ఆనందో బ్రహ్మ - యండమూరి వీరేంద్రనాథ్

“ ఒక మందాకినికి అతడు కొడుకవ్వాలనీ,
ఒక మందాకినికి అతడు భర్త అవ్వాలనీ,
ఒక మందాకినికి  అతడు తండ్రి ఆవ్వాలనీ కోరుకుంటే అది తప్పా…. తప్పేనా!”

ఒక స్త్రీ తన మనో విశ్లేషణలో పురుషుణ్ణి  ఊహించుకున్న ఈ కొన్ని పదాలు చాలు, స్త్రీకీ  పురుషుడుకీ  మధ్య ఉండాల్సిన బంధం ఎలాంటిదో అర్థం కావటానికి.  మరి ఇలాంటి పురుషుడిని తీర్చి దిద్దిన స్త్రీ కథే “ఆనందో బ్రహ్మ"

ఈ పేరు వినని పుస్తక ప్రియులు ఉండరేమో.  యండమూరి పుస్తకాలు అనగానే గుర్తుకు వచ్చే మొదటి మూడు నాలుగు పుస్తకాల్లో ఇది తప్పకుండా ఉంటుంది.

ఒక స్త్రీ… ఒక పురుషుడి కథ అంటే వాళ్లిద్దరూ భార్యా భర్తలో… ప్రేయసీ ప్రియులో కావాల్సిన అవసరం లేదు. ఆ బంధాలని మించిన అమూల్య బంధమేదో కనిపించిందంటే వాళ్లిద్దరూ ఒక సోమయాజి… ఒక మందాకినీ అయి ఉంటారు.

అవును వీళ్లిద్దరే ఈ నవలలో ప్రధాన పాత్రలు.

కథేమిటంటే  

“నడిచే వేదం లాంటి తాతయ్య వడిలో ఉన్నత వ్యక్తిత్వం సంతరించుకున్న ఒక పసితనం మీద తాతయ్య మరణం ఎన్ని మబ్బులు కమ్మేలా చేసిందో… పల్లె నుండి పట్నానికి వచ్చిన కౌమారం మీద కొత్తగా వచ్చి పడిన ఆత్మన్యూన్యత ఎలాంటి ప్రభావం చూపించిందో… దానినుండి ఒక నేస్తం ఎలా బయట పడేసిందో అన్నదే ప్రధాన కథ.   

గోదావరి ఒడ్డున ఉన్న ఒక పచ్చని పల్లెలో సాంప్రదాయం గల వేదాంతి అయినా అభ్యుదయ భావాలతో నిండిన మానవతావాది అయిన ఒక తాతయ్య వడిలో పెరిగిన సోమయాజి, ఆ తాతయ్య ని కోల్పోయి పల్లె నుండి పట్నం రావాల్సి వచ్చి అయిన వారి మధ్యలో అవమానాలు పడుతూ, వేదాలు ప్రబంధాలు చదివిన నోటికి నత్తి వచ్చేటంతగా కృంగిపోయి  తన మీద తాను సెల్ఫ్ పిటీ పెంచుకుని ప్రపంచం మీద ద్వేష భావం పెంచు కుంటున్న తరుణంలో, అతని  జీవితంలోకి  ప్రత్యూషమంత నిశ్శబ్దంగా వచ్చి వెన్నెలంత శ్రావ్యంగా అతని మీద ప్రభావం చూపుతూ అతని ఉన్నత వ్యక్తిత్వపు రహదారిగా మారుతుంది మందాకిని. సోమయాజంటే మందాకినీ తీర్చి దిద్దిన బొమ్మ. పదహారేళ్ళ సోమయాజికీ ఇరవై నాలుగేళ్ల మందాకినికీ మధ్యన ఉన్న స్నేహ బంధం ఈ “ఆనందో బ్రహ్మ"

మరి ఈ కథ  భవిష్యత్తులోకి ప్రయాణం ఎందుకు చేసిందో తెలుసుకోవాలనుంటే మీరూ నవల చదవాల్సిందే.  గతాన్ని వదిలేసి వచ్చిన భవిష్తత్తులో మానవీయ బంధాలకు అక్షర దర్శని ఈ పుస్తకం. సగం వరకూ ఒకలా మరో సగం దానికి పూర్తి వ్యతిరేకం గా… నవలలో అంతర్నవల ప్రక్రియని ఎంత సమర్థవంతంగా వాడుకోవచ్చో ఈ నవలని చదివితే అర్థం అవుతుంది.

