Anne Frank - The Diary of a Young Girl


"I still believe, in spite of everything, that people are still truly good at heart..." 

1944 August 4 న అంటే ఇదే రోజు ఆ పసిపాప అరెస్ట్ కాబోయే ముందు పలికిన మాటలివి.

సైరన్ వినిపిస్తే చాలు. అది మా కోసమే అన్న భయం ఏ క్షణంలో మృత్యువు ఏ రూపంలో వస్తుందో అన్న ఆందోళన. మా రెండేళ్ళ అజ్ఞాత జీవితం ఈ రోజు తో ముగిసి పోతుంది. బయట ముష్కరులు తలుపులు పగల గొడుతున్న చప్పుడు మరణ మృదంగంలా వినిపిస్తోంది. నా ప్రియమైన కిట్టీ ! నిన్ను కూడా బానిసత్వంలోకి పటుకెళ్ళడం నాకు ఇష్టం లేదు వదిలి వెళ్తున్నందుకు క్షమించు. ఇన్నాళ్ళుగా నా మనస్సులోని భావాల్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు సెలవామరి. 1944 సంవత్సరం ఆగస్టు 1న అన్నే ఫ్రాంక్ తన డైరీలో వ్రాసుకున్న చివరి అక్షరాలివి.

ఫాసిజం. ఒక జాత్యహంకార ఉన్మాదం. ప్రపంచంలో ఆర్యుల ఆధిపత్యం నిరంతరంగా కొనసాగాలని నెత్తటి — ఏరులు పారించిన రకసి సాసి హిట్లర్ స్ట్రేణి యూదులు, క్రిస్టియన్లు, కమ్యునిస్తులు, ఉదార వాదులు అందరూ అతని మృత్యుక్రీడల్లో బలైనవారే. పాలు తాగే పసిపాపల నుంచి కాటికి కాళ్లు చాచిన ముత్తవ్వల వరకూ అందరూ అతని క్రౌర్యాన్ని అనుభవించిన వారే. హిట్లర్ మరియు అతని అనుయాయులు సాగించిన నరమేధానికి సాక్షిభూతంగా నిలిచిన ఒక చిన్నారి ఆత్మకథ Anne Frank-The Diary of a Young Girl ఆమె జీవితంలో అత్యంత భయానక ఘటనల సమాహారమే ఈ డైరీ.
Anne Frank - The Diary of a Young Girl అరవై ఆరు సంవత్సరాల క్రితం ఒక 14 సంవత్సరాల అమ్మాయి వ్రాసుకున్న డైరీ. ఇందులో సెక్స్ లేదు. హింస లేదు. కానీ ప్రపంచ సాహిత్యంలో సుస్థిర స్థానం సంపాదించింది. ఇప్పటికి హాట్ కేక్లా అమ్ముడుపోతుంది. ఎందుకంటే ఈ పుస్తకంలో జీవితం ఉంది. నూరేళ్ళ జీవితం కూడా నేర్పలేని పాఠం ఉంది. కోట్ల మంది కన్నీళ్ళకి అక్షర రూపం ఇచ్చిన ఒక సజీవ భాష ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే హిట్లర్ నరమేధానికి బలైన యువత హృదయ స్పందన ఉంది.
సరదాగా సాగిపోయే మధ్య తరగతి కుటుంబం Anne Frank ది. 14వ పుట్టిన రోజున తన సమీప బంధువు బహుమతిగా ఇచ్చిన డైరీకి ప్రేమగా కిట్టి అని పేరు పెట్టుకుంటుంది. ఆ రోజు నుంచి కిట్టితో తన స్కూల్ స్నేహితుల కబుర్లు పంచుకుంటూ ఉంటుంది. హఠాత్తుగా ఒక రోజు నాజీల దండయాత్రతో ఆమె నివసించే నగరం కకావికలమై పోతుంది. ప్రాణ భయంతో అన్నే ఫ్రాంక్ కుటుంబం అమస్టర్ డామ్ లోని ఒక రహస్య స్థావరంలో తలదాచుకోవలసి వస్తుంది. ఆ స్థలం అన్నే ఫ్రాంక్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ స్నేహితుడికి చెందిన ఒక ఆఫీసు వెనుక గోదాం.
అసలు హిట్లర్ ఎవరో తెలియదు. ఎందుకు యూదులపై పగబట్టాడో తెలియదు. సరదాగా సాగిపోయే జీవితం ఎందుకిలా దుర్భరంగా మారిపోయిందో ఆ చిన్నారికి తెలియదు. ఆ సమయంలో తండ్రి స్నేహితుడు ఒక చిన్న రేడియో తెచ్చి ఇస్తాడు. అందులో ఒక రోజు ఒక డచ్ అధికారి ప్రసంగిసూ నాజీల దండయాత్ర వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకి అక్షర రూపం ఇవ్వమని, దానివల్ల భవిష్యత్తు తరానికి హిట్లర్ పైశాచికత్వం తెలుస్తుందని చెప్పాడు. అది విన్న అన్నే ప్రాంక్ ఆ రోజు నుంచి తన డైరీని ఆ దిశగా వ్రాయడం మొదలు పెడుతుంది.


