రాసేవారికి... చదివేవారికి...

ఏప్రిల్ 23!!

ప్రపంచ పుస్తక దినోత్సవం!!!

‘మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బందిపెట్టే రచనల్నే మనం చదవాలి. మనం చదువుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేల్కొలపని పక్షంలో అసలు చదవడం ఎందుకు? మంచి పుస్తకం ఒక దుస్సంఘటన లాగా మనల్ని ప్రభావితం చేయాలి. 

మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆప్తుల మరణం లాగా మనల్ని తీవ్రంగా కలచివేయాలి. అందరికీ దూరంగా ఏకాంతంగా అరణ్యాలకు పారిపోవాలనిపించేలా ప్రేరేపించాలి. పుస్తకం మనలో గడ్డకట్టిన సముద్రాల్ని గొడ్డలిలాగా పగలగొట్టాలి’ అంటారు కాఫ్కా.

"అక్షర రూపం దాల్చిన సిరా చుక్క వేయి మెదళ్ళకు కదలిక" అంటారు కాళోజీ.

పుస్తకమంటే జ్ఞానప్రసూనం
పుస్తకమంటే అనుభవాల భాండాగారం
పుస్తకమంటే చరిత్రకి అక్షర చిత్రం

అమ్మా, నాన్న, గురువుల ధర్మాలని ఏకకాలంలో నిర్వర్తించే ఏకైక నేస్తం పుస్తకం.

పుస్తకం దాచుకున్న ఒక్క వాక్యం చాలు, మన జీవితం ఎక్కడో మలుపు తిరగడానికి. అవును, ఒక్కొక్క సారి ఆ ఒక్క వాక్యమే మన ఆలోచనా సరళిని మార్చేసి మనల్ని మనం కొత్తగా అవిష్కరించుకునేలా చేస్తుంది. అసలు ఒక పుస్తకంలోకి వెళ్ళడమంటే అక్షరాల వెనుక కళ్ళని పరుగెత్తించడం కాదు. అక్షరాల్లో ఒదిగిన భావాన్ని మనసుకు హత్తుకోవడం. మనసుకంటూ హత్తుకున్నాక జీవితం కాంతివంతం కావటం ఎంతసేపని...

ఒక్కోసారి ఆలోచిస్తే ఎంతో విచిత్రంగా ఉంటుంది...
ఎక్కడో... ఎవరో ఒకరు
దోసెడు అక్షరాల్ని కాలానికి అంకితమిస్తారు.
పిడికెడు తన ఆలోచనల్ని మనసుతో పేర్చి
పుస్తకంగా చల్లుతారు.
ఇంకో చోటెక్కడో...
మరొకరు
ఆ అక్షరాలు చదవడానికే పుట్టినట్లు ఉంటారు.
ఆ పుస్తకాన్ని తెరిచి...
పరిచిత పాత్రలలో
తనని తాను ఒంపుకుంటారు..
అందుకే...
రాసేవారికి... చదివేవారికి...
ఇద్దరికీ...
వేల వేల నమస్సులు!!!


No comments