ఈ పుస్తకం లో రాసిన భవిషత్తు కాలం  2044 A.D. నాటిది. అప్పుడు జరగవచ్చు అన్నట్లుగా  రాసిన చాలా విషయాలు ఇప్పటికే మనం చూస్తున్నాం.  భవిష్యత్తు కాలం లో జరిగినట్లు రాసిన కథ ప్రస్తుత వర్తమాన సమాజానికి సరిగ్గా సరిపోతుంది. మనుషులు యాంత్రిక మైన చోట ప్రేమ రాహిత్యం మొదలై మనసులు తమకి తాము సమాధులు కట్టుకుంటూ శిలాజాలుగా మారిపోతున్న రోజుల్లో ఒక తండ్రికీ పిల్లలకీ  మధ్య వచ్చే ఈ సంభాషణ మన అంతరంగాలని చెళ్ళున  చరిచినట్లు ఉంటుంది.

పెళ్ళికాకుండా గర్భవతి అయిన కూతురు, అబార్షన్ చేయించుకోవటానికి బాధ పడుతుంటే ఆమె తండ్రి "అతడెవరో చెప్పు వివాహానికి ప్రయత్నిద్దాం" అంటాడు

"ఒక కూతురు 'నేను కాలు జారానన్న' వెంటనే తండ్రి అడగవలసిన మొదటి ప్రశ్న నాన్నా ఇది! ఇన్నాళ్ళకి ఇప్పుడు అడిగావు. నీకు జ్ఞాపకం వుందా - అప్పుడు నువ్వేం అన్నావో? 'ఆస్పత్రుల విషయం నీకు అంతగా లేదు. నేను చూసుకుంటాంలే' అని. ఇంకో ప్రశ్నకూడా అడిగావు -'ఎందుకంత బాధ్యతారహితంగా ప్రవర్తించావ్' అని....నేనేమీ బాధ్యతారహితంగా ప్రవర్తించలేదు నాన్నా - కాస్త ప్రేమకోసం నేను చెల్లించిన "ధర" అది నేనే కాదు నాన్నా.... నీ పెద్ద కొడుకూ రెండో కొడుకూ......ఈ తరం మొత్తం ప్రేమకోసం తపించిపోతోంది. నీ పెద్దకొడుకు చచ్చిపోతే 'నా హత్యకి హంతకుడు' అన్న సూపర్ హిట్ నవల వ్రాశావేతప్ప దాని వెనుక వున్నా కారణం గ్రహించలేకపోయావు. అంతమంది యువతీ యువకులు వరుసగా ఆత్మహత్య చేసుకోవటానికి కారణం మీరు అనుకున్న దేదీకాదు నాన్నా. ప్రేమ రాహిత్యం. అవును ప్రేమ రాహిత్యం నీ చిన్న కొడుక్కు కావల్సింది అలసిపోతే మంచి మ్యూజిక్ వినిపించే కంప్యూటర్ కాదు నాన్నా, స్వయంగా కాఫీ పట్టుకొచ్చే తల్లి! ఏ క్షణం ఏ బాంబు పేలుతుందో, ఏ మూలనుంచి ఎవరు వచ్చి దోపిడీ చేస్తారో, మనం ముసలివాళ్ళం అయితే మన కొడుకులు తమతో పాటూ మనని వుంచుకుంటారో లేక 'హోం ఫర్ ది ఏజ్డ్'లో చేర్పిస్తారో అన్న భయంతో ఈ తరం వణికిపోతూంది. చివరికి మనం చచ్చిపోతే, మన బూడిదని తీసుకుంటారో లేదో కూడా మనకి అనుమానమే. మనల్నెవరు రక్షిస్తారు? ఎవరు? ఎవరు?"

ఆమె ఇచ్చిన ఈ సమాధానం మనలో ఎన్ని మనసులకి చేరుతుందో లేదో తెలియదు గానీ అది నిజమని ఒక్క క్షణమన్నా అనిపించకుండా ఉండటం కష్టం.

ఇటువంటి యాంత్రిక సమాజంలో

ఒక విధంగా ఇదొక  టైం ట్రావెల్ బుక్ అనవచ్చు. కాకపోతే మిగిలిన టైం ట్రావెల్ బుక్స్ లా  కొన్ని తరాల అంతరాలు ఇందులో లేవు. ఇది మన తరపు మన అంతరంగపు టైం ట్రావెల్ . ఈ టైం ట్రావెల్ తో మనం కనెక్ట్ అవ్వటం చాలా సులభం. ఎందుకంటే ఇందులో రాసిన భవిష్యత్తు గురించి రాసినవి కొన్ని ఇప్పటికీ మనం చూస్తున్నాం… ఇందులో రాసిన గతాన్ని మనం చూసి వస్తున్నాం. రెండూ మనకు అనుభవమైనవే.

