మునివేళ్ళమీద



ఒక నిశ్శబ్దాన్ని
ప్రగాఢం చేసుకుంటున్నప్పుడల్లా
 దప్పికేదో
మునివేళ్ళమీద నడిచొస్తున్న సవ్వడి
ఇదిగో…
ఇప్పుడు మరీ దగ్గరకు వచ్చేసింది
రా !
నాకు దాహంగా ఉంది…
నిన్ను కనుగోవాలనుకున్న దాహమిది
నువ్వే దప్పికగా మారిన పంజరాన్ని నేను
ఇప్పుడు… ఈ పంజరాన్ని విప్పి వెళ్ళు
లోపరహితమైన స్వేచ్ఛలో
కాలం పొడుగూతా నిన్ను అనుసరించాలి
నా స్థలకాలాలన్నిటిలో అదృశ్య రూపపు
విశ్వాసానివై నువ్వే ఉన్నావు
అవును… నువ్వే ఉన్నావు
కనిపించకపోతేనేం
నీ అలికిడి ఎప్పుడూ నాకు పరిచితమే
మనసుకు చిక్కినంత త్వరగా
కంటికి చిక్కని నీ ఆచూకీ కోసం
యుగాల తపన పోగుబడి ఉందిక్కిడ
కంటి క్రింద కమ్ముకున్న
గాఢరాత్రులన్నిటినీ దాటుకుంటూ
నువ్వెవరో తెలుసుకోవాలి
నిన్ను నన్నుగా గెలుచుకోవాలి
మహీ
03.05.2017

No comments