నేను బడికి వెళ్తా (కాకలు తీరిన బాలుని కధ)

ఇది ఒక చైనా బాలుడి కథ. పేద రైతు కుటుంబంలో పుట్టి అత్యంత దయనీయమైన జీవితం గడిపి, పట్టుదలతో అనుకున్న గమ్యం చేరిన ఒక అరుదైన బాలుని ముచ్చటైన కథ.

అయితే మనం ఎందుకు చదవాలి  అన్న ఆలోచన మనలో ఎవరికైనా రావచ్చు. అందుకు సమాధానం పుస్తకం చదువుతున్న కొద్దీ మనకు దొరుకుతుంది. ఎందుకంటే దేశం ఏదైనా, వ్యవస్థ ఏదైనా పేదరికం పేదరికమే. భాష ఏదైనా కన్నీటి రుచి మారదు.

మనం పట్టణాల రహదారులు దాటి ఏ పల్లె డొంకలో కదిలి వెళ్ళినా మనకు కావ్ యూ పావ్ లాంటి బాలలు దర్శనమిస్తూనే ఉంటారు. చిరిగిన లాగూతో, మాసిన అంగీతో, బక్క పల్చని శరీరంతో ఇంటిముందు తన కంటే చిన్న బిడ్డను లాలిస్తూనో దొరల లోగిళ్ళలో పశువుల పాకను ఊడుస్తూనో, మేకలు గొర్రెల వెంట కావలి పోతూనో పంట పొలాల్లో పడిలేస్తూ పని చేస్తూనో ఉండోచ్చు. అది చైనా, రష్యా, ఇండియా... దేశం ఏదైనా కావచ్చు. అతను.. లేక ఆమె పేరు రాములో, నర్శిమ్ములో.. లేక "కావ్ యూ పావ్" ఏదైనా అయి ఉండవచ్చు.

వాళ్ళ జీవితం గురించీ, వాటి వెనుక ఉన్న సంఘర్షణ గురించీ తెలుసుకోవడానికి మనం ఈ పుస్తకం చదవాలి. చెత్త కుప్పల వెంట చిత్తుకాగితాలేరుకుంటున్న బాల్యం గురించి తెలుసు కోవడానికి, హోటళ్ళలో గ్లాసులు కడుగుతున్న పసిచేతుల కష్టం తెలుసుకోవడానికి లేలేత చేతులతో విరామం లేకుండా కష్టపడుతున్న బాల బాలికల నిస్సహాయ జీవితాల కన్నీటి గాధలు తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవాలి.

అలాంటి ఒక దయనీయ స్థితి నుండి చదువుకుని కాకలు తీరిన యోధుడుగా మారిన ఒక బాలుని కథ  "కావ్ యూ పావ్- నేను బడికి వెళ్తా". కథ. కావ్ యూ పావ్ ఆత్మ కథ ఇది. కావ్ యూ పావ్ 1927లో ఈశాన్య చైనాలోని లియోనింగ్ రాష్ట్రంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు. అతని బాల్యం, చైనాపై జపాన్ సామ్రాజ్యవాదులు జరిపిన దురాక్రమణ నేపధ్యంలో కథ మొత్తం నడుస్తుంది.

చదువంటే ప్రాణమిచ్చే బాలుడు కావ్ యూ పావ్. బడిలో చేరి ఒక నెలైనా గడవక ముందే అనివార్యంగా బడి మానుకుని ఒక భూస్వామి వద్ద పందుల కాపరిగా పని చేయవలసి వస్తుంది కావ్ కి. కావ్ కుటుంబం జపాన్ దురాక్రమణ దారుణ నిర్భందానికి దోపిడీకే కాక దుర్మార్గులైన భూస్వాముల దోపిడీకి కూఅడా గురవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న గ్రామం వదిలి బ్రతుకు తెరువు కోసం "తాలిన్" పట్టణం వలస వెళ్తుంది కావ్ కుటుంబం. అయితే అప్పటికే శత్రువుల ఆక్రమణలో ఉన్న తాలిన్ పట్టణ పరిస్థితి వాళ్ళ పల్లె కన్నా ఘోరంగా ఉంటుంది. 

పేదరికం వల్ల, సరైన వైద్యం లేక కావ్ తల్లి, తమ్ముడు చనిపోతారు. దిక్కు తోచని పరిస్థితుల్లో కావ్ కుటుంబం తిరిగి గ్రామానికి చేరుకుంటారు. కడుపు నింపుకోవడానికి కావ్ యూ పావ్ వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభిస్తాడు. ఇంత సంఘర్షణ లోనూ కావ్ చదువు పట్ల చూపే మమకారం మనల్ని దుఃఖంలో ముంచేస్తుంది.

