నెమలీక

చిన్నప్పటి పుస్తకం మధ్యలోని
నెమలీక నవ్వు
ఇప్పుడిక్కడ
గుండె మీదుగా ఒక మెరుపులా 
ఉరకలెత్తుతున్న అనుభూతి

తెలిమబ్బులని తన రెక్కలపై మోసుకొచ్చే
గాలి రహస్యాలని
మెత్తగా లోకానికి వెల్లడి చేస్తున్న
గంధపు పరిమళాలన్నీ
 నన్నే చుట్టుకుంటున్న ఆనందం

చెట్ల ఆకుల్లో తేనె పిట్టల ఈలపాట వింటూ
 పాదాల దగ్గర గడ్డిపూలు మెత్తదనాన్ని ఆహ్లాదిస్తూ
వాటి మీద రాలిపడిన పొగడ పూల పరిమళం పలకరిస్తుంటే
ఇన్ని యుగాల చంద్రవంకలన్నీ
పారిజాతాల దడిలా
నా చుట్టూ కట్టబడినట్లున్నాయి

ప్రకృతంతా లాలిత్యపు రంగస్థలమై
వెన్నెల బిందువులనే తెరగా మార్చి
రాత్రి రంగుకి ధవళ గంధమద్దినట్లనిపిస్తుంటే
మళ్ళీ మళ్ళీ తరిస్తున్నా
స్మృతుల సంజీవనీ మంత్రం జపిస్తూ
నవ్వుల యంత్రంగా మురుస్తూ