ఒక అద్దాన్ని తోడుగా

ఈలోకంలో ఎవరు ఎవర్నీ మోసం చెయ్యరు..
బదులుగా ఒక అద్దాన్ని తోడుగా ఇచ్చి వెళతారు..
అందులో చిత్రంగా.. నీకు నువ్వు కనపడవు..
ఇన్నాళ్ళూ నువ్వు వాళ్ళకెలా కనిపించావో అది కనపడుతుంది..
అది నీ చిత్రమనే గీస్తారు సుమా..
కానీ నువ్వు లేనప్పుడు గీసినది..
నీకు జవాబు చెప్పలేని మోహం..
నిన్నే ఆకాంక్షగా చేసుకున్నవ్యామోహం..
నిన్ను సమాధాన పరచలేని స్వార్ధం..
తనను తెలుసుకోనివ్వని ఓ అందమైన మోసం
ఆఖరుకు తామే ఒప్పుకోని తమలోని మరొక పార్శ్వం..

కలగలిపి గీసిన చిత్తరువది..
 

అది నీ చిత్రం కాదని నువ్వు అనుకోవచ్చు..
నీకిచ్చి వెళ్ళిన అద్దంలో నీక్కనిపించే ప్రతీ ఛాయా
తమ ప్రతిబింబాల అవశేషమే అవ్వవచ్చు గాక
కానీ దాని కొలమానమూ వాళ్ళు నిన్నొక స్వార్థంగా
తమకు తాము చేసుకున్న బాసలే కదా..
ఈ కాలముంది చూశావూ... ఊరకే ఉండదు
ప్రతి రహస్యాన్ని వెల్లవేసే తన సహజసిద్ధ స్వభావాన్ని
మరింత సహజంగా కొనసాగిస్తూ
నిన్ను తూసిన
కొలమానాల వెనుక దాయబడిన వారి  స్వార్థాన్ని
తమ ఆత్మీయ హస్తాల స్పర్శ
ఎప్పుడూ ఒక మృగతృష్ణయేనన్న నిజాన్ని బయట వేసేస్తుంది

మరి ఇప్పుడైనా  బయటపడు నేస్తం..
సాగిపో వీలయితే విశ్వప్రేమ దిశగా..

లేదంటే అంతర్ముఖత దిశగా..

కానీ...

ఈ రోజు నువ్వు నిల్చున్న ఈ కూడలే నీ నిజం..
అవును అదే నిజం
అప్పుడిక నీకు నువ్వే ఆనందం
ఆ ఆనందమే నీకు నువ్వు రాసుకునే ఓ అరుదైన అహం 


No comments