మనందరినీ పదంగా కూర్చుకుంటూ…

We want solid words
that resist in the middle of the night
the new winds of the world
words born of foundations
words born of building foundations
rock-hard
unyielding words.
Words not for the prepared speech
on our pressing world
but for getting to the bottom of the thirst,
the outcry,
the proclaimed “Enough” of the hungry
mestizos through the darkness of the exploitation
and the light of their rage.
Words for the song of the conscious.
-----Roque Dalton

నిన్నటి వరకూ గౌరీ లంకేష్ ఎవరో నాకు తెలియదు… నాకే కాదు ఈ రోజు ఆమె కోసం గొంతు విప్పుతున్న వాళ్ళల్లో చాలా మందికి ఆమె తెలియదనే అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే ఆమె దేహం కూలదోయబడిందో అప్పుడు… దేశం మొత్తానికి తెలిసింది… ఆమెని నిజం చుట్టుముట్టి ఉందని. ఇన్నాళ్లుగా ఆమె నిజంతోనే నిలబడి ఉందని. లేకుంటే దాన్ని సమాధి చెయ్యటానికి దురాత్ములు ఇంతకు తెగబడరని. ఆమె దేన్ని మాట్లాడుతుందో అది నిజమన్న సంగతి ఇప్పుడింకా కొన్ని కోట్ల మందికి చేరింది.
మరి ఆ దురాత్ములు ఏమి సాధించినట్లు? చరిత్రని తిరగేసి చూడండి ఒక దేహం కూలబడిన చోట నుండే మరింత చైతన్యం పుట్టుకొచ్చిన దాఖలాలే కనిపిస్తాయి.
అసలు ఎప్పుడైనా చరిత్రలో ఒక హేతువాది ఒక మతతత్వవాదిని హత్య చేయడం చూసామా? కనీసం ఒక అభ్యుదయ వాది ఒక మూఢ విశ్వాసుని హెరాస్ చేయడం చూసామా.? లేదు.. ఎందుకంటే! ఒక హేతువాది ప్రతీ మనిషిలోనూ మానవత్వాన్నే చూస్తాడు. ఈ రోజు కాకపోతే రేపైనా మంచి గెలుస్తుందనీ, మానవత్వం పరిఢవిల్లుతుందని ఆశిస్తాడు.
ఒక బ్రూనో, ఒక కాపర్నికస్, ఒక గెలీలియో, ఒక డార్విన్... వీళ్ళని చరిత్రలో ఫాసిస్టులు ఎన్ని తిప్పలు పెట్టారో మనకి తెలియంది కాదు. అంత మాత్రాన సైన్స్ ముందుకి వెళ్ళకుండా ఆగిపోయిందా? 
అలాగే ధభోల్కర్, కల్బుర్గి, గౌరి లంకేష్ వీళ్ళ గొంతులు నొక్కేయడం వల్ల అభ్యుదయం ఆగిపోదు.
మహా అయితే కొన్ని అడుగులు తడబడతాయి. కొన్ని గొంతుకలు కొన్నిరోజుల పాటు మూగపోతాయి అంతే. అంతకు మించి ఏమీ జరగదు.
ఒక ఫాసిస్టు యుద్ధం గెలిచిన చరిత్ర ఎక్కడైనా ఉందా. ఒక వేళ గెలిస్తే అది శాశ్వతమైన గెలుపుగా గుర్తించబడి చరిత్రలో నిలిచిందా? మూడ విశ్వాసంతో ఏదైనా ఒక రోగాన్ని నయం చేయడం ఎక్కడైనా రిజిస్టర్ చేయబడిందా?
మతం ఎక్కడైనా సామాజిక న్యాయాన్ని తీసుకురాగలిగిందా?
ఏ ప్రశ్నకి అవునని సమాధానం చెప్పగలం మనం? దేనికీ సమాధానం లేదు.
రక్తాన్ని కోరుకున్న ప్రతి సిద్ధాంతమూ, తాను వాదనలో ఓడిపోయిందన్న నిజాన్ని తనకు తానుగా ఒప్పుకున్నట్లే.
మరింకేం సాధిద్దామని ఈ అరాచకత్వం?
అక్షరానికి భయపడే సిద్ధాంతాల మాటున దాగి ఉన్న ప్రతి పిరికితనమూ తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఇంతవరకూ అక్షరాన్ని వధ్యశిలపై నిలబెట్టిన ప్రతిసారి, తాను మరింత ప్రజ్వలితమై తలారినే దహించిన ఘటనలే చరిత్ర నిండా పోగుపడి ఉన్నాయి. మరోసారి అది పునరావృతం అవుతుంది తప్ప మరోలా జరగదు.
“పోరాటం అనివార్యమైనప్పుడు
రక్తసిక్తమైన చరిత్ర పుటలింక మనిషిని భయపెట్టలేవు
ఇదిగో.. ఇలా ఎన్ని ఆకులు రాలి
కొమ్మలు విరిగినా
మాహావృక్షాన్ని కూలదోయడం ఎవరి తరమూ కాదు.
మిత్రులారా
ఒక సారిటు రండి
అక్షరమనే ఆయుధాన్నింకా అధ్యయనం చేయండి.
ఇదిగో ఇక్కడ ఒక రక్త వర్షం పారదర్శకం గానే ప్రవహిస్తోంది. 
భయం లేని ఒక దురహంకారి చేతిలో గాయపడ్డ ఒక గుండె ధార అది.
వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూనే ఉంది.
ఒక్క సారిటు రండి. 
ఈ అనంత క్షేత్రంలో అక్షరాన్ని విత్తనంగా నాటుదాం.
ఇలా వధ్య శిలపై వాలిపోయే నిస్సహాయ శిరస్సు కాదు అక్షరం అంటే.. 
అక్షరం అంటే జ్వలనా జ్వలనంగా ప్రకాశించే సత్యం
అక్షరం అంటే ఒక నీలి స్వప్నాల అంకురం
అక్షరం అంటే అవినీతి పాదాలని జివ్వున గుచ్చే నీతి కంటకం 
కాలం చేతుల్లో ఎదిగి 
చరిత్ర భుజస్కంధాలకంది వచ్చే ఆయుధం “
ఇప్పుడు విషసర్పాల్లాంటి ఆయుధాలు అక్కర్లేదు మనకి.చలిచీమల్లాంటి చురుక్కున కరిచే అక్షరాలు కావాలి.
నీ నుండి ఒక్క అక్షరం… 
నా నుండి ఒక్క అక్షరం… 
తన నుండి ఒక్క అక్షరం… 
మనందరినీ పదంగా కూర్చుకుంటూ…

1 comment

nmrao bandi said...

thought-provoking write up ...