రోజులు గడుస్తున్న కొద్దీ భయం, నైరాశ్యం వాళ్ళని ఆవహిస్తూ ఉంటుంది. రానురాను వారు తెచ్చుకున్న ఆహారం అయిపోతుంది. ఉన్నదాంట్లో సరుకుపోవడం దాదాపుగా అసాధ్యం అవుతుంది. ప్రతిక్షణం భయం, దుర్భరమైన జీవితం, మలమూత్రాలు విసర్జించిన చోటే ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితి. అంత ఇరుకైన గది. ఇవన్నీ చదువుతుంటే మనస్సు వికలమైపోతుంది. ఏ క్షణంలో మృత్యువు కబళిస్తుందో అని వాళ్ళు వణికి పోతూ ఉంటారు. "ఎప్పుడైనా అందరికీ చావు రావల్సిందే. అయితే ఆ చావు తొందర్లోనే తప్పదని తెలిసే దాని కోసం ప్రతిక్షణం ఉలిక్కి పడడంతోనే ఉంది అసలైన చావు. బ్రతుకు ధ్యాసే ఉండదసలు. సంగీతం,సాహిత్యం, లాలిత్యం అంతా అబద్దం అనిపిస్తుంది" అని అన్నే ఫ్రాంక్ ఒకచోట వ్రాసుకుంటుంది. ఇది చదివే ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు. నిస్సహాయత్వం లోనుంచి వచ్చిన ఆక్రోశం అన్నే ఫ్రాంక్ ని నిలువెల్లా దహించివేస్తూ ఉంటుంది. హిట్లర్ ఆక్రమణలో ఉన్న మిగిలిన దేశాల పరిస్థితులు రేడియో ద్వారా విన్నప్పుడు తాము చాలా మెరుగైన పరిస్థితిలో ఉన్నామని ఆమె భావిస్తుంది. చిన్న వయస్సులో ఆమె చూపే నిబ్బరం పాఠకులను అబ్బురపరుస్తుంది.
సైరన్ వినిపిస్తే చాలు. అది మా కోసమే అన్న భయం ఏ క్షణంలో మృత్యువు ఏ రూపంలో వస్తుందో అన్న ఆందోళన. మా రెండేళ్ళ అజ్ఞాత జీవితం ఈ రోజు తో ముగిసి పోతుంది. బయట ముష్కరులు తలుపులు పగల గొడుతున్న చప్పుడు మరణ మృదంగంలా వినిపిస్తోంది. నా ప్రియమైన కిట్టీ ! నిన్ను కూడా బానిసత్వంలోకి పటుకెళ్ళడం నాకు ఇష్టం లేదు వదిలి వెళ్తున్నందుకు క్షమించు. ఇన్నాళ్ళుగా నా మనస్సులోని భావాల్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు సెలవామరి. 1944 సంవత్సరం ఆగస్టు 1న అన్నే ఫ్రాంక్ తన డైరీలో వ్రాసుకున్న చివరి అక్షరాలివి.
ఆ తరువాత ఏం జరిగింది అన్నది అందులో లేదు. అయితే అన్నే తండ్రి బట్టో ఫ్రాంక్ తన ఉపోద్ధాత్రంలో చెప్పిన దానిప్రకారం 6 నెలలు తిరగక ముందే వారి కుటుంబం అంటా వేరు వేరు క్యాంప్ లలో చనిపోయారు. 1945 సంవత్సరంలో జర్మనీ ఓటమితో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. అయితే ఈ యుద్ధం ముగిసే చివరి దశలో హిట్లర్ మరింత పెట్రేగిపోయాడు. అతని ఆదేశాల మేరకు లక్షలాది మంది యూదులు కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించబడ్డారు. తర్వాత వారిని గ్లాస్ ఛాంబర్స్లో కుక్కి చంపేసారు. ఆ శవాలని తరలించడానికి బుల్డోజర్లు వాడవలసి వచ్చిందంటే పరిస్థితిని మనం ఊహించవచ్చు.
