలు గంగ జీవితాన్ని అగాధంలోకి తోసేస్తాయి. ఉపెన్ జీవితం కూడా దిగజారిపోతుంది. భర్త నుంచే కాక తమ తోటి గిరిజనులనుంచి నిరాదరణకు గురైన గంగ, చాలా దారుణంగా పోలీసులచే గ్యాంగ్ రేప్ కు గురవుతుంది.
తప్పనిసరి పరిస్థితుల్లో పొట్ట కూటికోసం వ్యభిచారిగా మారుతుంది. ఆమెని వెతుక్కుంటూ వెళ్ళిన ఉపెన్ ఒక వేశ్యా వాటికలో ఆమెని చూసి నిర్ఘాంత పోతాడు. గంగను కలిసే సమయానికి అక్కడ "ఛోళీకే పీఛే క్యాహై" పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుందని రచయిత్రి మనకి చెప్పడం ద్వారా , ఈ కధ నుంచి ఆమె చెప్పదలచుకున్నారో మనకి అర్ధం అవుతుంది. రవిక తీసి, పచ్చిగాయాలుగా రక్తమోడుతున్న తన వక్షోజాలను చూపించి , ఇప్పుడు మరలా వీటిని పత్రికలో చూపించు అంటుంది గంగ విచలితుడైన ఉపెన్.. చివరికి రైలు ప్రమాదంలో చనిపోవడంతో కథ విషాదాంత మవుతుంది.

కలవర పెట్టే అనేక భయానక దృశ్యాలను ఈ కథలో రచయిత్రి చిత్రించిన తీరు పాఠకులని తీవ్రంగా ఆలోచింపచేస్తుంది.

ఖల్నాయక్ సినిమా రిలీజ్ అయిన సంవత్సరం ఛోళీకె పీఛె క్యాహై పాట సృస్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఛోళీకె పీఛె క్యాహై.. అన్నది ఆ సంవత్సరపు జాతీయ సమస్యగా మారిపోయింది అంటారు మహాశ్వేతా దేవి. పంటలు పండక పోవడం, కరవుకాటకాలు, ఉగ్రవాదం, ఘర్షణలు, నర్మదా బచావో ఆండోళన, విచ్చలవిడిగా జరుగుతున్న మానభంగాలు వగైరా అంశాలన్నీ ఛోళీకే పీఛే.. ఏముందన్న సమస్య ముందు అప్రధానమై పోయాయి అంటారు ఆమె. 


ఛోళీకే పీఛే... ఒక స్త్రీ మూర్తి మనసు ఉందని ఈ సమాజం అర్ధం చేసుకోనంత వరకూ.. ఇలాంటి కధల ప్రాధాన్యత ఉంటూనే ఉంటుంది.


No comments