ఒకటి భవిషత్తు… మరొకటి గతం … రెండిటి మధ్య వారధిలా మనిషి అంతఃప్రయాణం. రెండు విభిన్న కాలాలని బాలన్స్ చేస్తూ రాయటం చాలా కష్టం. ఈ నవల చదివితే రచయిత గతాన్ని భవిష్యత్తుని ఎంత చక్కగా బాలన్స్ చేశారో తెలుస్తుంది.

ఆనందో బ్రహ్మ  అనగానే చాలా మంది పుస్తక ప్రియులు చెప్పే సంగతి ఇందులోని భావుకత గురించి. అవును… నిజమే ఇందులో ఉన్న భావుకత్వపు గాఢత చాలా తక్కువ పుస్తకాల్లో మనం చదివి ఉంటాం.  కానీ ఆ భావుకతని మించి  మానసిక ధృడత్వపు పాఠం ఈ పుస్తకం. మనలో ఉన్న అంతర్గత శక్తిని మనకు తెలియ చెప్పి మనల్ని మనకి కొత్తగా పరిచయం చేసే నేస్తం…   ఇన్నాళ్లుగా భావుకుల భావుకత్వపు గాఢత లో ఈ సంగతి చాలా వరకూ పక్కకు వెళ్ళిపోయిందేమో  అనిపిస్తుంది.  

ఈ ఆనందో బ్రహ్మ పుస్తకం నిజమైన నేస్తానికి ఒక నిర్వచనం.

అక్షరాలా ఇది నిజం. ఇందులో  కథానాయిక మందాకిని లాంటి ఒక నేస్తం తోడుంటే చాలు… ఒక అమ్మ…  నాన్న… గురువు అందరూ తోడు  ఉన్నట్లే… అంత మాత్రమే కాదు మన జీవితం మన చేతుల్లోనే ఉన్నట్లు.  ఈ నేస్తం ప్రేమ భావనని నింపుకున్న ఒక సమున్నత ప్రవాహమై నిజమైన దాహార్తి తో వచ్చిన వారి దప్పిక తీర్చటంలో ఆనందాన్ని చూసుకునే మందాకిని ఒక నది లానే అనిపిస్తుంది.

ఒక ‘నేస్తం’ అవసరం ఎవరికి ఎక్కువగా ఉందో  అర్థం చేసుకుని ఎక్కడ ఆగిపోవాలో అక్కడ ఆగిపోయిన  కథానాయకుడి అంతరంగం అర్థమైతే చాలు మన జీవితాలన్నీ “ఆనందో బ్రహ్మ"

ఈ పుస్తకం చదివాక ఇలా అనిపించలేదంటే… మనల్ని మనం మళ్ళీ చదువుకోవటం మొదలు పెట్టాల్సిందే. “మనిషికీ మనిషికీ మధ్య ఇంటర్ నెట్ కనెక్షన్ కాదు ఉండాల్సింది మనసుకూ మనసుకూ మధ్య హ్యూమన్ కనెక్షన్”


2 comments

Padmarpita said...

మనల్ని మనం మళ్ళీ చదువుకోవటం మొదలు పెట్టాలి...ఆనందోబ్రహ్మ నవలపై అద్బుతమైన విశ్లేషణ

అన్యగామి said...

ఆనందోబ్రహ్మ గురించి సమీక్ష నేను వ్రాస్తే ఎలా ఉండాలనుకొంటానో ఈ క్రింది వాక్యాలు వాటిని చూపెడుతున్నాయి. మీ చివరి మూడు పేరాల విశ్లేషణ అద్భుతం. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమయంలో ఇటువంటి గట్టి తోడ్పాటు అతని/ఆమె ఉన్నతికి సోపానం కావాలి.

"అక్షరాలా ఇది నిజం. ఇందులో కథానాయిక మందాకిని లాంటి ఒక నేస్తం తోడుంటే చాలు… ఒక అమ్మ… నాన్న… గురువు అందరూ తోడు ఉన్నట్లే… అంత మాత్రమే కాదు మన జీవితం మన చేతుల్లోనే ఉన్నట్లు. ఈ నేస్తం ప్రేమ భావనని నింపుకున్న ఒక సమున్నత ప్రవాహమై నిజమైన దాహార్తి తో వచ్చిన వారి దప్పిక తీర్చటంలో ఆనందాన్ని చూసుకునే మందాకిని ఒక నది లానే అనిపిస్తుంది. "