1947లో ఆ గ్రామ విముక్తి పొందినప్పుడు 20సంవత్సరాల్ యువకుడిగా ఉన్న కావ్ యూ పావ్ చైనా ప్రజా విమోచనా సైన్యంలో చేరతాడు. దేశంలో భూస్వామ్య దోపిడీని, అభివృద్ధి నిరోధక కొమింటాంగ్ ప్రభుత్వాన్ని కూలదోయాలని దీక్ష పూనుతాడు. సైన్యంలో చేరిన కావ్ యూ పావ్ కు సమాజాన్ని అధ్యయనం చేయడానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఫలితంగా రాజకీయంగా సైద్ధాంతికంగా మరింత చైతన్యాన్ని పొందుతాడు. ఎలాంటి చైతన్యానికైనా చదువే పునాది అని బలంగా నమ్మిన కావ్ యూ పావ్ తన భవిష్యత్ తరాలను ఆ దిసగా ప్రొత్సహించాలని ప్రతిన పూనుతాడు.

కావ్ యూ పావ్ జీవిత చరిత్ర ప్రాతిపదికగా రచించబడిన ఈ కథ పేద రైతాంగ వర్గపు బాధల గురించి, అణిచివేత పట్ల బలహీన వర్గాల మనసుల్లో పేరుకు పోయే ద్వేషం గురించి మన మనసులు కదిలించేలా చెప్తుంది. భూస్వాముల దుర్మార్గాల గురించి ఈ కథ మన కళ్ళకు కట్టినట్లు తెలియచేస్తుంది. చైనా కమ్యూనిష్టు పార్టీ, రైతులు, కార్మికులు, ప్రజా సైన్యం చేసిన పోరాటాన్ని ప్రతిఘటనను ఈ కథ అత్యంత సహజంగా చూపిస్తుంది.

1958లో అప్పటికి 30ఏళ్ళ వయసులో చదువుపై మమకారం చంపుకోలేని కావ్ యూ పావ్ యూనివర్శిటీలో చేరి తన చదువుని కొనసాగిస్తాడు. గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి జర్నలిస్టుగా కొత్త జీవితం ప్రారంభించడంతో కథ ముగుస్తుంది. చదువు అతనికి జీవన భృతిని కల్పించడమే కాక రచయితగా మారడానికి... తన తర్వాత తరాలకు తగిన స్ఫూర్తిని అందించడానికి ఉపయోగపడింది. కావ్ యూ పావ్ కథ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించబడి అనేక భాషలలో అనువాదం అయింది. తెలుగులో "నేను బడికి వెళ్తా" పేరుతో కొల్లి సత్యనారయణ గారు అనువాదం చేసారు. మొదటిసారి ప్రచురించబడి ఇప్పటికి అర్ధ శతాబ్దం దాటినా అప్పటికీ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా సమకాలీనంగా అనిపించడం ఈ కథలోని గొప్పదనం. 

ముఖ్యంగా భారత దేశానికి ఇలాంటి కథల అవసరం ఎంతైనా ఉంది. భారత దేశ స్వతంత్ర్యానికి 70ఏళ్ళు దాటాయి. రాజ్యాంగానిది కూడా దాదాపు అదే వయసు. నేటి బాలలే రేపటి పౌరులని.. వారి భవిష్యత్తు మీదే సమాజపు పునాదులు నిర్మించబడ్డాయని తర తరాలుగా మన పాలకులు చెప్తూనే ఉన్నారు. కుల మత వర్ణ వర్గ జాతి లింగ బేదాలు లేకుండా ప్రతీ ఒక్కరికీ సమాన అవకాశాలు లభించాలని మన రాజ్యాంగం చెప్తోంది. బాల బాలిక లందరూ స్వేచ్ఛగా సగౌరవంగా ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉండాలని ఆర్టికల్ 39 చెప్తోంది.

అయినా ఈనాటికీ బడి ముఖం చూడని చిన్నారులు లక్షల్లో కోట్లలో ఉన్నారు మన దేశంలో. అలాంటి బాలల్లో చదువుకోలేక... చదువుపై మమకారం చంపుకోలేక ఎన్ని కష్టాలకైనా ఓర్చి "నేను బడికి వెళ్తా" అంటూ తాను చదువుకుని తన తర్వాతి తరాలకు స్ఫూర్తి నందించిన కాకలు తీరిన ఒక యోధుని కథ "నేను బడికి వెళ్తా" కథ.


No comments