ఫ్రెండ్‌షిప్ డే!!


స్నేహం అనగానే ఇప్పుడు ఎంతమంది స్నేహితులైనా ఉండనీ.. చిన్నప్పటి స్నేహాలే ముందు గుర్తొస్తాయి...
ఇప్పుడు తనతో చెప్పుకున్న వర్షం కబుర్లూ... 

వెన్నెల మాటలూ గుర్తొస్తాయి.
పారిజాతం పూవు పూయగానే పండుగ చేసుకోవడం..
అడవి సంపెంగ మొక్కని ఇంట్లో తెచ్చి పెట్టుకుని.. మొగ్గ తొడగట్లేదని బెంగ పడడం..
నేను గాయపడితే తన కళ్ళల్లో సముద్రం ఊరడం..
అవీ.. ఇవీ అని కాకుండా గంటలు గంటలు చెప్పుకున్న కబుర్లూ.. 
వీటన్నింటికీ మించి స్నేహం అంటే ఖలీల్ గిబ్రాన్ కవిత గుర్తొస్తుంది!!

"నీ అవసరాలకు సమాధానమే నీ మిత్రుడు" అంటాడు ఖలీల్. ఎంత లోతైన భావన ఇది. నిజమే! స్నేహం అంటే మన అవసరాలకు సమాధానమే కాదు. స్నేహం మన అవసరం కూడా. స్నేహం ఆక్సిజన్ లాంటిది. అది లేకుండా మనగలగడం చాలా కష్టం!!

అందుకే స్నేహం విలువ తెలీని వాళ్ళు ఉంటారేమో కానీ.. స్నేహం తెలియని వాళ్ళు బహుశా ఉండరేమో. స్నేహం అంటే ఒకరికొకరుగా బ్రతకడమే కాదు.. ఎదుటి వారి స్వేచ్ఛని గౌరవించడం కూడా..
ఒక వ్యక్తితో స్నేహం చేసినప్పుడు... యాధాతదంగా వాళ్ళ జీవితాన్ని ఇష్టపడాలి. తన ఆలోచనలూ.. తన అభిప్రాయాలూ... వీటిని గౌరవించక పోతే ఇంక స్నేహం ఎక్కడిదీ??? చాలా గాయాలకి కారణం ఈ గౌరవం లేకపోవడమే..

స్నేహం అంటే మనకి నీడ కాదు. స్నేహం మన శ్వాస..స్నేహమంటే మీరు నిశ్శబ్దం గా ఉన్నప్పుడు కూడా మీ గుండె చెప్తున్నది తను అర్ధం చేసుకోవాలి.

మీ కేరింతల వెనుక దాచిన దుఃఖాన్నీతనూ..తన నవ్వులో దాగున్న శూన్యాన్ని మీరూ.. పట్టుకోగలగాలి. 
అందుకే ఖలీల్ గిబ్రాన్ ఇలా అంటాడు..

"ఆత్మని మరింత విస్తృత పరిచేందుకు తప్పించి స్నేహానికి మరొక ఉద్దేశాన్ని తలపెట్టవద్దు..

తన మర్మాలను వెల్లడి చేయడానికి మించి మరేదో పట్టుకుందామని స్నేహం కోరుకుంటే అది స్నేహం కాదు, అది విసిరిన వల అవుతుంది...

మీ మిత్రునికి మీలో అత్యుత్తమమైనవి కేటాయించండి..
సమయాన్ని వృధాగా గడిపేందుకు స్నేహం వద్దు...
మీ సమయాన్ని సజీవంగా ఉంచేందుకు స్నేహాన్ని కోరుకోండి!!"


No comments