అన్నే ఫ్రాంక్ తండ్రి 1945 సంవత్సరంలో తాము తలదాచుకున్న రహస్య ప్రదేశానికి తిరిగి వచ్చి అన్నే వ్రాసుకున్న డైరీని తీసుకువెళ్లాడు. ఆ డైరీని ప్రచురించి ప్రపంచ వ్యాప్తంగా తన కూతురికి పేరు తీసుకురావాలన్న ఆయన కోరిక ఐదు సంవత్సరాల తర్వాత తీరింది. మొదట డచ్ భాషలో వచ్చిన ఈ పుస్తకం యూరప్ అంతా సంచలనం సృష్టించింది. 1952 వ సంవత్సరంలో ఆంగ్లం లోకి The Diary of a Young Girl పేరుతో అనువాదం అయ్యింది. 1959 సంవత్సరంలో ఇదే పేరుతో వచ్చిన సినిమా ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. అమస్టర్ డామ్ లో అన్నే కుటుంబం రహస్యంగా తలదాచుకున్న స్థావరం ఒక చారిత్రాత్మక స్థలంగా గుర్తించబడింది. 1999 సంవత్సరంలో టైమ్స్ మాగజై న్ 20వ శతాబ్దంలో జీవించిన అత్యంత ప్రతిష్టాత్మక వ్యక్తుల జాబితాను ప్రచురించింది. అందులో అన్నే ఫ్రాంక్ పేరు చోటుచేసుకుందంటే ఆమె డైరీ ఎంత సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.
అన్నే ఫ్రాంక్ తన దేశం కోసం వీరోచిత పోరాటాలు చేయలేదు. అసాధారణమైన మేధస్సును ప్రతిబింబించే రచనలు చేయలేదు. తను జీవించిన కాలం నాటి సామాన్యుల పరిస్థితులను ఆ తరం అనుభవించిన మానసిక సంఘర్షణను ప్రపంచానికి తెలియ చెప్పింది. అన్నే ప్రాంక్ డైరీని చదివిన ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని ఉద్వేగం చుట్టివేస్తుంది. వానరుడి నుంచి మనిషిగా మారడానిక్షి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. కాని మనిషి మృగంగా మారడానికి ఒక్క తరం కూడా పట్టలేదు. ఇందుకు ఉదాహరణ హిట్లర్ దురాగతాలే. ఆధునిక చరిత్రలోని ఒకానొక దశలో ఆటవికత ఎలా రాజ్యమేలిందో ఈ డైరీ చదువుతున్న అనుక్షణం మనకి గురుకు వస్తుంది. నేటికి యూరప్లోని కొన్ని దేశాలలో మతోన్మాదం పోకడలు కనబడటం ఆందోళనకరం. సామ్రాజ్యవాదం, జాత్యాహంకారాల అపవిత్ర కలయికకి నిదర్శనం హిట్లర్ వంటి దుర్మారులు. ఈ డైరీ చదివిన ప్రతిఒక్కరు ఫాసిజం ఎలాంటి వికృత దోరణులను సృష్టిస్తుందో అర్థం చేసుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నే వ్రాసిన ఈ డైరీ ప్రజాస్వామ్యాన్ని సామ్యవాదాన్ని కాపాడుకోవడానికి ఎంత అప్రమత్తం అవసరమో తెలియజెప్పే హెచ్చరిక.


No comments