అర్ధ చంద్రుడు

బయట అర్ధ చంద్రుడు కొబ్బరి చెట్టు వెనక నుంచి తొంగి చూస్తున్నాడు.
ఒక వేపు ఎగిసిపడుతున్న సముద్రం.. మరో వైపు మసక వెన్నెల్లో మెరుస్తున్న రెల్లుదుబ్బులు..
ఆకాశంలో నిశ్చలంగా వెలిగే నక్షత్రాలు.
నా మనసులో మాత్రం అంతులేని నిశ్శబ్దం.
ఇదిగో.. ఇలాంటి వర్షం కురుస్తున్న ఒక సాయంత్రంలోనే కదా నువ్వు చినుకు తీపిదనాన్ని పరిచయం చేసింది.
ఇప్పుడు ఈ గాలి మోసుకొస్తున్న ప్రతీ చినుకూ నీ శ్వాసని నా కోసం మోసుకొస్తోంది. 
బెన్ ఒక్రి ఏమంటాడో తెలుసా..
"In every moment, we are part of the infinite Stories that the universe is telling us and that We are telling the Universe...."
నిజమే కదా గాలీ, నేలా, చెట్టూ, పుట్టా... ప్రతీ క్షణం ఏదోఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. లేదా మన మనసులోని భావాలేవో వినడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి.
కానీ మనం చెప్పుకున్న ప్రతీ మాటా వీటన్నిటికన్న ఎంతో ప్రత్యేకం. నీ మాటలే కాదు, నీ శ్వాస, నీ ఉనికి నాకు చెప్పే కథలెన్నో.
కిటికీ సందుల్లోంచి తొంగి చూస్తున్న వెన్నెల తాగుతూ నేను... అల్లంత దూరాన కళ్ళల్లో నన్ను నింపుకుని ప్రేమగా నువ్వూ... ఎన్ని కథలు చెప్పుకుంటాం మనం. 
షికాడ పురుగుల గురించి... ఇక్తొమి గురించి...
రాయడం గురించి... రాయలేని ఖాళీతనం వరకు మనం చెప్పుకోని మాటలున్నాయా అసలు.
నాకు చలం నువ్వూ ఒకటే అంటే ఏమన్నావ్ నువ్వూ... " చలం వాజ్ స్టార్వింగ్ ఫర్ లవ్. నాకు ఆ దాహం లేదు. నువ్వొచ్చాక తీరిపొయింది" అని కదూ...
అలా అంటున్నప్పుడు నీ గొంతు చెప్పిన కథ ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా. 
ఎక్కడున్నావ్ నువ్వూ... నాలానే ఇలా వర్షంలో చేయి పెట్టి వాన చెప్తున్న కబుర్లు వింటున్నావా..
వాన తడిలో ఏమన్నా వెచ్చదనం, ఉప్పదనం తెలుస్తున్నాయా... అవి నా కళ్ళు చెప్తున్న కధలు.. అర్ధం అవుతోందా నీకు.
కాలం జ్ఞాపకాల్ని తుడిచేస్తుందని.. ఆశలన్నీ వాస్తవాల వెలుగులో మరుగున పడిపోతాయనీ ఎవరన్నారు నేస్తం.. ఇదిగో ఇక్కడ కురుస్తున్న ప్రతీ చినుకు నీ ఉనికిని గుర్తు చేస్తోంది.
బ్రహ్మకమలం చిగురు... తను పూసే లోపు నువ్వొస్తావా అని అడుగుతోంది నన్ను.
పసల పూడితో మొదలయిన కథ కంచికి చేరిందని వాటికి అర్ధం అవుతుందా...


No comments