కనురెప్పల కాపలా
తాను నువ్వుగా నువ్వు తానుగా మారడమన్న
అస్తిత్వాల బదిలీనే ప్రేమనుకుంటే
మరి ఇక మనిషికి ప్రేమ నిషిద్ధమే
ఒకరినొకరం కొల్లగొట్టుకోవడంలో
ఒక ఖాళీతనం మొదలవుతుందన్న నిజం
అస్తిత్వాలు మిథ్యగా మిగిలి
మనసు డొల్లగా మారినప్పుడే బయటకొస్తుంది
నిన్ను నీలా నిలబెట్టుకుంటూ
తనని తనలా స్వీకరించడమే ప్రేమ
ఆరాధన అపరిమితమవ్వటమే కాదు
అవసరమైన చోట తన పహారా
అపరిచితంగా ఉండిపోవాలి గాని
భావ బంధనాల పంజరంలో
ఒకరికొకరు నిలువరించే వేటని
ఒక ఆటగా మార్చుకోకూడదు
నీకు తానూ తనకు నువ్వూ
వీడలేని బంధమవ్వాలి కానీ
నవ్వులని లుప్తంగా రువ్వే భయమై
మనసు చుట్టూ ముళ్ళతీగలాంటి బంధనమై
గుండె లోపలి రుధిరాన్ని కళ్ళ నీరంగా మార్చుకుంటూ
కడలి పుట్టుకకి అరువిచ్చేలా ఉండకూడదు
తన రక్షణ వ్యాపితమవ్వని క్షణాలేవీ నీకు
నీ మనసంటని కాల విహంగాలు తనకూ
తారసపడకపోవడంలోనే
ఒకరికొకరెంతో వెల్లడవ్వాలి
ఒకరి కనుపాపకొకరు కనురెప్పలుగా మారిపోవాలి
అవును అలాగే మారి పోవాలి
కనురెప్పల కాపలా ఎరుగని కనులంటూ ఉన్నాయా మరి?
Post a Comment